బీఎస్పీతో బీఆర్‌ఎస్‌ పొత్తు వ్యూహం వెనుక?

లోక్‌సభ ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ రాష్ట్ర రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. బీజేపీ చెబుతున్నట్టు ఆ పార్టీకి 370 సీట్లు వచ్చే వాతావరణం కనిపించడం లేదు

  • Publish Date - March 5, 2024 / 12:36 PM IST

(విధాత ప్రత్యేకం)


లోక్‌సభ ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ రాష్ట్ర రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. బీజేపీ చెబుతున్నట్టు ఆ పార్టీకి 370 సీట్లు వచ్చే వాతావరణం కనిపించడం లేదు. ఎందుకంటే ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు దాదాపుగా కొలిక్కి వస్తున్నది. బీజేపీ లక్షద్వీప్‌ మొదలుకొని ఆ పార్టీ ఇప్పటివరకు గెలువని స్థానాలపై దృష్టి సారించింది. తెలంగాణలో గత ఎన్నికల్లో 4 సీట్లు గెలిచిన ఆ పార్టీ ఆ స్థానాలతో పాటు మరో నాలుగైదు స్థానాలు దక్కించుకోవడమే లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్నది. జహీరాబాద్‌, నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలో చేరినవారికి ఒకటి రెండు రోజుల్లోనే టికెట్లు ఖరారు చేసింది.


దీన్నిబట్టి ప్రతి సీటు గెలుపు కోసం కాషాయ పార్టీ ఎంతగా ఆరాటపడుతున్నదో తెలుస్తోంది. మరోవైపు అసెంబ్లీ ఫలితాలనే లోక్‌సభ ఎన్నికల్లో పునరావృతం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు. ప్రధాన ప్రత్యర్థి అయిన బీఆర్‌ఎస్‌ ఒక్క సీటైనా గెలిపించి చూపించాలని సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్‌, కేటీఆర్‌లకు సవాల్‌ విసిరారు. రెండు రోజులుగా మాజీ సీఎం, బీఆరెస్‌ అధినేత కేసీఆర్‌ లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్నారు.


మరోవైపు బీఆర్‌ఎస్‌ నుంచి జంప్‌ అయి నేతలు కాంగ్రెస్‌, బీజేపీలలో చేరుతున్నారు. ఫలితాల అనంతరం తుంటి ఎముక ఆపరేషన్‌ తర్వాత పెద్దగా కనిపించని కేసీఆర్‌.. నల్లగొండ సభ ద్వారా మరోసారి తెరపైకి వచ్చారు. బీజేపీ అధికారంలోకి రాకపోయినా, ఇండియా కూటమికి ప్రభుత్వ ఏర్పాటునకు అవసరమైన మెజారిటీ దగ్గరలో ఉన్నా ప్రాంతీయపార్టీల సీట్లే కీలకం కానున్నాయి. వీటన్నింటి దృష్టిలో పెట్టుకుని కేసీఆర్‌ వేగంగా పావులు కదుపుతున్నారు.


కాంగ్రెస్‌, బీజేపీల ఎత్తులకు పై ఎత్తు వేసేలా వ్యూహ రచన చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ శ్రేణులను కలుస్తూ వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ వీడే వారి గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ బీఆర్‌ఎస్‌లో చేరుతారని నిన్నమొన్న ప్రచారం జరిగింది. దీనిపై ఆర్‌ఎస్‌పీ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఈ నేపథ్యంలోనే ఆర్‌ఎస్‌పీ బీఆరెస్‌ అధినేత కేసీఆర్‌తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకున్నది.


సమావేశం అనంతరం రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌-బీఎస్పీ కలిపి పోటీ చేయనున్నాయని కేసీఆర్‌, ఆర్‌ఎస్‌పీ ఇద్దరూ సంయుక్త ప్రకటన చేశారు. పొత్తుకు సంబంధించిన విధివిధానాలను త్వరలో వెల్లడిస్తామని నేతలిద్దరూ ప్రకటించారు. కేసీఆర్‌ ఆపరేషన్‌ తర్వాత రెస్ట్‌ తీసుకుంటున్న సమయంలోనే ఆయన లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించినట్టు సమాచారం. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం వంద రోజుల గడువు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ నాటికి పూర్తవుతుందని అప్పటి వరకు కేటీఆర్‌, హరీశ్‌రావుతో పాటు ఇతర నేతలు స్పందించినా కేసీఆర్‌ మౌనంగా ఉన్నారు.


రేవంత్‌ సవాల్‌ తర్వాత కేసీఆర్‌ లోక్‌సభ ఎన్నికల్లో ముఖ్యంగా పెద్దపల్లి, నాగర్‌కర్నూల్‌, వరంగల్‌ ఎస్సీ రిజర్వ్‌ స్థానాలను కాంగ్రెస్‌, బీజేపీలకు దక్కుకుండా చేయాలనే ప్రణాళిక రూపొందించుకున్నట్టు తెలుస్తోంది. నాగర్‌కర్నూల్‌ సిట్టింగ్‌ ఎంపీ రాములు బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి తన తనయుడు భరత్‌ ప్రసాద్‌కు బీజేపీ టికెట్‌ ఇప్పించుకున్నారు. అక్కడ పొత్తులో భాగంగా ఆర్‌ఎస్‌పీని బరిలో దిగుతున్నారు.


అలాగే పెద్దపల్లి నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పోటీ చేయడం దాదాపుగా ఖరారైనట్టే. ఈ నియోజకవర్గ పరిధిలోని రామగుండం, పెద్దపల్లి, ధర్మపురి, మంథని, చెన్నూర్‌, మంచిర్యాల, బెల్లంపల్లిలలో బీఆర్‌ఎస్‌ ఓటు బ్యాంకుకు తోడు ఎస్సీ (మాదిగ సామాజికవర్గ) ఓట్లు కీలకం కానున్నాయి. ఇక్కడ చెన్నూరు, బెల్లంపల్లి ఎస్సీ నియోజకవర్గాలు. బీఎస్పీ పొత్తు ద్వారా ఆ సీటును సునాయసంగా గెలుచుకోవాలన్నది కేసీఆర్‌ ఆలోచనగా చెబుతున్నారు. అక్కడ కాంగ్రెస్‌ పార్టీ నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వివేక్‌ తనయుడు వంశీ పోటీ చేస్తారని టాక్‌ వినిపిస్తున్నది. పార్టీ మారిన వెంకటేశ్‌నేతకు, వివేక్‌లకు ఇద్దరికీ ఆ సీటు గెలువడం ద్వారా షాక్‌ ఇవ్వాలని కేసీఆర్‌ యోచిస్తున్నారు.


అలాగే వరంగల్‌ లోకసభ పరిధిలో స్టేషన్‌ఘన్‌పూర్‌, పాలకుర్తి, పరకాల, వరంగల్‌ పశ్చిమ, వరంగల్‌ తూర్పు, వర్ధన్నపేట, భూపాలపల్లి స్థానాలున్నాయి. వీటిలో స్టేషన్‌ఘన్‌పూర్‌, వర్ధన్నపేట ఎస్సీ రిజర్వ్‌ స్థానాలు. అలాగే ఇటీవల బీఆర్‌ఎస్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర ప్రభావం వరంగల్‌ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో ఉంటుందని సమాచారం. ఈ లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజవర్గాల్లోనూ బీఆర్‌ఎస్‌ స్టేషన్‌ ఘన్‌పూర్‌ మినహా మిగిలిన అన్నిస్థానాల్లో ఓడిపోయింది. అయినా పార్టీకి పట్టున్నది.


ఇక్కడ బీఎస్పీ లేదా బీఆర్‌ఎస్‌ పోటీ చేసే అవకాశాలున్నాయి. మరోవైపు బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ ఈ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్నది. కాంగ్రెస్‌ తరఫున మాజీ మంత్రి రాజయ్య, అద్దంకి దయాకర్‌ లాంటి వాళ్లు పోటీ చేస్తారనే టాక్‌ నడుస్తున్నది. ఇక్కడ కూడా కాంగ్రెస్‌, బీజేపీలకు చెక్‌ పెట్టాలనే యోచనలో కేసీఆర్‌ ఉన్నారు. ఈ స్థానంతో పాటు మహబూబాబాద్‌, ఖమ్మం లోక్‌సభ స్థానాలను దక్కించుకోవాలనే కృత నిశ్చయంతో కేసీఆర్‌ ఉన్నారు.


మొత్తంగా లోక్‌సభ ఎన్నికల్లో గత ఎన్నికల్లో గెలిచిన 9 సీట్ల సంఖ్యను తిరిగి పునావృతం చేయాలనుకుంటున్నారు. హైదరాబాద్‌ మినహా మిగిలిన పదహారు స్థానాల్లో లోక్‌సభ ఎన్నికల్లో త్రిముఖ పోరు తప్పేలా లేదు. ఈ ముక్కోణపు పోటీలో ఏ పార్టీ గెలిచినా స్వల్ప మెజారిటీనే దక్కవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ ఉనికే ఉండదని గతంలో రేవంత్‌రెడ్డి, ఇటీవల ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్‌ చేసిన వ్యాఖ్యలు అచ్చుతప్పు అని నిరూపించి కేసీఆర్‌ లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలనే ఉద్దేశంతోనే బీఎస్పీతో కలసి పోటీ చేయాలని నిర్ణయించారని అంటున్నారు. ఇప్పటికే బీఆరెస్‌కు మిత్రపక్షంగానే ఎంఐఎం ఉన్నది. ముస్లింలు, దళితులు, బీసీ కొన్ని సామాజికవర్గ ఓటర్లను కలుపుకొని మెరుగైన ఫలితాలను సాధించాలనే సంకల్పంతో కేసీఆర్‌ అడుగులు వేస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Latest News