Site icon vidhaatha

ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మ‌న్‌గా చిన్నారెడ్డి

విధాత, హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గా మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డిని ప్రభుత్వం నియమించింది. పీసీసీ క్రమశిక్షణా సంఘం చైర్మన్‌గా ఉన్న చిన్నారెడ్డి పార్టీకి అందించిన సేవలను దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కేబినెట్ హోదా ఉన్న తెలంగాణ స్టేట్ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్‌గా నియమించిడం విశేషం. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వ‌న‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి చిన్నారెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించింది. కానీ చివరి నిమిషంలో చిన్నారెడ్డి పేరును తొల‌గిస్తూ మేఘా రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అవ‌కాశం క‌ల్పించింది. మేఘారెడ్డి.. నిరంజ‌న్ రెడ్డిపై భారీ మెజార్టీతో గెలుపొందారు.

చిన్నారెడ్డి వ‌న‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1985లో యువ‌జ‌న కాంగ్రెస్ నేత‌గా ఉన్న చిన్నారెడ్డి.. వ‌న‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేసి టీడీపీ అభ్య‌ర్థి బాల‌కృష్ణ‌య్య చేతిలో ఓట‌మి పాల‌య్యారు. 1989లో మ‌ళ్లీ పోటీ చేసి బాల‌కృష్ణ‌య్య‌పై విజ‌యం సాధించి, తొలిసారి శాస‌న‌స‌భ‌లో అడుగుపెట్టారు చిన్నారెడ్డి. 1994 ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థి రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 1999 ఎన్నిక‌ల్లో రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డిపై చిన్నారెడ్డి 3,500 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2004 ఎన్నిక‌ల్లోనూ గెలుపొందారు. వైఎస్సార్ కేబినెట్‌లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ప‌ని చేశారు. 2009 ఎన్నిక‌ల్లో రావుల చేతిలో ఓట‌మి పాల‌య్యారు చిన్నారెడ్డి. 2014 ఎన్నిక‌ల్లో చిన్నారెడ్డి గెలుపొందారు.


మొత్తంగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు చిన్నారెడ్డి. 2018 ఎన్నిక‌ల్లో బీఆరెస్ అభ్యర్థి నిరంజ‌న్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2021లో జ‌రిగిన హైద‌రాబాద్ – రంగారెడ్డి – మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పోటీ చేసి ఓట‌మి చ‌వి చూశారు. వైఎస్సార్ ప్రభుత్వ హాయంలో ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌తో ఏర్పాటైన తెలంగాణ కాంగ్రెస్ ఫోరం బాధ్యతలు నిర్వర్తించారు. 2000సంవత్సరంలో 41మంది ఎమ్మెల్యేలతో ప్రత్యేక రాష్ట్రం కావాలని సోనియాగాంధీకి లేఖ అందించడంలో ఆయన కీలక భూమిక పోషించారు.

Exit mobile version