సీఎం రేవంత్‌రెడ్డిలో అభద్రతా భావం: ఎంపీ లక్ష్మణ్

ప్రభుత్వ మనుగడపై సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఆయనలోని అభద్రతాభావాన్ని చాటుతున్నాయని, సొంత పార్టీ ఎమ్మెల్యేలపై నమ్మకం లేక హైటెన్షన్ వైర్‌గా కాపలా ఉంటానంటున్నాడని బీజేపీ రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్ చురకలంటించారు

  • Publish Date - April 20, 2024 / 06:10 PM IST

కేసీఆర్ మోకాళ్ల యాత్ర చేసినా జనం నమ్మరు
బీజేపీ ఎంపీ లక్ష్మణ్

విధాత, హైదరాబాద్‌ : ప్రభుత్వ మనుగడపై సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఆయనలోని అభద్రతాభావాన్ని చాటుతున్నాయని, సొంత పార్టీ ఎమ్మెల్యేలపై నమ్మకం లేక హైటెన్షన్ వైర్‌గా కాపలా ఉంటానంటున్నాడని బీజేపీ రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్ చురకలంటించారు. 100 రోజుల తమ పరిపాలనను రెఫరెండంగా చేసుకుని 14 ఎంపీ స్థానాలు గెలుస్తామన్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడు హామీల అమలుపై మొసలి కన్నీరు పెట్టుకుంటున్నారని విమర్శించారు.

తెలంగాణాలో బీజేపీకి, మోదీకి రోజు రోజుకు అదరణ పెరుగుతోందన్నారు. అందువల్లే మోడీ చర్మిష్మా తగ్గించి చూపేందుకు బీఆరెస్‌, కాంగ్రెస్ పార్టీలు చీకటి ఒప్పందం చేసుకున్నాయని ధ్వజమెత్తారు. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాతో టచ్ లో ఉన్నారని కేసీఆర్‌ చెప్పిన 24 గంటలు గడవక ముందే బీఆరెస్‌ ఎమ్మెల్యే ఒకరు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారని, ఈ రెండు పార్టీలు కలిసి గేమ్ అడుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ దేశంలోనూ రాష్ట్రంలోనూ గెలిచే పరిస్థితి లేదన్నారు.

ప్రజలు బీఆరెస్ పార్టీని ఓడించినా కేసీఆర్, కేటీఆర్‌కు అహంకారం తగ్గలేదని, అదికారం లేకుండా ఉండలేకపోతున్నారని, పదేళ్ల బీఆరెస్ కుటుంబ, అవినీతి పాలనకు వ్యతిరేకంగానే కేసీఆర్‌ను ఇంటికే పరిమితం చేశారని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో బస్సు యాత్రకు సిద్ధపడిన కేసీఆర్ మోకాళ్ల యాత్ర చేసినా జనం నమ్మరని ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కనుమరుగయ్యే పరిస్థితుల్లో ఉందని, రాష్ట్రంలో బీఆరెస్ కనుమరుగుకాబోతుందన్నారు. నిన్న జరిగిన మొదటి దపా ఎన్నికల్లో బీజేపీ పార్టీ 50 శాతం కంటే ఎక్కువ సీట్లు గెలుస్తుందనే నమ్మకం ఉందన్నారు. తెలంగాణాలో 12 సీట్లు గెలుస్తామనే నమ్మకం ఉందని చెప్పారు. వికసిత్ భారత్ తరహాలో వికసిత్ తెలంగాణ పత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు.

Latest News