ప్రభుత్వం పనిచేస్తుందా..: బీఆరెస్ నేత ఆరెస్పీ ట్వీట్‌

తెలంగాణ పోలీస్ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన సుమారు 1500 మంది అభ్యర్థులు ప్రభుత్వ అలసత్వంతో తీరని అన్యాయానికి గురవుతూ మనోవేదన చెందుతున్నారని ఆరెస్‌.ప్రవీణ్‌కుమార్ ట్వీటర్ వేదికగా ఫైర్ అయ్యారు

  • Publish Date - March 30, 2024 / 07:41 AM IST

  • శిక్షణా ఆర్డర్‌ కాపీల కోసం కానిస్టేబుల్స్ అభ్యర్థుల ఎదురుచూపులు
  • తక్షణమే సీఎం స్పందించాలి

విధాత, హైదరాబాద్ : తెలంగాణ పోలీస్ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన సుమారు 1500 మంది అభ్యర్థులు ప్రభుత్వ అలసత్వంతో తీరని అన్యాయానికి గురవుతూ మనోవేదన చెందుతున్నారని, వారి సమస్యలు పట్టించుకునే నాథుడే తెలంగాణలో లేకుండా పోయారని బీఆరెస్ నేత, ఆరెస్‌.ప్రవీణ్‌కుమార్ ట్వీటర్ వేదికగా ఫైర్ అయ్యారు. గత రెండు నెలలుగా కానిస్టేబుల్ గా ఎంపికైన అభ్యర్థులు శిక్షణ కోసం ఆర్డర్ కాపీలు ఇవ్వాలని ముఖ్యమంత్రి నివాసం, డీజీపీ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న ఎవ్వరూ పట్టించుకోవడంలేదని, దీంతో అభ్యర్థులు,కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని, అసలు తెలంగాణలో ప్రభుత్వం ఉన్నదా? అని ఆరెస్పీ ప్రశ్నించారు.


రాష్ట్ర వ్యాప్తంగా సివిల్, ఏఆర్, ఎస్‌ఏఆర్, టీఎస్‌ఎస్‌పీ విభాగాల్లో కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్ధులు తమ స్వీయ ధృవీకరణ(సెల్ఫ్ అటెస్టేషన్‌) పత్రంలో తమపై రకరకాల కారణాలతో నమోదైన సివిల్, క్రిమినల్, బైండోవర్, కరోనా,ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘన కేసులు ఉన్నట్లు ధ్రువీకరించారు. వీరిపై నమోదైన కేసుల్లో వారు విద్యార్థి దశలో చేసిన విద్యార్థి ఉద్యమ కేసులు, గ్రామీణ ప్రాంతాల్లో జరిగే కుటుంబ తగాదాలతో కక్షపూరితంగా, ఉద్దేశపూర్వకంగా నమోదైన కేసులే అత్యధికమని ఆరెస్పీ పేర్కోన్నారు.


ఎంపికైన అభ్యర్థులపై నమోదైన చాలా కేసుల్లో ఇప్పటికే కొందరు అభ్యర్థులు కోర్టుల్లో నిర్దోషిగా తేల్చబడ్డారని, స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ) అధికారుల తుది పరిశీలనలో కూడా అభ్యర్థులు ఆ కేసులకు సంబంధించిన పూర్తి వివరాలతోపాటు, కేసుల్లో నిర్దోషిగా తేలిన కోర్టు జడ్జిమెంట్ కాఫీలను స్వయంగా అభ్యర్ధులు స్పెషల్ బ్రాంచ్ అధికారులకు, టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ అధికారులకు అందించనప్పటికి, వారికి శిక్షణకు అవకాశం కల్పించడం లేదని ఆరెస్పీ అగ్రహం వ్యక్తం చేశారు.


ఎంతో ఆర్భాటంగా ఫిబ్రవరి 14 న ఎల్‌బీ స్టేడియంలో అందజేసిన ఎంపిక పత్రాల్లో వీరికి మొండి ‘చేయి’ చూపారని, ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం…బాధ్యతా రహిత్యమేనని ఆరోపించారు. యూపీఎస్సీ నిర్వహించే ఉద్యోగ నియామకాల్లో స్వీయ ధృవీకరణ పత్రంలో పేర్కొన్న కేసుల్లో స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారుల తుది పరిశీలనలో నిర్దోషిగా తేలితే ఉద్యోగాలకు ఎంపిక చేస్తారని, కానీ ఇక్కడ ప్రభుత్వం మాత్రం విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో వింతగా వ్యవహరిస్తూ ఎంపికైన అభ్యర్థులకు తీరని అన్యాయం చేస్తున్నదని ఆరెస్పీ మండిపడ్డారు.


ప్రభుత్వానికి నిరుద్యోగులపై ఇంత చులకనభావం ఎందుకని ప్రశ్నించారు. వెంటనే బాధిత అభ్యర్థుల మనోవేదనపై రాష్ట్ర ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ) పరిశీలనలో నిర్దోషిగా తేలిన కానిస్టేబుల్ అభ్యర్థులను శిక్షణకు పంపేలా టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ చైర్మన్ కు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని బీఆరెస్‌ డిమాండ్ చేస్తుందని తెలిపారు.

Latest News