Site icon vidhaatha

Bhupalpally | కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్


Bhupalpally | విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: జయశంకర్ భూపాల్ పల్లి జిల్లాకేంద్రంలోని భూపాలపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు కౌన్సిలర్లు షాక్ ఇచ్చారు. నిన్న నర్సంపేటలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆ పార్టీకి షాక్ ఇచ్చిన విషయం విదితమే. తాజాగా భూపాల్ పల్లిలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సమక్షంలో బీఆర్ఎస్ కి చెందిన ఆరుగురు మున్సిపల్ కౌన్సిలర్లు, ఇద్దరు కోఆప్షన్ సభ్యులు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.


కాంగ్రెస్‌లో చేరిన వారిలో కౌన్సిలర్లు శిరూప అనిల్, పిల్లలమర్రి శారద నారాయణ, కొక్కుల స్వరూపరాణి, ముంజంపల్లి మురళీధర్, సజ్జనపు స్వామి, పానుగంటి హారిక శ్రీనివాస్, కో ఆప్షన్ సభ్యులు మొహమ్మద్ ఇర్ఫాన్ ఉన్నారు. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పార్టీలోకి ఆహ్వానించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలువురు కౌన్సిలర్లు అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కు వ్యతిరేకంగా అసమ్మతి వ్యక్తం చేశారు.


ఈ అసమ్మతిని తాత్కాలికంగా చర్చల ద్వారా అప్పట్లో పరిష్కరించినప్పటికీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఓటమి తర్వాత నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఇప్పటికే ఒక దఫా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా పలువురు బీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు అధికార కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆరుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరినట్టు భావిస్తున్నారు. త్వరలో భూపాలపల్లి మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరేసేందుకు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

Exit mobile version