తెలంగాణ‌లో బీజేపీ ప్ర‌భంజ‌నం మొద‌లైంది: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

దేశం తో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభంజనం మొదలైందని.. దేశంలో మోడీ మేనియా నడుస్తోందని..దేశానికి రక్షణ బీజేపీ ఒక్కటే అని ప్రజలు నిర్ణయం తీసుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు

  • Publish Date - March 29, 2024 / 12:31 PM IST

– దేశాన్ని రక్షించేది బీజేపీ ఒక్కటే

– తెలంగాణ లో డబుల్ డిజిట్ స్థానాల్లో బీజేపీ గెలుపు

– ప్రధానిగా మోదీని కోరుకుంటున్న దేశ ప్రజలు

– తెలంగాణలో బీఆరెస్‌ బాటలోనే నడుస్తున్న కాంగ్రెస్

– ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నీరుగార్చుతున్న కాంగ్రెస్

– కాళేశ్వరం అవినీతిని కోల్డ్ స్టోరేజీకి పంపిన రేవంత్ రెడ్డి

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: దేశంలో మోదీ మేనియా నడుస్తోంది, దేశంతో పాటు తెలంగాణలో కూడా బీజేపీ ప్రభంజనం మొదలైంది, దేశానికి బీజేపీ ఒక్కటే రక్షణ అని ప్రజలు నిర్ణయించుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి డబుల్ డిజిట్ సంఖ్యలో విజయం సాధిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం సుదర్శన్ గార్డెన్‌లో జరిగిన‌ బీజేపీ జిల్లా నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఇప్పటికే 90 శాతం మంది దేశ ప్రజలు మోదీనే ప్రధాని కావాలని కోరుకుంటున్నారన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా 400 స్థానాల్లో బీజేపీ గెలుస్తోంద‌ని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో కూడా 10 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధిస్తామన్నారు. దేశంలోనే కాక తెలంగాణలో బీజేపీ ప్రభంజనం ప్రారంభమైందని, ఇక్కడ బీజేపీ గెలుపును అడ్డుకునే శక్తి ఏ పార్టీకి లేదన్నారు.

ఇప్పటికీ రాష్ట్రంలో బీఆరెస్‌ కనుమరుగయిందని, కాంగ్రెస్ పార్టీపై కూడా ప్రజావ్యతిరేకత మొదలైందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల‌ను విస్మ‌రించి బీఆరెస్ దారిలో న‌డుస్తుంద‌న్నారు. ఇచ్చిన హామీల్లో కాంగ్రెస్ పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని, రైతులకు రుణమాఫీ, మహిళలకు భృతి, కొత్త రేషన్ కార్డులకు అతి గతిలేదన్నారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే కర్ణాటకలో కాంగ్రెస్ పాలనపై ప్రజలు, నాయకుల్లో నిరాశ నిస్పృహ మొదలైందన్నారు. బీఆరెస్ దొంగ‌లు పోయి కాంగ్రెస్ గ‌జ‌దొంగ‌లు వ‌చ్చిన‌ట్లుంద‌న్నారు. అసెంబ్లీలో బీఆరెస్ అవినీతి గురించి మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు విచార‌ణ ఎందుకు చేయించ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. తెలంగాణను అప్పుడు కేసీఆర్‌ కుటుంబం దోచుకుంటే, ఇప్పుడు రాహుల్ గాంధీ టీమ్ దోచుకుంటోందని ఆరోపించారు. తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం నుంచి జారి పొయ్యిలో ప‌డిన‌ట్లు అయింద‌న్నారు. అవినీతి పేరుతో బీఆరెస్ నాయ‌కుల‌ను బెదిరించి కాంగ్రెస్‌లో చేర్చుకున్నార‌ని కిష‌న్ రెడ్డి మండిప‌డ్డారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు అవినీతిని ద‌ర్యాప్తు పేరుతో కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టార‌న్నారు. కాళేశ్వరం అవినీతి వివ‌రాలు కేంద్ర మంత్రి అమిత్‌షాకు ఇస్తాన‌న్న ముఖ్య‌మంత్రి ఇప్పుడు మొహం చాటేస్తున్నార‌న్నారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తప్పక దర్యాప్తునకు సహకరిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి కరువు ముంచు కొస్తోందని, అప్పుడే హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లో కరెంట్, నీటి కష్టాలు మొదలయ్యాయన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ మీద కోపంతో తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కి ఓటేసారన్నారు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం నాలుగు అంశాల అభివృద్దే ఎజెండాగా తీసుకొని ముందుకు వెళ్తున్న‌ద‌న్నారు. రైతులు, మహిళలు, యువకులు, నిరుపేదల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ తీసుకొస్తామన్నారు. రైతాంగం కోసం పెట్టుబడి సాయం, ఎరువుల్లో సబ్సిడీ, మద్దతు ధర ఇలా అన్ని రకాలుగా ఆదుకునేందుకు కృషి చేస్తున్నామన్నారు. పొదుపు సంఘాలకు రుణాలు, ముద్ర లోన్స్, డ్రోన్ అప్కా పేరుతో రుణాలు ఇస్తామని కిషన్ రెడ్డి ప్రకటించారు. మహిళలకు 33% చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించడం, నిరుపేదల ఆరోగ్యం, మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టబోతున్నామన్నారు. పాలమూరు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానాలతో పాటు హైదరాబాద్ స్థానం కూడా గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పాలమూరు పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ, జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, నేతలు బంగారు శృతి, డోకూర్ పవన్ కుమార్ రెడ్డి, కొండన్న, పద్మజా రెడ్డి, నాగురావు నామోజీ, అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Latest News