పార్టీలో ఉన్నవాళ్లను కాపాడుకోవడమే పెద్ద టాస్క్‌

బీఆర్‌ఎస్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతినడానికి కారణమైన వాటిలో ఫిరాయింపులు ఒక కారణమా? పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌పార్టీలో చేరుతున్నవాళ్లు ఆ పార్టీలోనే కొనసాగుతారా?

  • Publish Date - March 30, 2024 / 06:32 AM IST

బీఆర్‌ఎస్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతినడానికి కారణమైన వాటిలో ఫిరాయింపులు ఒక కారణమా? పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌పార్టీలో చేరుతున్నవాళ్లు ఆ పార్టీలోనే కొనసాగుతారా? ఇలాంటి ప్రశ్నలు ప్రస్తుతం రాజకీయవర్గాల్లో వ్యక్తమౌతున్నాయి. కేసీఆర్‌ ప్రతిపక్షం ఉండకూడదు, మమ్మల్ని, మా విధానాలను ప్రశ్నించకూడదు అన్నట్టు వ్యవహరించారు. ఫలితంగా ప్రజలు ఆపార్టీని అధికారం నుంచి దించారు. ఫిరాయింపుల వల్ల సొంతపార్టీలో అసంతృప్తి, ఫలితాల తర్వాత పార్టీని, శ్రేణులు కాపాడుకోవడం ఎంత కష్టమో బీఆర్‌ఎస్‌ అగ్రనేతలకు అనుభవంలోకి వచ్చింది.


అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్‌ఎస్‌లో ఒక్కో నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీటు ఆశించే వారు ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వాళ్లలో పార్టీలో మొదటి నుంచి పనిచేసిన వాళ్లు కొందరైతే, ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ నుంచి గెలిచిన వాళ్లు, ఓడినవాళ్లంతా కారు పార్టీలోనే కొనసాగారు. వీళ్లలో చాలామందికి ఎమ్మెల్సీ, రాజ్యసభ, కార్పొరేషన్‌ పదవులు ఆశ చూపెట్టి చేర్చుకున్నారు. కొందరికి అవకాశాలు కల్పించారు. మరికొందరికి నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి. అప్పుడు పోటీకి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఏళ్ల తరబడి పార్టీలోనే ఉంటున్నా ఎలాంటి పదవులు లేకుండా పనిచేసినవాళ్ల జాబితా పెద్దగానే ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వాళ్లంతా నిరాశ నిస్పృహలోకి వెళ్లారు.


మొన్నటికి మొన్న కడియం శ్రీహరి కాంగ్రెస్‌కు మెజారిటీ కంటే నాలుగు సీట్లే అదనంగా ఉన్నాయంటూ (బీఆర్‌ఎస్‌, బీజేపీ ఎంఐఎం శాసన సభ్యుల సంఖ్య 54 అని ఒక లెక్క చెప్పారు). దీనికితోడు ప్రభుత్వ మనుగడపై పదే పదే బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల నుంచి ప్రశ్నలు ఉత్పన్నమౌతున్న సందర్భంలోనే సీఎం రేవంత్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. తాము గేట్లు ఎత్తితే ఏం జరుగుతుందో చూడండి అన్నారు. అయితే ఆయన అన్నది ఆవేశంగా కాదని, పార్టీ అధిష్ఠానం ఆలోచనలనే తమ మాటల్లో వ్యక్తీకరించారు అన్నది తాజాగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌ మున్షీ స్పందన తర్వాత తెలుస్తోంది.


బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే కడియం శ్రీహరితో భేటీ అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఏఐసీసీ అదేశాల మేరకే తాను భేటీ అయ్యానని, పార్టీలోకి వస్తే ఎలాంటి గౌరవం, హోదా కల్పిస్తామన్నది వారి వాగ్దానాలనే వివరిస్తున్నామని చెప్పారు. దీంతో అధికార పార్టీలోనే ఉంటేనే పనులు జరుగుతాయని, ప్రజలకు ఏమైనా చేయగలుగతామంటూ.. సిట్టింగ్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్మన్‌లు, స్థానిక ప్రజాప్రతినిధులంతా కాంగ్రెస్‌పార్టీలోకి క్యూ కడుతున్నారు.


బీఆర్‌ఎస్‌ నేతలు ఊహించని విధంగా అభ్యర్థులుగా ప్రకటించిన తర్వాత రంజిత్‌రెడ్డి, డాక్టర్‌ కడియం కావ్యలతో పాటు చేవెళ్ల సభలో కాంగ్రెస్‌ పై ధ్వజమెత్తిన పట్నం మహేందర్‌రెడ్డి, బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో కాంగ్రెస్‌పార్టీపై ఫైర్‌ అయిన కడియం శ్రీహరి, కేసీఆర్‌ తర్వాత పార్టీలో నెంబర్‌ 2 గా ఉన్న పార్లమెంటరీ పార్టీ నాయకుడు కేకే లాంటి వాళ్లు షాక్‌ ఇచ్చారు. దీంతో కంగుతిన్న కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు నష్టనివారణ చర్యలు చేపడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగే పరిణామాల ప్రభావం కాంగ్రెస్‌ పార్టీ కంటే ఎక్కువగా బీఆర్‌ఎస్‌పైనే ఉండనున్నది. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీల పరిస్థితే ఆపార్టీకి ఎదురైనా ఆశ్చర్యపోనక్కరలేదంటున్నారు.


మంత్రి కోమటిరెడ్డి కూడా 30 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ పదవులు అనుభవించి కష్టకాలంలో పార్టీ పార్టీ వీడుతున్న వారి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూనే.. ఉన్న శ్రేణులను కాపాడుకోవడంపై గులాబీ పార్టీ దృష్టి సారించింది. కార్యకర్తలను సముదాయించే పనిలో పడింది. అధైర్యపడవద్దని భరోసా ఇస్తున్నది. ప్రజల్లో ఉండి కొట్లాడితే మంచి రోజులు వస్తాయని, పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడుతున్న వారికి రానున్న రోజుల్లో న్యాయం చేస్తామని కేటీఆర్‌, హరీశ్‌ రావు హామీ ఇస్తున్నారు.


అలాగే పార్టీని వీడిన వాళ్లను తిరిగి చేర్చుకునే ప్రసక్తే లేదని కార్యకర్తలు, శ్రేణులకు స్పష్టం చేస్తున్నారు. ఇదంతా లోక్‌సభ ఎన్నికల్లో మూడు నాలుగు సీట్లు గెలిచి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంతో పాటు, భవిష్యత్తుపై భరోసా కల్పించే ప్రయత్నం. అలాంటి ఫలితాలు వస్తేనే పార్టీ ఉనికితో పాటు కార్యకర్తను కాపాడుకోవడం సాధ్యమౌతుందని గులాబీ బాస్‌కు అర్థమైంది. . పార్టీలోంచి పోయినవాళ్లను, పోవాలని రంగం సిద్ధం చేసుకుంటున్న వాళ్ల గురించి ఎక్కువగా ఆలోచించకుండా, ఆందోళన చెందకుండా ఉన్నవాళ్లను కాపాడుకోడమే పెద్ద టాస్క్‌ అని అర్థమైంది. అందుకే కేటీఆర్‌, హరీశ్‌ రావులను రంగంలోకి దించారని తెలుస్తోంది.

Latest News