Site icon vidhaatha

Election Commission | తెలంగాణలో ఎన్నికలకు కసరత్తు షురూ..! నేడు రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల బృందం..!

Election Commission | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరం కానున్నాయి. ఎన్నికలకు ఐదు నెలలు మాత్రమే సమయం ఉన్నది. దీంతో ఎన్నికల ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా బుధవారం కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన బృందం రాష్ట్రంలో పర్యటించనున్నారు.

అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్‌లో షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల సమయంలోనూ అక్టోబర్‌ 6న షెడ్యూల్‌ను ప్రకటించగా.. నవంబర్‌లో నోటిఫికేషన్‌ వెలువడగా.. డిసెంబర్‌లో పోలింగ్‌ జరిగింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది సైతం అక్టోబర్‌లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ వెలుడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

రెండో వారం నాటికి షెడ్యూల్‌..

అక్టోబర్‌ రెండోవారంలోగా షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటన ప్రాధాన్యం సంతరించుకన్నది. పర్యటనలో కేంద్ర ఎన్నికల బృందం తెలంగాణ ఎన్నికల అధికారులతో సమావేశం కానున్నది. ఎన్నికల కు సంబంధించిన ఏర్పాట్లపై కీలక సూచనలు చేయనున్నది. ఈవీఎంలు, ఓటర్ల జాబితా, భద్రత తదితర అంశాలపై సూచనలు చేయనున్నట్లు సమాచారం.

కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సైతం హైదరాబాద్‌లో పర్యటిస్తారని, నాలుగు రోజుల పాటు బృందం ఇక్కడే ఉంటుందని తెలుస్తోంది. ఈ సందర్భంగా కలెక్టర్లు, ఎస్పీలు, ఐటీశాఖ అధికారులతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, డబ్బు చెలామణిని అరికట్టడం, ఎన్నికల్లో గొడవలు, దాడులు తదితర అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేసే అవకాశాలున్నాయి.

పార్టీల వ్యూహం..

ప్రస్తుతం ఎన్నికలకు దాదాపు ఆరు నెలల గడువు ఉన్నది. ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని పార్టీలు వ్యూహాలను రూపొందిస్తున్నాయి. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ కొత్త పథకాలను ప్రకటించడంతో పాటు గతంలో ఇచ్చిన హామీలు, పెండింగ్‌లో ఉన్న పనులను వేగంగా పూర్తి చేస్తున్నది. ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టులతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నది.

కాంగ్రెస్‌ ఈ సారి ఎలాగైనా కేసీఆర్‌ సర్కారును గద్దెదించి అధికారంలోకి రావాలని రేవంత్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ సర్వశక్తులను ఒడ్డుతున్నది. ఈ సారి ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని చూస్తున్నది. మరో వైపు కాషాయ పార్టీ సైతం ఎన్నికలకు సన్నద్ధమవుతున్నది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ అగ్రనేతల పర్యటలను ఏర్పాట్లు చేస్తున్నది. బీజేపీ చేసిన అభివృద్ధితో పాటు అధికార పార్టీ విధానాలను ఎండగడుతూ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నది.

Exit mobile version