- రాబోయే లోక్‌సభ ఎన్నికలకు సంకేతం
అగర్తల: త్రిపుర బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అధికార బీజేపీకి చెందిన ప్యానెల్ ఓడిపోయింది. రాజ్యాంగాన్ని కాపాడాలి అనే నినాదంతో పోటీ చేసిన కాంగ్రెస్, సీపీఎంకు చెందిన లీగల్ సంఘాల ప్రతినిధులతో కూడిన సంగ్‌బిధాన్ బచావో మంచ్ (సేవ్ కాన్‌స్టిట్యూషన్ ఫోరం) ఘన విజయం సాధించింది. 15 నామినేషన్లు దాఖలవగా, అందులో నాలుగు ఏకగ్రీవం అయ్యాయి.
ఆదివారం సాయంత్రం రిటర్నింగ్ అధికారి, అడ్వొకేట్ సందీప్ దత్తా చౌదరి మీడియాతో మాట్లాడుతూ త్రిపుర బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా మృణాల్ కాంతి బిశ్వాస్, వైస్ ప్రెసిడెంట్‌గా సుబ్రత దేబ్‌నాథ్, కార్యదర్శిగా కౌషిక్ ఇందు ఎన్నికైనట్టు ప్రకటించారు. అమర్ దేబ్‌బర్మ, ఉత్పల్‌దాస్ సహాయ కార్యదర్శులుగా ఎన్నికయ్యారు. మరో ఆరుగురు ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ఎన్నికయ్యారు. వీరంతా సేవ్ కాన్‌స్టిట్యూషన్ ఫోరం తరఫున పోటీ చేసినవారే. మొత్తం 500 ఓట్లకు గాను 463 ఓట్లు పోలయ్యాయి.
బార్ అసోసియేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి సేవ్ కాన్‌స్టిట్యూషన్ ఫోరం ప్రతినిధులను త్రిపుర ప్రతిపక్ష నేత జితేంద్ర చౌదరి ఒక ప్రకటనలో అభినందించారు. ఇది కేవలం ఐదు వందల మంది న్యాయ కోవిదుల మనసులో మాట మాత్రమే కాదు.. దేశ ప్రజానీకం అభిప్రాయాలను ప్రతిఫలిస్తున్నదని చెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రజానీకం సాధించిన విజయంగా అభివర్ణించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో సాధారణ ప్రజలు చైతన్యవంతమయ్యేందుకు ఈ ఎన్నిక ఉపకరిస్తుందన్నారు. లౌకిక, ప్రజాస్వామిక శక్తులకు గొప్ప విజయాలను అందిస్తుందని చెప్పారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు సుదీప్ రాయ్ బర్మన్ కూడా విజేతలను అభినందించారు. సమాజానికి ఒక దిశను బార్ అసోసియేషన్ ఎన్నికలు చూపాయని తెలిపారు. రాబోయే లోక్‌సభ ఎన్నికలపై దీని ప్రభావం గణనీయంగా ఉంటుందని అన్నారు. ‘న్యాయవాదులు మేధావులు. మేధావులు సమాజానికి దిశానిర్దేశం చేస్తారు. ఈ అసోసియేషన్‌లో అధికార పార్టీకి చెందినవారు ఎక్కువ మంది ఉన్నారు. కానీ.. వారంతా రాజకీయాలకు అతీతంగా రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనే కాంక్షతో ఓటేశారు’ అని ఆయన పేర్కొన్నారు.