Site icon vidhaatha

ఆరు రాష్ట్రాల హోం శాఖ కార్యదర్శుల తొలగింపు


న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయాలు తీసుకున్నది. బెంగాల్‌ డీజీపీ రాజీవ్‌కుమార్‌, ఆరు రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులను ఈసీ తొలగించింది. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. సోమవారం సీఈసీ రాజీవ్‌కుమార్‌ తన సహ ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్‌ కుమార్‌, సుఖ్బీర్‌సింగ్‌ సంధులతో సమావేశం సందర్భంగా ఈ నిర్ణయం వెలువడింది.

తొలగింపునకు గురైనవారిలో గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, జార్ఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల హోం శాఖ కార్యదర్శులు ఉన్నారు. వారితోపాటు పశ్చిమబెంగాల్‌ డీజీపీ రాజీవ్‌కుమార్‌ను కూడా విధుల నుంచి ఈసీ తప్పించింది. మరోవైపు మిజోరం, హిమాచల్‌ ప్రదేశ్‌ సాధారణ పరిపాలన కార్యదర్శులను సైతం తొలగించింది. బృహన్‌ముంబై మున్సిపల్‌ కమిషనర్‌ ఇక్బాల్‌ సింగ్‌ చాహల్‌, అదనపు కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు కూడా తొలగింపునకు గురైనవారిలో ఉన్నారు.

ఇదిలా ఉంటే.. సొంత జిల్లాల్లో ఉన్న లేదా ఒకే జిల్లాలో మూడేళ్లకు మించి పనిచేస్తున్న ఎన్నికల పనులతో సంబంధం ఉన్న అధికారులను బదిలీ చేయాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను ఎన్నికల సంఘం ఆదేశించింది. అయితే.. మహారాష్ట్ర ప్రభుత్వం ఆ ఆదేశాలను పాటించకపోవడంతో కమిషనర్‌ అసంతృప్తిని వ్యక్తం చేసింది. బృహన్‌ ముంబై అదనపు కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లను వెంటనే బదిలీ చేయాలని ఆదేశించింది.

Exit mobile version