BJP | బీజేపీపై అసెంబ్లీ ఎన్నిక‌ల ఎఫెక్ట్

  • Publish Date - April 11, 2024 / 04:30 PM IST

  • అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిన నేత‌లే ఎంపీగా పోటీ

  • మోడీ భ‌జ‌న చేస్తున్న రాష్ట్ర ముఖ్య నేత‌లు

  • 40 ఎమ్మెల్యేలన్నారు…ఇప్పుడు 17 ఎంపీలంట

  • నేత‌ల ప్ర‌క‌న‌ట‌లు సొంత పార్టీ కార్య‌క‌ర్త‌లే న‌మ్మ‌లేని ప‌రిస్థితి

  • అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రివ‌ర్సు ఫ‌లితాలు

  • ఇప్పుడు కాంగ్రెస్ ను మించి అంచ‌నా

విధాత ప్ర‌త్యేక ప్ర‌తినిధి: అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 14 ఎంపీ స్థానాలు గెలుచుకుంటుంద‌ని చెబుతుండ‌గా మొన్న‌టి ఎన్నిక‌ల్లో కింగ్ మేక‌ర్ అవుతామంటూ చెంగుచెంగుమ‌న్న బీజేపీ మాత్రం కించిత్తుత‌గ్గ‌కుండా 17కు 17 స్థానాలు గెలుస్తామంటూ జోస్యం చెబుతూ ప్ర‌చార ఆర్బాటం చేస్తున్నారు. రాష్ట్రంలో మొన్న హోరాహోరీగా జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను అప్పుడే జ‌నం మ‌రిచిపోయినట్లు అప్ప‌టి సంగ‌తి ప‌క్క‌న‌బెట్టి, ఇప్ప‌టి ప‌రిస్థితి వేరంటూ కొత్త భాష్యం చెబుతున్నారు.

విష‌మేమిటంటే మొన్న‌టి ఎన్నిక‌ల్లో ఎంపీలుగా ఉంటూ ఎమ్మెల్యేలుగా పోటీచేసి ఓట‌మిపాలైన ముఖ్య‌నాయ‌కులు ఇప్పుడు మ‌రోసారి ఎంపీలుగా బ‌రిలో ఉన్నారు. నిన్న‌టి ఓట‌మిని ప‌క్క‌న‌పెట్టి ఇప్పుడు చూడు మా త‌డ‌ఖా అంటున్నారు. ఇప్పుడు జ‌రిగేవీ దేశ‌స్థాయి ఎన్నిక‌ల‌ని, మ‌ళ్ళీ జ‌నం బీజేపీని కోరుకుంటున్నారంటూ… ప్ర‌ధానిగా మోదీ పాల‌న‌కు భారీగా మ‌ద్ధ‌తు తెలియ‌జేసేందుకు జ‌నం సిద్ధంగా ఉన్నారంటూ మాట‌కు ముందోసారి మోదీ, మాట‌కు వెనుకోసారి మోదీ భ‌జ‌న చేస్తున్నారు. కొంద‌రు నాయ‌కులు ఒక్క‌డుగు ముందుకేసి రాముని పేరు వ‌ల్లెవేస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో హోరాహోరీ

తెలంగాణ అసెంబ్లీకి న‌వంబ‌ర్ లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో మూడు పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నువ్వానేనా అనే తీరు పోటీప‌డ్డాయి. కేసీఆర్ ప‌లు సంద‌ర్భాల్లో మాట్లాడుతూ మూడ‌వ‌సారి అధికారంలోకి వ‌స్తామంటూ ప్ర‌క‌టించారు. ప్ర‌తిప‌క్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు త‌మ‌తో పోటీలో కూడా ఉండ‌వంటూ చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ జాడే లేదంటూ చుల‌క‌న చేస్తూ మాట్లాడారు. ఎన్నిక‌ల సంద‌ర్భంగా పార్టీ అధినేత కేసీఆర్ ప‌తాక‌స్థాయిలో ప్ర‌చారాన్ని చేప‌ట్టారు. ప్ర‌స్తుతం త‌మ ఖాతాలో 104 స్థానాలున్నాయ‌ని, ఈ ఎన్నిక‌ల్లో 119 స్థానాల‌కు గాను110 స్థానాల‌కు త‌గ్గ‌కుండా గెలుస్తామంటూ ధీమా వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ పై తీవ్రంగా విరుచుకుప‌డుతూనే బీజేపీని విమ‌ర్శించారు. తీరా అధికారం కోల్పోయి 39 స్థానాల‌కే ప‌రిమిత‌మై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా మిగిలారు.

అసెంబ్లీ మాదేన‌న్న‌ బీజేపీ

బీఆర్ఎస్ కు ఏమాత్రం త‌గ్గ‌కుండా బీజేపీ విప‌రీత ప్ర‌చారం కొన‌సాగించింది. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ ను టార్గెట్ చేసి విస్తృత ప్ర‌చారం చేప‌ట్టారు. కేంద్రంలో అధికార పార్టీగా త‌మ‌కున్న హంగూ, ఆర్భాటాల‌ను వంద‌రెట్లు వినియోగించుకున్నారు. పార్టీ కేంద్ర నాయ‌క‌త్వం, కేంద్ర మంత్రులు, ప్ర‌ధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డాతో పాటు అసెంబ్లీ స్థాయి ప్ర‌చారానికి కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఇత‌ర రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు వ‌రుస ప‌ర్య‌ట‌న‌ల‌తో హోరెత్తించారు. గ‌ల్లీగ‌ల్లీ ప్ర‌చారాన్ని కొన‌సాగించారు. వీరి వెనుక సంఘ్ ప‌రివార్ శ‌క్తులు రంగంలోకి దిగి అంత‌ర్గ‌త స‌హ‌కారం, వ్యూహాలు ర‌చించి హోరెత్తించారు.

ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది బీజేపీ ప్ర‌భుత్వ‌మే అన్నంత స్థాయికి ప్ర‌చారాన్ని కొన‌సాగించారు. స‌ర్వ‌శ‌క్తులొడ్డుతూనే గెలుపున‌కు స‌హ‌క‌రిస్తుంద‌ని మాదిగ రిజ‌ర్వేష‌న్ పోరాట స‌మితి నేత మంద కృష్ణ మాదిగ‌ను వ్యూహాత్మ‌కంగా రంగంలోకి దింపారు. మాదిగ‌ల‌తో హైద‌రాబాద్ భారీ స‌భ నిర్వ‌హించి… మోదీ, కృష్ణ మాదిగ‌ల ప‌ర‌స్ప‌ర ఆలింగ‌నం.. అభివాదాల‌తో స‌భావేదిక‌ను ర‌క్తి క‌ట్టించారు. దీనికి త‌గిన స్థాయిలో కృష్ణ మాదిగ కూడా ఇక మాదిగ‌ల‌కు మోదీయే దేవుడ‌న్నంతగా కొనియాడారు. బీజేపిని గెలిపించాల‌ని మాదిగ రిజ‌ర్వేష‌న్ల అమ‌లుకు కేంద్రం చ‌ర్య‌లు చేప‌డుతుందంటూ గ‌ట్టి విశ్వాసాన్ని క‌ల్పించే ప్ర‌య‌త్నం చేశారు.

ఎన్నిక‌ల ప్ర‌చారప‌ర్వం సాగుతున్న క్ర‌మంలో మోదీ హామీని ఏ మేర‌కు న‌మ్మొచ్చున‌నే అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి. కృష్ణ మాదిగ‌పై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయిన‌ప్ప‌టికీ కృష్ణ మాదిగ‌ బ‌హిరంగంగా బీజేపీ అభ్య‌ర్ధుల‌ను గెలిపించాలంటూ బ‌రిలోకి దిగారు. హెలికాప్ట‌ర్ వినియోగించి ఎన్నిక‌ల ప్ర‌చారం కొన‌సాగించ‌డం గ‌మ‌నార్హం. బీజేపీ ముఖ్య‌నేత బిఎల్ సంతోష్ ఎన్నిక‌ల స‌మ‌యంలో మాట్లాడుతూ బిజేపీ 40 స్థానాలు గెలిచి రాష్ట్రంలో కింగ్ మేక‌ర్ గా మారి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటూ జోస్యం చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే సీట్లు రావన్నారు. త‌మ‌కు వ‌చ్చే 40 స్థానాల‌తో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ న‌మ్మ‌బ‌లికారు.

తీరా ఎన్నిక‌ల ఫ‌లితాల్లో 8 ఎనిమిది స్థానాలు ద‌క్కించుకున్న‌ది. బీజేపీ రాష్ట్రంలో అధికారం మాదేన‌నే అతి విశ్వాసాన్ని తెలంగాణ ప్ర‌జ‌లు మొగ్గ‌లోనే తుంచేశారు. ఇప్పుడు ఎంపీ ఎన్నిక‌ల మీద కూడా అదే విధ‌మైన ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నార‌ని సొంత‌పార్టీ నాయ‌కులే విమ‌ర్శిస్తున్నారు. వార్డు మెంబ‌ర్ ను కూడా గెలిపించ‌లేని కొంద‌రు నాయ‌కులు బీరాలు ప‌లుకుతున్నార‌ని క్షేత్ర‌స్థాయిలో ప‌నిచేస్తున్న వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. నిజంగా బీజేపికి అంతబ‌ల‌ముంటే వ‌ల‌స‌ప‌క్షుల‌కే టికెట్లు ఎలా? వ‌చ్చాయంటూ వారు సందేహాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. నోరుకు హ‌ద్దూ అదుపూలేదంటున్నారు.

అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల ఎఫెక్టు

రాష్ట్రంలో అధికారం మాదేనంటూ బీజేపీ నాయ‌కులు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గొట్టిన ఊద‌ర అప్పుడే ప్ర‌జ‌లు మ‌రిచిపోయిన‌ట్లు ఆ పార్టీ నేత‌లు భావించి ఇప్పుడు 17కు 17 ఎంపీ స్థానాలు మావేనంటున్నారు. దీనికి గ‌త 2018లో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కేవ‌లం ఒకే ఎమ్మెల్యే స్థానం గెలిచి త‌ర్వాత జ‌రిగిన పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో నాలుగు స్థానాల్లో ఎంపీలు గెలువ‌డం సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఉత్త‌ర తెలంగాణ‌లోని ఆదిలాబాద్, నిజామాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, సికింద్రాబాద్ ఎంపీ స్థానాల‌ను గెలుచుకుని రాజ‌కీయ ప‌రిశీల‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచిన విష‌యం తెలిసిందే.

తాజాగా మ‌రోసారి ఈ పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో గ‌త ఫ‌లితాలే వ‌స్తాయంటూ న‌మ్మ‌బ‌లుకున్నారు. నిజ‌మే లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు, శాస‌న స‌భ ఎన్నిక‌ల‌కు వ్య‌త్యాసం ఉంటుంది. కానీ పూర్తిగా వ్య‌తిరేక ఫ‌లితాలొస్తాయ‌ని చెప్ప‌డం అత్యాశే అవుతోందని రాజ‌కీయ ప‌రిశీల‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రాష్ట్ర స్థాయిలో అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లో గ‌ట్టి అభ్య‌ర్ధిని బ‌రిలో నిల‌ప‌లేని బీజేపీ రాష్ట్రంలో ఉన్న 17కు 17 స్థానాలు మావే అంటూ మీడియా వేదిక‌గా చేసే ప్ర‌చారాన్ని చూసి కొంద‌రు ప‌రిశీల‌కులు న‌వ్వ‌కుంటున్నారు. మోదీ ప్ర‌భంజ‌నం పేరుతో రాష్ట్రం బీజేపీ నేత‌లు చేస్తున్న విమ‌ర్శ‌లు, ప్ర‌క‌ట‌న‌లు చూసి ముక్కున వేలేసుకుంటున్న‌వారున్నారు.

పైగా కేవ‌లం నాలుగు నెల‌ల క్రిత‌మే జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీలు బండి సంజ‌య్, సోయం బాపురావు, ధ‌ర్మ‌పురి అర్వింద్ తో పాటు అతిర‌థులు అనుకుంటున్న ఈటెల రాజేంద‌ర్, ర‌ఘునంద‌న్ రావు ఎంవీఎస్ఎస్ ప్ర‌భాక‌ర్ త‌దిత‌ర ముఖ్య‌నాయ‌కులంతా పోటీచేసి ఓట‌మిపాల‌య్యారు. డికె అరుణ‌, కిష‌న్ రెడ్డి ముందు జాగ్ర‌త్త‌ప‌డ్డార‌నే చ‌ర్చ ఆ పార్టీలో ఉంది. మ‌రో నిష్టూరమైన అంశ‌మేమిటంటే రాజాసింగ్ మిన‌హా గెలిచిన ఎమ్మెల్యే అభ్య‌ర్ధులంతా తొలిసారి కావ‌డం, అదీ నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల‌కు చెందిన వారు కావ‌డం గ‌మ‌నార్హం.

ఇక మోదీ-షాలతో పాటు పార్టీ కేంద్ర‌నాయ‌క‌త్వ‌మంతా కేంద్రీక‌రించిన అత్తెస‌రు ఫ‌లితాలే వ‌చ్చాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సానుకూల ఫ‌లితాల కోసం అప్ప‌టి వ‌ర‌కు అట‌కెక్కించిన విభ‌జ‌న హామీల్లో కొన్నింటిని ప్రారంభించారు. నిజామాబాద్ లో ప‌సుపుబోర్డు, కాజీపేట‌లో వ్యాగ‌న్ ప‌రిశ్ర‌మ‌, ములుగులో గిరిజ‌న యూనివ‌ర్సీటీ ప్ర‌క‌ట‌న‌లు చేసినా ఫ‌లితాల్లో పెద్ద‌తేడా క‌నిపించ‌లేదు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఇప్ప‌టికే ప్ర‌ధాని మోదీ ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ప్రాంతాల్లో భారీ స‌భ‌లు నిర్వ‌హించారు.

అయినా పెద్ద‌గా మార్పు క‌నిపించ‌డంలేదంటున్నారు. ఈ సారి బీజేపీలో తొలి నుంచి ప‌నిచేసిన వారికి టికెట్ ఎగ‌నామం పెట్టి బీఆర్ఎస్ నుంచి వ‌ల‌స వ‌చ్చిన నేత‌ల‌కే ప్ర‌ధానంగా ఎంపీ టికెట్లు ఇచ్చార‌నే విమ‌ర్శ బ‌లంగా ఉంది. పాత బీజేపీ, కొత్త బీజేపీ అంటూ నూత‌న చ‌ర్చ సాగుతోంది. రాష్ట్ర అధ్య‌క్షుడు కిష‌న్ రెడ్డి, ఎంపీ ల‌క్ష్మ‌ణ్‌ మీడియా ప‌రంగా రోజుకో ప్ర‌క‌ట‌న చేస్తూ 17 స్థానాల్లో గెలుస్తామంటూ ఉచిత ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారంటూ పార్టీ జిల్లాల నాయ‌క‌త్వం గుర్రుగా ఉంది.

Latest News