Site icon vidhaatha

Nalgonda | ‘గురుకులం’లో గులాబీ పార్టీ ఆత్మీయ సమ్మేళనం.! అనుమతి పై భిన్నాభిప్రాయాలు!!

విధాత: నల్గొండ (Nalgonda) పట్టణంలోని రాజా బహుదూర్ వెంకట్రామిరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ భవనంలో కొనసాగుతున్న బీసీ బాలికల గురుకుల రెసిడెన్షియల్ పాఠశాల ఆవరణలో రేపు ఆదివారం బీఆర్ఎస్ (BRS) నల్గొండ మున్సిపాలిటీ ఆత్మీయ సమ్మేళన సమావేశం నిర్వహిస్తుండడంపై రాజకీయ, విద్యార్థి సంఘాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం సొసైటీ భవనంతో సహా రెండున్నర ఎకరాల ప్రాంతం అంతటిని కూడా బీసీ రెసిడెన్షియల్ పాఠశాల నిర్వహణకు గతంలో జేసీకి అధీనం చేశారు.

ప్రస్తుతం ఇందులో బీసీ బాలికల గురుకుల రెసిడెన్షియల్ పాఠశాల 5, 6, 7 తరగతులు నిర్వహిస్తున్నారు. అందులోనే వారికి హాస్టల్ వసతి కూడా కొనసాగుతుంది. రేపు ఆదివారం ఈ పాఠశాల ఆవరణలో బీఆర్ఎస్ పార్టీ నల్గొండ మున్సిపాలిటీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. అందుకు ఆ పార్టీ తరఫున టెంట్లు వేసి మైకులు బిగించే ఏర్పాట్లు చేపట్టారు.

అయితే.. పక్కనే బాలికల హాస్టల్ ఉండగా ఇంకో వైపు వేలాది మంది హాజరయ్యే ఓ రాజకీయ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహణకు వారికి ఎలా అనుమతులు ఇచ్చారన్న అంశం ఇప్పుడు రాజకీయ, విద్యార్థి సంఘాల్లో చర్చినీయాంశమైంది. నాయకుల ప్రసంగాలు, వచ్చిన కార్యకర్తల హడావుడిని హాస్టల్ విద్యార్థినిలు భరించాల్సి వుంది.

రెసిడెన్షియల్ పాఠశాల భవనం సహా దానికి అనుకొని ఉన్న ప్రాంగణ స్థలం అంతా మాదే కావడంతో బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు సమావేశం నిర్వహణకు మౌఖిక అనుమతి కోరడంతో అంగీకరించామని రాజా బహద్దూర్ వెంకటరామిరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ కమిటీ చెబుతుంది.

అయితే ఈ భవనంతో పాటు రెండున్నర ఎకరాల స్థలాన్ని గతంలోనే బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల నిర్వహణకు జేసికి అప్పగించినందున ఈ స్థలంలో బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి సొసైటీ కమిటీ వారు ఎలా అనుమతిలిస్తారన్న ప్రశ్నను విద్యార్థి సంఘాలు లేవనెత్తుతున్నాయి.

అటు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి పాఠశాల వైపు నుండి ఏమైనా అనుమతి ఇచ్చారా అన్న విషయమై ప్రిన్సిపాల్ ను ప్రశ్నించగా తాను సెలవులో ఉన్నానని, ఈ విషయమై పై అధికారులను సంప్రదించాలంటూ సమాదానాన్ని దాటవేశారు.

అయితే ఒకసారి ఓ రాజకీయ పార్టీకి సమావేశ నిర్వహణకు రెసిడెన్షియల్ పాఠశాల ఆవరణలో అనుమతి ఇచ్చినందునా ఇకమీదట ఇతర పార్టీల వాళ్లు, ప్రజా సంఘాలు అడిగితే వారికి కూడా సమావేశాలకు అనుమతి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

అలాంటప్పుడు అక్కడ బీసీ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాల తరగతులు, హాస్టల్ నిర్వాహణలో ఇబ్బందులు ఎదురవుతాయన్న వాదన వినిపిస్తుంది. బాలికల రెసిడెన్షియల్ పాఠశాల నిర్వహణను దృష్టిలో పెట్టుకొని ఇకమీదట ఇక్కడ పార్టీలు, ప్రజాసంఘాల సమావేశాలకు అనుమతులు ఇవ్వరాదని విద్యార్థి సంఘాలు సంబంధిత శాఖల అధికారులను, సొసైటీ కమిటీని కోరుతున్నాయి.

Exit mobile version