విధాత : మాస్కో – ఢిల్లీ విమానంలో బాంబు అమర్చినట్లు ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి గురువారం రాత్రి ఈమెయిల్ వచ్చింది. దీంతో ఎయిర్‌పోర్టు సిబ్బంది అప్రమత్తమయ్యారు.
మాస్కో నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు ఇవాళ తెల్లవారుజామున 3:20 గంటలకు విమానం చేరుకుంది. ఇక ఎయిర్‌పోర్టు అధికారులు, పోలీసులు.. విమానంలో ఉన్న 386 మంది ప్రయాణికులను, 16 మంది సిబ్బందిని హుటాహుటిన కిందకు దించేశారు. ఆ విమానాన్ని బాంబు స్క్వాడ్ సిబ్బంది, పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. బాంబు లేదని తేల్చారు. దీంతో అటు ప్రయాణికులు, ఇటు ఎయిర్ పోర్టు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.
సెప్టెంబర్ 10వ తేదీన కూడా ఢిల్లీ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. విమానాన్ని పేల్చేస్తామంటూ ఔటర్ ఢిల్లీలోని రన్‌హోలా పోలీసులకు కాల్ చేసి చెప్పాడు ఓ అగంతకుడు. దీంతో పోలీసులు.. ఎయిర్ పోర్టు అధికారులను అప్రమత్తం చేశారు. ఆ తర్వాత విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేసి, బాంబు లేదని తేల్చారు.