Site icon vidhaatha

ఏక్‌నాథ్ షిండే ఎవరో పార్లమెంటు ఎన్నికల తర్వాతా తేలుతుంది


విధాత : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందంటూ తాను కేటీఆర్‌, కేసీఆర్‌లాగా జోస్యం చెప్పడం లేదంటునే పార్లమెంటు ఎన్నికల తర్వాతా కాంగ్రెస్‌, బీఆరెస్‌లలో ఎవరు ఏక్‌నాథ్ షిండే అవుతారో త్వరలోనే తెలుస్తుందని బీజేపీ రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల తర్వాతా కాంగ్రెస్ అసలు రంగు బయటపడుతుందన్నారు. బీఆరెస్‌, కాంగ్రెస్‌లను కలిపేందుకు ఎంఐఎం తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆరోపించారు.


ఏది ఏమైనా రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుందని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో డబుల్ ఇంజీన్ సర్కార్ రాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి ఎదురులేదని, కాంగ్రెస్, బీఆరెస్‌ పార్టీలది నామమాత్రపు పోటీయేనని లక్ష్మణ్ చెప్పారు. కేసీఆర్ అడుగుజాడల్లోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన నడుస్తుందన్నారు. రెండు రోజుల పర్యటనలో ప్రధాని మోడీ వేలకోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టారని, దానిపై మాట్లాడకుండా బీఆరెస్‌, కాంగ్రెస్‌లు రాజకీయ విమర్శలు చేయడం చూస్తే వారికి తెలంగాణలో ఎదుగుతున్న బీజేపీ అంటే భయం పట్టుకుందనడానికి నిదర్శనమన్నారు.


ఫిర్ ఏక్‌బార్ మోదీ సర్కార్ అంటే కాంగ్రెస్‌, బీఆరెస్‌కు కుళ్లు పుడుతుందన్నారు. వారసత్వ, కుటుంబ పార్టీలకు మోదీ అంటే భయం నెలకొందని, అందుకే కాంగ్రెస్‌, బీఆరెస్‌లు మోదీని విమర్శిస్తున్నాయన్నారు. దేశంలో కాంగ్రెస్ సహా పలు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు కుటుంబ, వారసత్వ పార్టీలుగా తమ కుటుంబాల కోసం పనిచేస్తున్నాయన్నారు. మోదీ ప్రభుత్వం దేశ ప్రజలే కుటుంబంంగా పేదల కోసం, దేశం కోసం పనిచేస్తుందన్నారు.

Exit mobile version