Site icon vidhaatha

ఎన్నికల వేళ జూలు విదుల్చుతున్న ఈడీ

న్యూఢిల్లీ : గత పదేళ్లుగా ప్రతిపక్ష నేతలను టార్గెట్‌ చేసుకున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. తాజాగా లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తన ఆపరేషన్‌ను తీవ్రతరం చేస్తున్నట్టు కనిపిస్తున్నది. బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ ఎన్డీయేలోకి జంప్‌ చేసిన రెండ్రోజుల వ్యవధిలోనే ఈడీ అధికారులు స్పీడ్‌ పెంచారు. దేశవ్యాప్తంగా అనేకమంది ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా దిగడం రాజకీయంగా సంచలనం రేపుతున్నది.

బుధవారం జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ ను రెండు పర్యాయాలుగా విచారించిన ఈడీ.. అనంతరం ఆయనను అరెసు చేసింది. జనవరి 29వ తేదీన ఈడీ అధి కారులు జార్ఖండ్ సీఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా అధినేత హేమంత్ సొరేస్‌కు చెందిన ఢిల్లీ నివాసంలో తనిఖీలు చేశారు. ఆ సమయంలో సొరేన్ అక్కడ లేరు. తనిఖీల్లో 36 లక్షల నగదు, ఒక బీఎండబ్ల్యూ కారును స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ ప్రకటించింది. కొన్ని కీలక డాక్యు మెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. దాదాపు 13 గంటలపాటు ఈ సోదాలు కొనసాగాయి.


దీనిపై తీవ్రంగా స్పందించిన సొరేన్.. ఎస్సీ, ఎస్టీ పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐఆర్ నమోదు చేయాలంటూ ఫిర్యాదు చేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుతోనే తనకు నోటీసులు జారీ చేయించిందని సొరేన్ మండిపడ్డారు. తాను జనవరి 31న రాంచీలోని తన నివాసంలో స్టేట్మెంట్ ఇస్తానని ఈడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. సొరేన్ చెప్పిన మేరకు అధికారులు బుధవారం సాయంత్రం ఆయన నివాసానికి చేరుకున్నారు. రెండు దఫాలుగా విచారించి అరెస్టు చేశారు.


నాలుగో సీఎం హేమంత్‌ సొరేన్‌

ఈడీ టార్గెట్‌ చేసిన నాలుగవ ప్రతిపక్ష ముఖ్యమంత్రి సొరేన్‌. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్‌ భగేల్‌, ఆయన అనుచరులు కొందరిపై చట్ట వ్యతిరేక ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ కేసులో ఆరోపణలు చేసింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజులు ముందు ఈ కేసులో భూపేశ్‌ భగేల్‌ను ఈడీ చేర్చడం రాజకీయ విమర్శలకు తావిచ్చింది. ఈ కేసును బూచిగా చూపుతూ ఆ ఎన్నికల్లో బీజేపీ నేతలు భూపేశ్‌ను అవినీతి ముఖ్యమంత్రి అంటూ ప్రచారం చేసుకున్నారు. అంతకు ముందు ఉద్యోగాలకు భూమి కేసులో ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్‌ యాదవ్‌, ఆయన కుమారుడు, అప్పటి బీహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌నూ ప్రశ్నించారు.



మరోవైపు ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో కొంతకాలంగా ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు విచారణకు హాజరు కావాలంటూ వరుసగా నోటీసులు జారీ చేస్తూ వస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా, ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌ను అరెస్టు చేశారు. ఇదే కేసులో ఆప్‌ మంత్రి సత్యేంద్రజైన్‌ రెండేళ్లుగా జైల్లో ఉన్నారు. నోటీసులు ఇచ్చినా విచారణకు రావడం లేదనే సాకుతో కేజ్రీవాల్‌ను సైతం అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. తనకు నోటీసులు జారీ చేయడం రాజకీయ దురుద్దేశాలతో కూడుకున్నదేనని చెబుతూ విచారణకు హాజరయ్యేందుకు కేజ్రీవాల్‌ విస్పష్టంగా నిరాకరిస్తున్నారు. తనను లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా అడ్డుకునేందుకే బీజేపీ ఈ కుట్రలకు పాల్పడుతున్నదని ఆయన ఆరోపించారు.



ఇలా సోదాలు.. అలా దుష్ప్రచారాలు



గతంలో జరిగినట్టే సొరేన్‌ ఇంట్లో తనిఖీల వెంటనే.. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ప్రచారాన్ని బీజేపీ శ్రేణులు ప్రారంభించాయి. సొరేన్‌ తన ఢిల్లీ నివాసంలో లేకపోవడంతో ‘ముఖ్యమంత్రి కనిపిండం లేదు’ అంటూ పోస్టర్లు వేయించారు. ఈడీ ఒకవైపు ప్రతిపక్ష నాయకుల ఇండ్లల్లో సోదాలు చేయడం.. దాని ఆధారంగా వారిని అవినీతిపరులు అంటూ బీజేపీ రెడీమేడ్‌ ప్రచారాలు చేయడం పరిపాటిగా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.



అనారోగ్యంతో ఉన్న లాలూను వదల్లేదు



తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్‌ యాదవ్‌ను కూడా ఈడీ అధికారులు సోమవారం విచారణకు పిలవడం గమనార్హం. లాలుతోపాటు ఆయన భార్య, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి, వారి కుమారుడు తేజస్వి యాదవ్‌, ఇద్దరు కుమార్తెలు మీసా భారతి, హేమా యాదవ్‌తోపాటు 12 మంది పేర్లను కేసులో చేర్చింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా లాలు ప్రసాద్‌ యాదవ్‌ ఉన్న 2004-2009 మధ్యకాలంలో రైల్వేశాఖ ఇచ్చిన గ్రూప్‌ డీ ఉద్యోగాల కోసం భూములను ముడుపులుగా తీసుకున్నారనేది వారిపై అభియోగం. లాలు కుమారుడు తేజస్వి అప్పటికి టీనేజర్‌. ఈడీ ఆదేశాలతో తన తండ్రిని తీసుకుని వచ్చిన మీసా భారతి.. తమ కుటుంబాన్ని అనవసరంగా వేధిస్తున్నారని ఆరోపించారు.



ఎలాంటి విచారణనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. మరుసటి రోజే తేజస్వి యాదవ్‌ను ఈడీ విచారణకు పిలిచింది. బీజేపీ తన రాజకీయ అవసరాల కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తుండగానే.. దాదాపు ఎనిమిది గంటలపాటు విచారించింది. విచారణ నుంచి బయటకు రాగానే తేజస్వి తన మద్దతుదారులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. దీనిపై ఆర్జేడీ ఎంపీ మనోజ్‌ కుమార్‌ ఝా స్పందిస్తూ.. ‘అది ఈడీ కార్యాలయం కాదు.. బీజేపీ ఆఫీస్. అక్కడికి తేజస్వి యాదవ్‌ వెళ్లారు. ఎన్నికలు రాగానే ప్రతిపక్ష నేతలను అక్కడికి పిలుస్తుంటారు’ అని వ్యాఖ్యానించారు.



జనవరి నెల ప్రారంభంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకుడు షేక్‌ షాజహాన్‌ నివాసంలో ఈడీ ప్రజాపంపిణీ వ్యవస్థకు సంబంధించిన కేసులో తనిఖీలకు వచ్చినప్పుడు ఆయన మద్దతుదారులు ఈడీ అధికారులపై దాడి చేశారు. దానిని బీజేపీ మతపరమైన అంశంగా వక్రీకరించింది. ఎట్టకేలకు జనవరి 24న ఆయన నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇదే కేసులో మరో తృణమూల్‌ మంత్రి జ్యోతి ప్రియామాలిక్‌ను ఈడీ 2023 అక్టోబర్‌లో అరెస్టు చేసింది.



వీరేకాకుఉండా రాజస్థాన్‌ మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత మహేశ్‌ జోషిపై జల్‌జీవన్‌ మిషన్‌ కేసు పెట్టారు. హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్‌లతోపాటు పలు దక్షిణాది రాష్ట్రాల ప్రతిపక్ష నాయకులపైనా కేసులు నమోదు చేశారు. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆ పార్టీ ఎంపీ రాహుల్‌గాంధీ, మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరం కుమారుడు, కాంగ్రెస్‌ ఎంపీ కీర్తి చిదంబరం, తృణమూల్‌ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ, ఆ పార్టీ పలువురు నేతలు, రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ కుమారుడు వైభవ్‌ తదితర ఎంతో మంది ఈడీ రాడార్‌లో ఉన్నారు.




బీజేపీ పంచన చేరితే దర్యాప్తుల్లేవు!



ప్రతిపక్ష నేతలపై ఈడీ ఎంత వ్యతిరేక భావంతో వ్యవహరిస్తున్నదనేందుకు అసోం సీఎం హేమంత బిశ్వ శర్మ, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అజిత్‌పవార్‌పై ఉన్న అవినీతి కేసులను ఒకప్పుడు అత్యుత్సాహం ప్రదర్శించి, ఇప్పుడు ముట్టుకోకపోవడమే నిదర్శనం. వారు బీజేపీ పంచన చేరడంతోనే వారి అవినీతి విషయాలను ఈడీ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెలుగులోకి వచ్చిన వ్యాపం కుంభకోణం కేసును ఇప్పటికే ఈడీ అటకెక్కించింది. కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న బీఎస్‌ యడ్యూరప్ప, బీఎస్‌ బొమ్మై కేసులు సైతం పక్కకు పోయాయి.



కేసులలో రికార్డు కానీ..



విచిత్రం ఏమిటంటే.. ఈడీ కేసులు పెట్టడంలో రికార్డులు సృష్టిస్తున్నదే కానీ.. వాటిని రుజువు చేయలేకపోతున్నదని గణాంకాలను బట్టి తేలిపోతున్నది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈడీ పెడుతున్న కేసులు ఏకంగా 95 శాతం అంటే నాలుగు రెట్లు పెరిగిపోయాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈడీ, సీబీఐ పెడుతున్న కేసులలో 95శాతం ప్రతిపక్ష పార్టీల నాయకులపైనే ఉంటున్నాయని గుర్తు చేస్తున్నారు. ఈడీ 2013 మార్చి వరకూ 5,906 కేసులు పెడితే.. వాటిలో దర్యాప్తు పూర్తి చేసి, చార్జిషీటు దాఖలు చేసిన కేసులు 1,142 మాత్రమే. అందులోనూ 25 కేసులను మాత్రమే పరిష్కరించారు.



అంటే.. మొత్తం కేసులలో ఇది 0.42 శాతం మాత్రమే. అందులోనూ24 కేసులలో మాత్రమే నేరారోపణలు రుజువు చేయగలిగింది. దీనినే ఈడీ 96శాతం కన్విక్షన్‌ రేటుగా ప్రచారం చేసుకుంటున్నదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఈ గణాంకాలను ముందు పెడుతున్న ప్రతిపక్ష పార్టీలు.. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం ద్వారా రాజకీయ సమీకరణలు అత్యధికంగా ఉండే భారతదేశంలో పెద్ద ఎత్తున బీజేపీ సొమ్ము చేసుకుంటున్నదని ఆరోపిస్తున్నాయి. తాజాగా లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. ఇదే పద్ధతిలో ఈడీ పనిని బీజేపీ సర్కారు వేగవంతం చేయిస్తున్నదన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

Exit mobile version