విధాత: ఇటీవలి కాలంలో పెళ్లికి ముందు నూతన వధూవరులు ఫోటో షూట్ చేయడం సహజమైంది. ఈ ఫోటో షూట్ కోసం పర్యాటకంగా గుర్తింపు పొందిన ప్రాంతాలను లేదా మంచి లోకేషన్ ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకుంటున్నారు. అక్కడ తమకు నచ్చిన స్టైల్‌లో, గుర్తుండి పోయే విధంగా ఫోటోలు తీసుకుంటున్నారు. కానీ ఓ పెళ్లి కూతురు మాత్రం విచిత్రంగా బురద నీటిలో ఫోటోలకు ఫోజులిచ్చింది.
కేరళలో భారీ వర్షాలకు ఓ రహదారి దెబ్బతిన్నది. గుంతల్లో వర్షపు నీరు నిలిచి బురదమయమైంది. ఆందులో పెళ్లి కూతురుకు ఏం నచ్చిందో తెలియదు గానీ అక్కడే ఫోటోలకు ఫోజులిచ్చింది. అయితే ఈ ఫోటో షూట్‌పై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఈ ఫోటో షూట్ కేరళలోని రోడ్ల దుస్థితిని తెలియజేస్తుందని ఒకరు కామెంట్ చేశారు. అది రోడ్డు కాదు.. చిన్నపాటి చెరువు అని మరొకరు విమర్శించారు.
మీరు కొన్ని చేప పిల్లలను కొనుగోలు చేసి.. అక్కడ చేపలను పెంచుకోవచ్చు అని మరో నెటిజన్ రాశారు. ప్రస్తుతం ఈ ఫోటో షూట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలాఉండగా అక్కడి రోడ్ల దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే ఆ అమ్మాయి పెళ్లి కూతురిలా ముస్తాబవగా ఫోటో షూట్ నిర్వహించారని అనుకుంటున్నారు. సెప్టెంబర్ 11న ఈ వీడియోను ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేయగా, 4.3 మిలియన్ల మంది వీక్షించారు. 3,70,400 మంది లైక్ చేశారు.