Site icon vidhaatha

Suryapeta: చివ్వెంల BC గురుకుల పాఠశాల ప్రమాదంపై మంత్రి జగదీష్‌రెడ్డి దిగ్భ్రాంతి

విధాత: చివ్వెంల బిసి గురుకుల పాఠశాలలో వాటర్ సంపు గోడ కూలి ఒక విద్యార్థి మృతి చెందగా, ఇద్దరికి గాయాలైన సంఘటన దురదృష్టకరమని సూర్యాపేట ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ఘటన విషయం తెలిసిన వెంటనే దిగ్భ్రాంతికి లోనైన మంత్రి జగదీష్ రెడ్డి హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామార్శించి వైద్యసహయం అందేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రెండుగంటల పాటు క్షతగాత్రుల కుటుంబ సభ్యులతో ఆసుపత్రిలోనే ఉన్న మంత్రి జగదీష్ రెడ్డి వైద్య సేవలను పర్యవేక్షించారు.

ప్ర‌మాద ఘటనలో మృతి చెందిన మోతె మండలం అప్పన్నగూడేనికి చెందిన పవన్ అనే ఐదవ తరగతి విద్యార్థి కుటుంబానికి రెండు లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. దీంతో పాటు రెండుపడకల ఇల్లుతో, కుటుంబంలో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం, మృతుడి సోదరికి గురుకుల పాఠశాలలో విద్యా అవకాశం కలిస్తున్నట్లు తెలిపారు. గాయపడిన విద్యార్థులకు ప్రభుత్వ ఖర్చులతో వైద్యం అందిస్తామని మంత్రి తెలిపారు. నల్లగొండ జిల్లా శాలీ గౌరారం మండలం లింగోటం గ్రామానికి చెందిన గాయపడిన విద్యార్థి యశ్వంత్‌ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు.

నూతనకల్ మండలం ఎర్ర పహాడ్ కు చెందిన సుశాంత్ అనే విద్యార్థికి సూర్యాపేటలోని మెడికల్ కళాశాల ఆసుపత్రిలోనే చికిత్స జరుగుతుందన్నారు. ఘటన పై పూర్తి స్థాయిలో విచారణ జరుపాలని జిల్లా కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. బాధ్యులపై కఠినంగా చర్యలు తీకుంటాన‌ని హామీనిచ్చారు. ఇటువంటి ఘటనలు పున‌రావృతం కాకుండా ప్రభుత్వ గురుకులాలలో ముందస్తుగా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు.

Exit mobile version