Site icon vidhaatha

మళ్లొక్కసారి యాగం.. జగన్‌కు సీఎం యోగం!

విధాత‌: సినిమావాళ్లకు.. క్రీడాకారులకు.. రాజకీయ నాయకులకు విపరీతమైన సెంటిమెంట్స్.. దైవభక్తి.. ఇష్ట దేవతారాధన వంటివి ఉంటాయి. ఏదైనా క్లిష్ట సమయంలో వ్రతమో.. యజ్ఞమో.. యాగమో చేసి మంచి ఫలితం సాధిస్తే దాని పట్ల ఇంకా విశ్వాసం పెరుగుతుంది.

ఇప్పుడు విశాఖలోని శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి కూడా అలాగే ఉన్నారు. గతంలో జగన్ విజయం కోసం యజ్ఞం చేశానని బాహాటంగా ప్రకటించిన స్వామి ఆ తరువాత కేసీఆర్ రెండోసారి విజయానికి రాజ శ్యామల యాగం చేశారు. కేసీఆర్ గెలిచాక విశాఖ వచ్చి స్వామిని దర్శించుకున్నారు.

ఇప్పుడు మళ్లీ రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికలకు టైం వచ్చింది. దీంతో మళ్ళీ స్వామి జగన్ కోసం యాగం చేస్తున్నారు. కేసీఆర్ ను రెండుసార్లు.. జగన్ను ఒకసారి సీఎంగా చేసిన రాజ శ్యామల యాగం మళ్ళీ శారదా పీఠంలో చేస్తారు. దానికోసం జగన్ 28న ఆశ్రమానికి వస్తున్నారు.

గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యాగంలో పాల్గొన్న జగన్ యాగ‌ ఫలాన్ని దక్కించుకుని సీఎం అయ్యారు. ఇపుడు జగన్ మరోమారు రాజశ్యామల యాగంలో పాల్గొన బోతున్నారు. ఈ నెల 28న విశాఖ శారదాపీఠంలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ముఖ్యమంత్రి జగన్ హాజరవుతున్నారు.

అక్కడ జరిగే రాజశ్యామల యాగంలో పాల్గొంటారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ యాగం చాలా శక్తిమంతమైనదని, దీన్ని చేయిస్తే మరోమారు జగన్ ఏపీకి సీఎం కావడం ఖాయమని అభిమానులు, కార్యకర్తలు అంటున్నారు. ఆయన జాతకంలో ప్రస్తుతం మహర్దశ నడుస్తోందని దాంతో ఆయనకు రాజయోగం కొనసాగుతుందని అంటున్నారు.

Exit mobile version