Site icon vidhaatha

KaareemNagar: సీఎం మా బలం.. కార్యకర్తలే మా బలగం: మంత్రి క‌మ‌లాక‌ర్‌

విధాత, కరీంనగర్ బ్యూరో: ఆడబిడ్డల కళ్ళలో ఆనందాన్ని చూడాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ భావన అయితే.. ప్రధాని నరేంద్ర మోడీ కన్నీళ్లు పెట్టిస్తున్నాడని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆడబిడ్డ కన్నీరు పెడితే అరిష్టమని, తెలంగాణ ఆడబిడ్డను విచారణ పేరిట ఏడిపించడం మోడీ ప్రభుత్వానికి మంచిది కాద‌ని సూచించారు.

మంగళవారం జరిగిన భారత రాష్ట్ర సమితి జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి తమకు ‘బలం’ అయితే… పార్టీ కార్యకర్తలు తమ ‘బలగమని’ అన్నారు. భావితరాల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే ముఖ్యమంత్రికి కార్యకర్తలు ఎల్లప్పుడూ అండగా ఉండాలన్నారు. బడుగు, బలహీన వర్గాలకు వెన్ను దన్నుగా నిలుస్తున్న
బీఆర్ఎస్ రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా విస్తరించడం ఖాయమని ధీమా వ్య‌క్తం చేశారు.

కుటుంబంలో తగాదాలు ఉంటే కూర్చొని మాట్లాడుకున్నట్టే, పార్టీలోని తగాదాలను సామరస్యంగా పరిష్కరించుకుందామన్నారు. అంతే తప్ప వాటిని దృష్టిలో ఉంచుకొని ఎవరు కూడా పార్టీకి దూరం కావద్దని సూచించారు. బీఆర్ఎస్ కు తాము హక్కుదారులమని, తమ పరంగా ఏవైనా తప్పులుంటే సవరించుకుంటామన్నారు. ఆత్మీయ సమ్మేళనాలతో కార్యకర్తలకు మరింత దగ్గరవుతామని హామీనిచ్చారు.

Exit mobile version