Site icon vidhaatha

విద్యుత్ సంస్కరణల పేరుతో నల్ల చట్టాలు: మంత్రి జగదీష్ రెడ్డి

విధాత: విద్యుత్ సంస్కరణల మాటున ప్రజలను పీల్చి పిప్పి చేసే నల్ల చట్టాల అమలుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూనుకుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి విమర్శించారు. శనివారం సూర్యాపేటలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత విద్యుత్ పథకాన్ని విఫలం చేసేందుకు, దేశ ప్రజలకు విద్యుత్ అందకుండా చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తుందన్నారు. 50 రూపాయలకు యూనిట్ విద్యుత్ అమ్ముకోవచ్చంటున్న కేంద్రం విధానం వెనుక ఆదానీ కంపనీలకు మేలు చేయాలన్న దురుద్దేశమే కనిపిస్తుంది అన్నారు.

దేశ సంపాదన ఆదానికి దోచిపెట్టడమే పనిగా మోడీ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. దేశంలో బొగ్గు అందుబాటులో ఉండగా విదేశీ బొగ్గు ఎందుకు కొనుగోలు చేస్తున్నారని జగదీశ్ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు. విదేశీ బొగ్గు వ్యవహారంతోనే విద్యుత్ కొరత ఏర్పడుతుందన్నారు.

దేశంలో విద్యుత్ సంక్షేమం లేదని బిజెపి ప్రభుత్వమే కృత్రిమ విద్యుత్ సంక్షోభాన్ని సృష్టిస్తుందన్నారు . ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ మాటలకు చేతలకు పొంతన లేదని, అబద్ధాలు ఆడడంలో కూడా ఆమె తడబడ్డారన్నారు. రాష్ట్రం అప్పుల్లో లేదని, కరోనా సమయంలోనూ మిగులు బడ్జెట్‌లో ఉందన్నారు.

కేంద్ర ప్రభుత్వం స్థాయికి మించి అప్పులు చేసిందని, దేశాన్ని పాలించిన గత ప్రభుత్వాల కంటే ప్రధాని మోడీ ప్రభుత్వమే అధిక అప్పులు చేసిందన్న సంగతి మరవరాదు అన్నారు. దేశభక్తి మాటున దేశానికి ద్రోహం చేస్తున్న బీజేపీ విధానాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.

అధాని కుంభకోణంతో మోడీ నిజస్వరూపం మొత్తం బయట పడిందన్నారు. ఎప్పటికైనా బీజేపీ నేతలు ప్రజల ముందు దోషిగా నిలబడాల్సిందేనని, వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఆ పార్టీకి ప్రజలు నుంచి తిరస్కారం తప్పదన్నారు.

Exit mobile version