BJP |
- బీజేపీ నాయకులకు టార్గెట్లు
- పెద్ద సంఖ్యలో వాహనాల ఏర్పాటు
- సభ నిర్వహణతో లక్ష్యం పూర్తి
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఖమ్మంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సభ కోసం వరంగల్ జిల్లా బీజేపీ నాయకులు చెమటోడ్చారు. పలు మార్లు వాయిదా పడుతూ వచ్చిన సభ ఎట్టకేలకు నిర్వహించి బీజేపీ నాయకత్వం ఒక విధంగా భారాన్ని దింపుకున్నది. ప్రకటించిన మాటను నిలబెట్టుకోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఈ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ ప్రధాన నేత అమిత్ షా హాజరైతున్నందున ఈ సభను సవాల్ గా తీసుకుని నిర్వహించారు.
విపక్షాల విమర్శలకు తావివ్వకుండా అనుకున్నట్లుగా ఖమ్మంలోనే సభ నిర్వహించి అదే అమిత్ షాను రప్పించి విజయవంతం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించి విజయవంతమయ్యారు. ఖమ్మంలో సభకు వరంగల్ జనాన్ని పెద్ద సంఖ్యలో తరలించారు. దీని కోసం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని దాదాపు 9 నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్య జనాన్ని సమీకరించారు.
ఖమ్మం పక్కనే ఉన్న మానుకోట జిల్లా పై ప్రధాన దృష్టి పెట్టారు. ఈ జిల్లా పై పార్టీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ కేంద్రీకరించి నాయకుల్లో ఉత్సాహాన్ని నింపారు. వరంగల్, హనుమకొండ జిల్లాల నుంచి జనాన్ని తరలించారు. డాక్టర్ కాళీప్రసాద్ బీజేపీలో చేరనున్నందున పరకాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలను తరలించారు.
గతంలో ఈయన బీజేపీని చేరాల్సి ఉండగా వాయిదా పడింది. స్థానికంగా సభ నిర్వహించి బీజేపీ తీర్ధం పుచ్చుకోవాలని కాళీప్రసాద్ భావించారు. దీనికి అడ్డంకులు సృష్టించారు. దీంతో ఆయన చేరిక వేదికను ఖమ్మానికి మార్చారు. ఖమ్మం సభ కోసం పెద్ద సంఖ్యలో బస్సులు, ఇతరత్రా వాహనాలు ఏర్పాటు చేశారు. పనిలో పనిగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పార్టీలో చేరాలనుకునే వారిని సైతం ఖమ్మం వేదికగా చేర్పించే కార్యక్రమాన్ని చేపట్టారు.
జనాన్ని తరలించేందుకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులకు టార్గెట్ విధించారు. మానుకోటలో హుస్సేన్ నాయక్, వర్ధన్నపేటలో కొండేటి శ్రీధర్, వరంగల్ తూర్పులో కుసుమ సతీష్, గంటా రవికుమార్, ఎర్రబెల్లి ప్రదీప్ రావులు జనాన్ని తరలించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. వీరికి హనుమకొండ, పరకాల, నర్సంపేట, భూపాలపల్లి నియోజకవర్గాల నాయకులు చేయూతగా నిలిచారు.
పేరుకు ఖమ్మంలో సభ పెట్టారుగానీ తమ పైన్నే భారం వేశారని, బలం లేని ‘ప్రదర్శన’కు సిద్ధమై ఫాల్స్ ప్రెస్టేజీకి పోయి తమను ఇబ్బందులకు గురిచేశారని కొందరు అసంతృప్తితో ఉన్నప్పటికీ పైకి నోరుమెదపలేని పరిస్థితి ఏర్పడింది. అంతర్గత కారణాలేమైనా ఖమ్మం జిల్లాలో భారీ సభ నిర్వహణతో బీజేపీ అక్కడ చర్చకు తెరతీసింది. ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు దోహదం చేసింది.