- ఆ ప్రాంతం తమ దేశంలో అంతర్భాగమన్న చైనా ఆర్మీ
అరుణాచల్ ప్రదేశ్ తమదేనని, అది చైనా భూభాగంలో అంతర్భాగమని చైనా మిలిటరీ మరోసారి పేర్కొన్నది. ప్రధాని నరేంద్రమోదీ అరుణాచల్‌లో పర్యటించడంపై బీజింగ్ అభ్యంతరం వ్యక్తం చేసిన కొద్ది రోజులకు మిలిటరీ ఈ విధంగా స్పందించడం గమనార్హం.
సీజాంగ్ దక్షిణ ప్రాంతం (టిబెట్‌కు చైనా పెట్టుకున్న పేరు) చైనా అంతర్భాగమని ఆ దేశ రక్షణ శాఖ ప్రతినిధి, సీనియర్ కర్నల్ జాంగ్ సియోగాంగ్ అన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌ను భారత్ అక్రమంగా ఏర్పాటు చేసిందని, దీనిని తాము గుర్తించనిరాకరించడమే కాకుండా.. దృఢంగా వ్యతిరేకిస్తామని పేర్కొన్నారు.
అరుణాచల్ ప్రదేశ్‌లోని సేలా సొరంగం నుంచి మిలిటరీని పంపే ఏర్పాట్లను పెంచుతున్న నేపథ్యంలో జాంగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌గా చైనా పేర్కొంటున్నది. అరుణాచల్ ప్రదేశ్‌లో భారత నాయకత్వం పర్యటనలకు వచ్చిన ప్రతిసారీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. పైగా ఈ ప్రాంతానికి జాంగ్‌నాన్ అని నామకరణం చేసింది.
అరుణాచల్ ప్రదేశ్ తమదేనని చైనా పేర్కొన్న ప్రతి సందర్భంలోనూ భారత్ దాన్ని తిరస్కరిస్తూ వస్తున్నది. అరుణాచల్ ప్రదేశ్ ముమ్మాటికీ భారతదేశంలో అంతర్భాగమని స్పష్టం చేస్తున్నది. ఈ ప్రాంతానికి చైనా కొత్త పేరు పెట్టాన్ని కూడా కొట్టిపారేసింది. పేరు పెట్టినంత మాత్రాన వాస్తవాలను మార్చలేరని స్పష్టం చేసింది.
మార్చి 9న అరుణాచల్ ప్రదేశ్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ సముద్రమట్టానికి 13వేల అడుగుల ఎత్తున నిర్మించిన సేలా సొరంగాన్ని జాతికి అంకితం చేశారు. దీని ద్వారా భారతీయ సేనలు ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనైనా సరిహద్దులకు చేరుకోగలవు. దీనిని 825 కోట్ల వ్యయంతో నిర్మించారు.