న్యూఢిల్లీ : బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడేవారి నివాసాలు, కార్యాలయాల్లో పాత కేసుల సాకుతో సీబీఐ, ఈడీ సోదాలు మామూలైపోయాయి. మోదీని తీవ్రంగా వ్యతిరేకించే జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌కు సంబంధించిన పలు ప్రదేశాల్లో సీబీఐ అధికారులు బుధవారం తనిఖీలు చేశారు. జల విద్యుచ్ఛక్తి ప్రాజెక్టు కేసులో భాగంగా జరుగుతున్న తనిఖీల్లో సత్యపాల్ మాలిక్ నివాసాలు కూడా ఉన్నాయి. ఖానౌరీ సరిహద్దు వద్ద ఆందోళన చేస్తున్న రైతులపై కాల్పలు జరిపి, ఒక రైతు మరణానికి కారణమైన ఘటన విషయంలో మోదీ ప్రభుత్వాన్ని సత్యపాల్ మాలిక్ విమర్శించిన మరునాడే ఈ సోదాలు జరగడం గమనార్హం.
మోదీని తీవ్రంగా విమర్శించే మాలిక్
ఒకప్పటి బీజేపీ నాయకుడైన సత్యపాల్ మాలిక్.. పలు సందర్భాల్లో నరేంద్రమోదీ ప్రభుత్వ చర్యలను తీవ్రంగా విమర్శించారు. 2019 లోక్‌సభ ఎన్నికలను జవాన్ల శవాలను అడ్డంపెట్టుకుని గెలిచిందని ఆరోపించారు. పుల్వామా ఘటనలో విచారణ జరిపించాలని తాను కోరినప్పుడు తనను మాట్లాడవద్దని ఆదేశించారని కూడా వెల్లడించారు.
నియంత జరిపిస్తున్న సోదాలు
సీబీఐ తనిఖీలపై సత్యపాల్ మాలిక్ స్పందిస్తూ ఇటువంటి వాటికి తాను భయపడేది లేదని, దేశ రైతుల పక్షాన నిలబడుతానని స్పష్టం చేశారు. ‘మూడు నాలుగు రోజులుగా నాకు ఒంట్లో బాగోలేదు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాను. ఈ సమయంలో కూడా దర్యాప్తు సంస్థలతో నియంత నా ఇంట్లో తనిఖీలు చేయించారు. నా డ్రైవర్, నా సహాయకుడి ఇళ్లు కూడా సోదాలు చేశారు. వారిని అనవసరంగా వేధించారు. నేనొక రైతు బిడ్డను. ఇటువంటివాటికి భయపడను. నేను రైతుల పక్షాన ఉంటాను’ అని సత్యపాల్ మాలిక్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఇదీ కేసు
2,200 కోట్ల రూపాయల విలువైన కిరు జలవిద్యుచ్ఛక్తి ప్రాజెక్టు (హెచ్‌ఈపీ) కాంట్రాక్టును అప్పగించిన విషయంలో కేసు నడుస్తున్నది. 2018 ఆగస్ట్ నుంచి 2019 అక్టోబర్ వరకు జమ్ముకశ్మీర్ గవర్నర్‌గా ఉన్న మాలిక్.. కిరు ప్రాజెక్టుకు సంబంధించిన ఫైలు సహా కొన్ని ఫైళ్లపై సంతకాలు చేసేందుకు తనకు 300 కోట్లు లంచం ఆఫర్ చేశారని బయటపెట్టారు. మాలిక్ ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ.. గత నెలలో ఢిల్లీ, జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో సోదాలు నర్వహించింది.