Site icon vidhaatha

Bumrah | 14 నెల‌ల త‌ర్వాత రీఎంట్రీ ఇచ్చిన బుమ్రా.. తొలి మ్యాచ్‌లోనే నిప్పులు చెరిగాడుగా..!

Bumrah |

టీమిండియా మెయిన్ బౌల‌ర్ జస్ప్రిత్ బుమ్రా, 14 నెలల సుదీర్ఘ గ్యాప్ తర్వాత తిరిగి అంత‌ర్జాతీయ మ్యాచ్ ఆడాడు. గాయం వ‌ల‌న కొన్నాళ్లు క్రికెట్‌కి బుమ్రా దూరం కాగా, ఆయ‌న లేని లోటు స్ప‌ష్టంగా క‌నిపించింది. ఇండియా మ్యాచ్ ఓడిపోయిన‌ప్పుడల్లా కూడా బుమ్రా ఉంటే త‌ప్ప‌క గెలిచేవాళ్లం అని అభిమానులు భావించారు. ఎట్ట‌కేల‌కు బుమ్రా తిరిగి గ్రౌండ్‌లోకి అడుగుపెట్ట‌డం, నిప్పులు చెరిగే బౌలింగ్ తో ప్ర‌త్య‌ర్ధుల‌ని బ‌య‌పెట్ట‌డం చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

గాయం వ‌ల‌న ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్ 2022, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్, ఐపీఎల్ 2023 మ్యాచ్‌ల‌కి దూర‌మైన బుమ్రా.. ఐర్లాండ్‌తో తొలి టీ20 మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో ఆయ‌న వేసిన‌ మొదటి బంతికి ఆండ్రూ బాల్బరీన్ ఫోర్ బాద‌గా, రెండో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక లోర్కన్ టక్కర్ అనే బ్యాట్స్‌మెన్ అదే ఓవ‌ర్‌లో భారీ షాట్ ఆడే ప్ర‌య‌త్నం చేసి సంజూ శాంసన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

మొత్తానికి తొలి మ్యాచ్ లో అద్భుత‌మైన బౌలింగ్ వేసి రెండు వికెట్స్ తీయడంతో టీమిండియా ఫ్యాన్స్‌తో పాటు బుమ్రా ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. వ‌ర‌ల్డ్ క‌ప్‌కి ముందు బుమ్రా రాక టీమిండియాలో మ‌రింత జోష్ తెప్పించడం ఖాయం.

ఇక ఐర్లాండ్ పర్యటనలో భాగంగా గ‌త రాత్రి జ‌రిగిన తొలి టీ20కి వరుణుడు అడ్డుప‌డ‌డంతో డక్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తి ద్వారా భార‌త్ రెండు ప‌రుగుల తేడాతో గెలిచింది. ఈ క్ర‌మంలో మూడు టీ20ల సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది భార‌త జ‌ట్టు. అంత‌క‌ముందు టాస్ గెలిచి బుమ్రా బౌలింగ్ తీసుకున్నాడు.

క‌ట్టుదిట్ట‌మైన బౌలింగ్ వేయ‌డంతో ఐర్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 139 పరుగుల స్కోరు మాత్ర‌మే చేయ‌గలిగింది. ఐర్లాండ్ బ్యాటర్ బారీ మెక్‌కార్తీ అద్భుత హాఫ్ సెంచరీ చేసి ఐర్లాండ్‌కి గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోరు ద‌క్కేలా చేశాడు. ఇక 140 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త జ‌ట్టుకి శుభారంభ‌మే ద‌క్కింది.

పవర్ ప్లే ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా టీమిండియా.. 45 ప‌రుగులు చేయ‌గా, ఆ త‌ర్వాత 23 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 24 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్, క్రెగ్ యంగ్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఇక త‌ర్వాత వ‌చ్చిన తిలక్ వర్మ గోల్డెన్ డకౌట్ అయి పెవీలియ‌న్ చేరాడు.

రుతురాజ్ గైక్వాడ్ 16 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 19 పరుగులు చేసి క్రీజులో ఉండ‌గా, సంజూ శాంసన్ వచ్చి కేవ‌లం ఒక్క ప‌రుగు తీసాడు. అయితే ఆ స‌మ‌యంలో వ‌ర్షం బాగా రావ‌డం, ఎంత‌కు త‌గ్గ‌క పోవ‌డంతో డ‌క్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 2 పరుగుల తేడాతో భార‌త్ విజ‌యం సాధించిన‌ట్టు ప్ర‌క‌టించారు

Exit mobile version