BRS: అక్కడా.. ఇక్కడా ప్రత్యామ్నాయ నినాదమే!

రాష్ట్రంలో, దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌తోనే ప్ర‌ధాన పోటీ కేసీఆర్ వ‌ల్లే రాష్ట్రంలో బ‌ల‌ప‌డిన బీజేపీ విధాత‌: బీఆర్‌ఎస్‌కు ఇక్కడా, అక్కడా ఆ రెండు పార్టీలతోనే పోటీ ఉంటుంది. అందుకే ఆపార్టీ అధినేత కాంగ్రెస్‌, బీజేపీయేతర కూటమి అని, ప్రత్యామ్నాయ రాజకీయాలు అవసరమని అంటున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల మధ్యే జరిగింది. బీజేపీ పోటీ చేసినా మొదటి దఫా టీడీపీతో కలిసి హైదరాబాద్‌ నగరంలో కొన్ని […]

  • Publish Date - December 15, 2022 / 09:34 AM IST
  • రాష్ట్రంలో, దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌తోనే ప్ర‌ధాన పోటీ
  • కేసీఆర్ వ‌ల్లే రాష్ట్రంలో బ‌ల‌ప‌డిన బీజేపీ

విధాత‌: బీఆర్‌ఎస్‌కు ఇక్కడా, అక్కడా ఆ రెండు పార్టీలతోనే పోటీ ఉంటుంది. అందుకే ఆపార్టీ అధినేత కాంగ్రెస్‌, బీజేపీయేతర కూటమి అని, ప్రత్యామ్నాయ రాజకీయాలు అవసరమని అంటున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల మధ్యే జరిగింది. బీజేపీ పోటీ చేసినా మొదటి దఫా టీడీపీతో కలిసి హైదరాబాద్‌ నగరంలో కొన్ని సీట్లు దక్కించుకున్నది.

కానీ 2018 ఎన్నికలు వచ్చేసరికి ఒంటరిగా పోటీ చేసి ఒక స్థానానికే పరిమితమైంది. అయితే ఈ ఎనిమిదిన్నర ఏండ్ల కాలంలో కేసీఆర్‌ రాజకీయ పునరేకీకరణ పేరుతో అవలంబించిన విధానాల వల్ల కాంగ్రెస్‌ పార్టీ నుంచి అధికార పార్టీలోకి ఫిరాయింపులు ఎక్కువగా జరిగాయి.

ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆరే అంటే.. మేము ఎవరినీ రమ్మనలేదు, వాళ్లే మా ప్రభుత్వం చేపట్టిన‌ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఫిరాయింపుల చట్టం ప్రకారం మా పార్టీలో కలిసిపోయారు అని వాదిస్తున్నారు. ఇందులో ఎవరి వాదనలు వారివే.

అయితే ఒకటి మాత్రం అందరూ అంగీకరిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని బలహీనపరిచిన ఫలితమే ఇవాళ బీజేపీ విస్తరణకు కారణమైంది అంటున్నారు. బీజేపీకి రాష్ట్రంలో పెద్దగా బలం లేకున్నా ఆ పార్టీ నేతలు అధికారపార్టీకి ప్రత్యామ్నాయం మేమే అని ప్రచారం చేసుకునే పరిస్థితికి కారణం కేసీఆరే అనే ఆరోపణలు ఉన్నాయి.

బీజేపీకి కూడా రాష్ట్రంలో ఆపార్టీ బలం ఎంతో స్పష్టత ఉన్నది. మొత్తం 17 ఎంపీ స్థానాల్లో గతంలో 4 గెలిచాం. ప్రస్తుతం అదనంగా మరో 3 లేదా నాలుగు గెలిస్తే ఆ పార్లమెంటు స్థానాల పరిధిలోని 30-40 అసెంబ్లీ స్థానాల‌ను దక్కించుకోవచ్చు అన్నది ఆ పార్టీ జాతీయ నాయకత్వం ఆలోచన. అక్కడి వరకు మాత్రమే వాళ్లు ప్రయత్నం చేయగలరు. అంతేగాని రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేసినా వాళ్లకు కొన్నిచోట్ల డిపాజిట్లు కూడా దక్కవు అంటే అతిశయోక్తి కాదు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు సన్నద్ధంగా ఉన్నాయి. కాంగ్రెస్‌, బీజేపీకి ఇక్కడ చెక్‌ పెడితేనే బీఆర్‌ఎస్‌కు ఇతర చోట్ల కొంత అనుకూల పరిస్థితులు ఉంటాయి. కేంద్రంలో మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టినట్టే రాష్ట్రంలోనూ కేసీఆర్‌ ప్రభుత్వ వైఫల్యాలను కాంగ్రెస్‌ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నది.

కేసీఆర్‌ మాత్రం అవేవీ ప‌ట్టించుకోకుండా జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌, బీజేపీ ప్రభుత్వ విధానాలు విఫలమయ్యాయని, ప్రస్తుతం తెలంగాణ అభివృద్ధి నమూనానే దేశానికి అవసరమని, దేశంలో రైతు అనుకూల రాజ్యం రావాలని నినదిస్తున్నారు. ప్రత్యామ్నాయ రాజకీయాలు కావాలని కేసీఆర్‌ అందుకే అంటున్నారు.

బీజేపీకి చెప్పడానికి ఏమీ లేదు. అయితే డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తోనే సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని, మతం పేరుతో, ఎంఐఎం, బీఆర్‌ఎస్‌ దోస్తీని చూపెడుతూ తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నది. ఆ పార్టీ సిద్ధాంత వాదనలకు ఇక్కడ స్థానం ఉండదు. కాబట్టి ఉద్యమంలో సుదీర్ఘకాలం కేసీఆర్‌తో కలిసి నడిచిన నేతలు కొంతమంది అధికారపార్టీతో విభేదించి ఆ పార్టీలో చేరిన నేతలను ముందు పెట్టి కొన్నిచోట్ల ముందుకు వెళ్లాలని భావిస్తున్నది.

మరికొన్ని చోట్ల కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, కొంత ఆర్థికంగా బలంగా ఉండి, ప్రతి నియోజకవర్గంలో 10-15 శాతం ఓట్లు సంపాదించగలిగే నేతల కోసం వెతుకుతున్నది. ఇట్లా మూడు పార్టీలు వచ్చే ఎన్నికల్లో ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి యత్నిస్తున్నాయి.