- చత్తీస్‌ఘడ్ సర్కార్ పిలుపుపై వికల్ప్ లేఖ
విధాత: మావోయిస్టులతో చర్చలకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకు మావోయిస్టులు ముందుకు రావాలని చత్తీస్‌ఘడ్ ప్రభుత్వం ఇచ్చిన పిలుపుకు మావోయిస్టులు సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వంతో చర్చలకు సిద్ధం అంటూ మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరిట లేఖ విడుదల చేశారు. చర్చలకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తే ముందుకు వస్తామని, అందుకు సాయుధ బలగాలను ఆరు నెలల పాటు శిబిరాలకు పరిమితం చేయాలని, కొత్త క్యాంపులను ఏర్పాటు చేయకూడదని, తప్పుడు ఎన్కౌంటర్లను అరికట్టాలని షరతులు పెట్టారు.
అదివాసీలు సేద్యం చేసుకుంటున్న భూములకు హక్కులు కల్పించాలని, వారికున్న రుణాలను మాఫీ చేయాలని, కనీస మద్దతు ధరకు పంటలను కొనాలని, సబ్సిడీలను యధావిధిగా కొనసాగించాలని, ఉచితంగా సాగునీటిని, విద్యుత్తును అందించాలని, కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చే వ్యవసాయ ఒప్పందాలను రద్దు చేయాలని షరతులు విధించారు. అసంఘటిత రంగంలో ఉన్న రైతుకూలీలకు కార్మిక చట్టాలను వర్తింపజేయాలని, ఎనిమిది గంటల విధానాన్ని అమలు చేయాలని స్పష్టం చేశారు.
మహిళలకు కూడా పురుషులతో సమాన వేతనం చెల్లించాలని, మహిళలకు రాజ్య హింసను నిలిపేయాలని, మనువాద విధానానికి ముగింపు పలకాలని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. ఇవన్నీ జరిగినప్పుడే చర్చలకు అనువైన వాతావరణ ఉంటుందని, తొలుత ఆ దిశగా చర్యలు చేపట్టాలన్నారు. మేదావులు, విద్యావంతులు, బుద్ధిజీవులు, సామాజిక సామాజిక స్పృహ కలిగిన ప్రజా సంఘాల ప్రతినిధులు, మానవ హక్కుల కార్యకర్తలు, పాత్రికేయులు ఈ తరహా వాతావరణాన్ని కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని సూచించారు.