- పార్టీ కోసం పనిచేసిన వారికి టికెట్లు ఇవ్వాలి
- తాను కూడా అవమానాలకు గురయ్యాను
- బీజేపీ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
విధాత : పార్టీలో తనకు ఎవరితోనూ అభిప్రాయ బేధాలు లేవని, తమ నేతలపై కామెంట్ చేసే సంస్కారహీనుడని తాను కాదని బీజేపీ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంగనర్ పార్లమెంట్ నియోజకవర్గంలో చేపట్టిన ప్రజాహిత యాత్రలో బండి సంజయ్ మాట్లాడుతూ తన వల్లనే పార్టీ ఉందని ఎప్పుడు చెప్పలేదన్నారు. తాను ఉన్నా లేకున్నా పార్టీ ఉంటుందన్నారు. పార్టీలో తాను కూడా అవమానాలకు గురయ్యానని.. చాలా మంది పోటీ చేసిన వారు పార్టీలోంచి వెళ్లిపోతున్నారని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు టిక్కెట్లు ఇవ్వాలని కోరారు.
కార్యకర్తలకు అన్యాయం జరిగితే ప్రశ్నించే వ్యక్తినని, తనకు కల్మషం ఉండదని, ఎవరి మీద కోపం ఉండదన్నారు. పార్టీలో ఉంటూ పార్టీ కోసం పనిచేయక పోతే కన్న తల్లికి ద్రోహం చేసినట్లేనని వ్యాఖ్యానించారు. బీజేపీ కార్యకర్తల మీద కేసులు పెట్టించిన వారిని, కార్యకర్తలను రాచి రంపాన పెట్టిన వారిని పార్టీలో చేర్చుకోవడాన్ని వ్యతిరేకిస్తానన్నారు. బీఆరెస్‌కు ఓటు వేస్తే మోరిలో వేసినట్లేనని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన సాగుతున్న తీరుతో ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు చేసి తప్పు చేశామని భావిస్తున్నారని పేర్కోన్నారు. కాంగ్రెస్‌పై క్రమంగా వ్యతిరేకత వ్యక్తం అవుతోందన్నారు.