Bride Dies | కొద్దిసేపట్లో పెళ్లి పీటలెక్కి ఏడడుగులు వేయాల్సిన నవ వధువు గుండెపోటుతో కన్నుమూసింది. కూతురు మరణాన్ని సైతం దిగమింగుతూ తల్లిదండ్రులు ఎవరూ ఊహించని విధంగా అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నారు. మృతి చెందిన కుమార్తె స్థానంలో ఆమె చెల్లెలితో వివాహం జరిపించారు. ఈ ఘటన గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో చోటు చేసుకున్నది. జిల్లాలోని సుభాష్‌నగర్‌కు చెందిన జినాభాయ్ రాథోడ్‌కు ముగ్గురు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
పెద్ద కూతురు హేతల్‌కు నారీ గ్రామానికి చెందిన విశాల్‌భాయ్‌తో వివాహం నిశ్చయించగా.. ఈ నెల 24న పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. ఓ వైపు పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వధూవరుల ఇండ్లు బంధువుల రాకతో సందడి నెలకొన్నది. పెళ్లి రోజు నారీ గ్రామం నుంచి వరుడు వధువు ఇంటికి బారాత్‌తో చేరుకున్నాడు. మరో వైపు పెళ్లికి కొద్ది గడియల సమయం ఉందనగా.. వధువు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దాంతో వెంటనే హేతల్‌ను కుటుంబీకులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో మృతి చెందినట్లుగా నిర్ధారించారు.
దీంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. హేతల్ మృతితో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొన్నది. అయితే, ఈ క్రమంలో వధువు తల్లిదండ్రులు ఓ కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. బాధ్యతగా ఆలోచించి.. తమ రెండో కూతురును విశాల్‌కు ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కుటుంబంతో మాట్లాడారు. హేతల్ కుటుంబం పరిస్థితిని అర్థం చేసుకున్న వరుడు కుటుంబం సైతం ఇందుకు అంగీకరించింది. ఆ తర్వాత హేతల్ మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచి.. నిర్ణయించిన ముహూర్తానికే చిన్నకూతురిని ఇచ్చి వివాహం జరిపించారు. ఆ తర్వాత హేతల్ దహన సంస్కారాలు నిర్వహించారు.