KTR | పార్ల‌మెంట్ ఎన్నిక‌ల త‌ర్వాత అన్ని ప‌థ‌కాల‌కు మంగ‌ళం

  • Publish Date - April 12, 2024 / 04:16 PM IST

  • సీఎం మైక్ వీరుడు.. లీక్ వీరుడు
  • కాంగ్రెస్ పాలనలో రియల్ ఢమాల్‌
  • రాముడికి మొక్కుదాం.. బీజేపీని తొక్కుదాం
  • బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌

 

విధాత, హైదరాబాద్‌: పార్ల‌మెంట్ ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన అన్ని ప‌థ‌కాల‌కు సీఎం రేవంత్ రెడ్డి మంగ‌ళం పాడుతార‌ని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోస్యం చెప్పారు. ఇబ్ర‌హీంప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన భువ‌న‌గిరి పార్ల‌మెంట్ విస్తృత స్థాయి స‌మావేశంలో కేటీఆర్ హాజరై మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420హామీల్లో ఈ వంద రోజుల్లో ఫ్రీ బ‌స్సు ఒక్క‌టే స్టార్ట్ చేసిండని, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల త‌ర్వాత ఫ్రీ బ‌స్సుకు మంగ‌ళం పాడుతాడని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప‌థ‌కం వ‌ల్ల ఆర్టీసీకి రూ. 1400 కోట్ల న‌ష్టం వ‌చ్చిందన్నారు. తులం బంగారం అన‌గానే మ‌హిళ‌లు సెంటిమెంట్‌కు ప‌డిపోయి ఓట్లు వేశారని, కానీ తులం బంగారం ఇవ్వ‌డం లేదని, ఈ విష‌యాల‌ను బీఆరెస్ కార్యకర్తలు ప్రజలకు వివ‌రంగా చెప్పాలని కేటీఆర్ సూచించారు.

శ్రీరాముడితో మ‌న‌కు పంచాయితీ లేదని, రాముడు అంద‌రివాడని, బీజేపీ వ్య‌క్తి కాదని, రాముడికి బ‌రాబ‌ర్ మొక్కుదామని, ఎన్నికల్లో బీజేపీని మాత్రం పండ‌బెట్టి తొక్కుదామని కేటీఆర్ కేడర్‌కు పిలుపునిచ్చారు. మనం యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించిన దానిని రాజకీయ చేసుకోలేదన్నారు. పదేళ్ల బీజేపీ పాలనలో దేశంలో అన్ని ధరలను పెంచారని, అందుకే ప్రియమైన ప్ర‌ధాన మంత్రి అంట‌లేరని, పిర‌మైన ప్ర‌ధాని అంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం మన ఏడు మండలాలను, సీలేరు ఫ్లాంటును ఏపీలో కలిపేసిన మోదీకి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు.

మన భద్రాద్రి రామున్ని ప‌ట్టించ‌కోనందుకా..? రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీ ఇవ్వ‌నుందుకా..? పాల‌మూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయో హోదా ఇవ్వ‌నందుకా..? ఐటీఐఆర్ ర‌ద్దు చేసినందుకా..? నవోద‌య పాఠ‌శాల‌లు, మెడిక‌ల్ కాలేజీలు ఇవ్వ‌నందుకా..? ఎందుకు ఓటు వేయాలంటూ కేటీఆర్ నిలదీశారు. ఈ ప‌దేండ్ల‌లో తెలంగాణ‌కు బీజేపీ ఏం చేసిందో చెప్పి ఓటు అడ‌గాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కేంద్రంలో ఏ పార్టీకి మెజార్టీ వ‌చ్చే ప‌రిస్థితి లేదని, మీ ఆశీర్వాదంతో 12 సీట్లు ఇస్తే మ‌న‌మే చక్రం తిప్పే ప‌రిస్థితి రావచ్చని, పార్లమెంటులో మ‌న గొంతు విన‌బ‌డాలంటే ఎంపీలుగా బీఆరెస్ వాళ్లు ఉండాలని, అందుకే భువనగిరి నుంచి క్యామ మల్లేశ్‌ను గెలిపించాలన్నారు.

సీఎం రేవంత్ మైక్ వీరుడు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మైక్ వీరుడని కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మైక్ ప‌ట్టుకుంటే ఆయ‌న‌కు పూన‌కం వ‌చ్చి.. ఏది ప‌డితే అది మాట్లాడుతాడని, ప్రతిపక్షాలపై ఫేక్‌ కేసులు పెట్టి లీక్‌లు ఇస్తూ లీక్ వీరుడిగా వ్యవహారిస్తారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అర‌చేతిలో వైకుంఠం చూపెట్టిన కాంగ్రెస్ పాలకులపై ప్రజలకు క్రమంగా భ్రమలు తొలగిపోతున్నాయన్నారు. రియ‌ల్ ఎస్టేట్ అంటే రేవంత్ రెడ్డి.. రేవంత్ రెడ్డి అంటే రియ‌ల్ ఎస్టేట్ అన్నాడని, ఇవాళ రంగారెడ్డి జిల్లాలో రియ‌ల్ ఎస్టేట్ ప‌డిపోవ‌డానికి కార‌ణం ప్ర‌భుత్వానికి తెలివి అవ‌గాహ‌న లేక‌పోవ‌డ‌మేనని ఆరోపించారు.

రంగారెడ్డి జిల్లాలో ఫార్మా సిటీ పెట్టాల‌ని రైతుల‌కు మంచి ప‌రిహారం ఇచ్చి భూసేక‌ర‌ణ చేశామని, అనుమ‌తులు కూడా తెచ్చామన్నారు. ఫార్మా కంపెనీల‌కు జాగ ఇచ్చి ల‌క్ష‌ల మందికి కొలువులు తెచ్చే ఫార్మా సిటీని న‌డుపుకునే తెలివి లేని స‌న్నాసులు కాంగ్రెస్ నాయ‌కులని మండిపడ్డారు. కంపెనీలు, ఫ్యాక్ట‌రీలు, యూనివ‌ర్సిటీలు, కాలేజీలు వ‌స్తే రియ‌ల్ ఎస్టేట్ ఊపందుకుంటుందని, ఫాక్స్‌కాన్ మేం తెస్తే మే నెల‌లో ప్రారంభం కావాల్సిన ప్రాజెక్టును ఇప్ప‌టికీ ప్రారంభం కాలేదని కేటీఆర్ విమర్శించారు.

అంబేద్కర్..పూలే బాటలోనే బీఆరెస్ పాలన

ద‌ళిత, బ‌హుజ‌న‌ల నాయ‌కులు డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్, మ‌హాత్మా జ్యోతిరావు ఫూలే ఆశ‌యాల‌ను ఆచ‌ర‌ణ‌లో చేసి చూపెడుతున్న‌ది కేవ‌లం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్ర‌మే అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీల కంటే బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చిన పార్టీ బీఆరెస్‌ పార్టీ మాత్రమేనని, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 50% సీట్లు బీసీలకు ఇచ్చిన ఒకేఒక్క నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. బడుగు విద్యార్థుల కోసం 1008 గురుకుల పాఠ‌శాల‌ల‌ను కేసీఆర్ స్థాపించారని, గురుకులాల్లో ఆరున్న‌ర ల‌క్ష‌ల మంది విద్యార్థుల‌కు ల‌క్షా 20 వేల చొప్పున‌ ఖ‌ర్చు పెట్టి చ‌దివించారని, ప్ర‌పంచంతో పోటీ ప‌డే పౌరులుగా గురుకుల విద్యార్థుల‌ను తీర్చిదిద్దారన్నారు.

బీసీల సంక్షేమం కోసం రూ. 11 వేల కోట్ల‌తో గొర్రెల పెంపంకం అమ‌లు చేశారని, మ‌త్స్య‌కారుల‌కు రూ. 30 వేల కోట్ల‌తో మ‌త్స్య సంప‌ద సృష్టించారని, నేత‌న్న‌కు చేయూత‌, చేనేత మిత్ర లాంటి మంచి కార్య‌క్ర‌మాలు తీసుకొచ్చారని, చేతి వృత్తుల‌కు, కుల‌వృత్తుల‌కు కేసీఆర్ అండ‌గా నిల‌బ‌డ్డారన్నారు. 125 అడుగుల అంబేద్క‌ర్ విగ్ర‌హం ఏర్పాటు చేశారని, ద‌ళిత బంధు అమ‌లు చేశారని, అంబేద్క‌ర్ ఓవ‌ర్సీస్ స్కాల‌ర్‌షిప్ పేరిట‌ ఒక్కొక్క ద‌ళిత విద్యార్థికి రూ. 20 ల‌క్ష‌లు ఇచ్చి విదేశాల్లో చ‌దువుకునేందుకు అండ‌గా నిల‌బ‌డ్డారని తెలిపారు.

Latest News