Site icon vidhaatha

CM KCR | కమ్యూనిస్టులతో ఖటీఫ్‌.. రగిలిపోతున్న కామ్రేడ్‌లు

CM KCR | విధాత: బీఆరెస్ అధినేత, సీఎం కేసీఆర్ సోమవారం బీఆరెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించడంతో పాటు కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు లేదని కూడా తేల్చిపారేశారు. మొత్తం 119స్థానాలలో అభ్యర్థుల ఎంపిక వివాదం నేపధ్యంలో నాలుగు స్థానాలు పెండింగ్‌లో పెట్టిన సీఎం కేసీఆర్ మిగతా 115స్థానాలకు బీఆరెస్ అభ్యర్థులను ప్రకటించారు. కమ్యూనిస్టు పార్టీలు అడిగిన సీట్లకు కూడా బీఆరెస్ అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్ ఆ పార్టీలతో పొత్తుల ఊసు లేకుండానే పొత్తు లేదని తేల్చిచెప్పారు.

దీంతో మునుగోడు ఉప ఎన్నికతో ఏర్పడిన బీఆరెస్‌, కమ్యూనిస్టుల మైత్రీ బంధానికి తెరపడినట్లయ్యింది. మునుగోడు ఉప ఎన్నికతో మొదలైన బీఆరెస్‌, వామపక్షాల పొత్తు అదే ఎన్నికకే పరిమితమై ముగిసిన తీరు కమ్యూనిస్టులకు రాజకీయ విషాదమేనన్న అభిప్రాయం వినిపిస్తుంది.

ఉప ఎన్నికల్లో తన పంతం నెగ్గించుకునే క్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా పార్టీ యంత్రాంగాన్ని సర్వం దించేసి, అధికార యంత్రాంగాన్ని పరోక్షంగా దుర్వినియోగం చేసినా గెలుపుపై నమ్మకం లేక స్థానికంగా బలంగా ఉన్న కమ్యూనిస్టులతో ఆనాడు సీఎం కేసీఆర్ పొత్తు పెట్టుకున్నారు.

ఉప ఎన్నికల్లో బీఆరెస్ గెలిచాకా ఖమ్మం బీఆరెస్ ఆవిర్భావ సభలో మినహా మళ్లీ వారితో ఏనాడు సీఎం కేసీఆర్ సమావేశం కాలేదు. దీంతో మునుగోడు ఉప ఎన్నిక వరకే కమ్యూనిస్టుల పొత్తును కూరలో కరివేపాకు మాదిరిగా వాడుకుని వదిలేసిట్లయ్యిందని కమ్యూనిస్టులు బాధ పడుతున్నారు. తమను ఇంతకాలం ఎంతగా అవమానించేలా సీఎం కేసీఆర్ వ్యవహారించినప్పటికి ఆయనకు వ్యతిరేకంగా వెళ్లకుండా అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుపై సీపీఐ, సీపీఎం నాయకత్వం ఎన్నో ఆశలు పెట్టుకుంది.

బీఆరెస్‌తో పొత్తుతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాతినిధ్యం దక్కించుకోవాలని ఆశించిన సీపీఐ, సీపీఎంలకు కేసీఆర్ గట్టి జలక్ ఇచ్చినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తుతో వచ్చే లాభం కంటే వారు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తేనే ఓట్లు చీలి తమకు మేలు జరుగుతుందన్న స్ట్రాటజీని కేసీఆర్ నమ్మడంతోనే పొత్తుకు విముఖత చూపారని గులాబీ వర్గాల కథనం.

అంతేగాక కమ్యూనిస్టులు అడుగుతున్న సీట్లలో తమకు సిటింగ్ ఎమ్మెల్యేలు, బలమైన ఆశావహులుం డటం, పార్టీ బలంగా ఉండటంతో పొత్తులు అనవసరమని కేసీఆర్ భావించడంతోనే పొత్తుల ఆలోచన విరమించుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

రగిలిపోతున్న కమ్యూనిస్టులు

గతంలో ఏ నాయకుడు కూడా చేయని రీతిలో తమను సీఎం కేసీఆర్ రాజకీయంగా మోసగించారన్న ఆగ్రహంతో కామ్రేడ్లు రగిలిపోతున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు కోసం వాడుకుని, పొత్తుపై ఆశలు రేపిన కేసీఆర్ ఎన్నికలకు ముందు దూరం పెట్టడాన్ని కమ్యూనిస్టులు జీర్ణించుకోలేకపోతున్నారు.

అయితే మొదటి నుంచి కూడా కమ్యూనిస్టు పార్టీల కేడర్ బీఆరెస్‌తో పొత్తుకు ప్రతికూలతనే వ్యక్తం చేస్తున్నారు. వారి మనోభావాలు పట్టించుకోకుండా సీపీఐ, సీపీఎం నాయకత్వం వ్యవహరించి కేసీఆర్ చేతిలో భంగపడటం విషాధకరం.

బీఆరెస్ ప్రభుత్వంపైన, ఆ పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపైన ప్రజా వ్యతిరేకతను సైతం పట్టించుకోకుండా, అసెంబ్లీలో ప్రాతినిధ్యం లక్ష్యంగా తమ పార్టీల నాయకత్వం కేసీఆర్‌ను నమ్మి మోసపోయారని ఇకనైనా సొంత శక్తిపైన ఆధారపడి ఎన్నికలకు సంసిద్ధం కావడం మినహా చేసేదేమి లేదన్న అభిప్రాయం కేడర్‌లో వినిపిస్తుంది.

బీఆరెస్ బీజేపీకి బీటీమ్ అన్న విమర్శలను కూడా పట్టించుకోకుండా దేశ రాజకీయాల్లో బీజేపీకి వ్యతిరేకంగా బీఆరెస్ పోరాడుతున్నందునా తమకు మిత్రపక్షమన్న సన్నాయినొక్కులతో కమ్యూనిస్టులు పొత్తుకు బీఆరెస్‌తో సర్ధుకుపోయినా ప్రయోజనం లేకుండా పోయి వ్రతం చెడ్డా సుఖం దక్కలేదన్న చందంగా మారింది.

కాంగ్రెస్‌తో ప్రత్యామ్నాయ పొత్తుకు అవకాశం

బీఆరెస్ తో పొత్తు దూరమైనందునా కాంగ్రెస్‌తో దగ్గరయ్యేందుకు ప్రత్యామ్నాయ రాజకీయ అవకాశం కమ్యూనిస్టులకు మిగిలేవుంది. ఆ పార్టీ కూడా కమ్యూనిస్టులు అడిగిన సీట్లు ఇస్తుందో లేదోనన్న సందేహాలతో పాటు ఎన్నికలు సమీపిస్తున్న ఈ దశలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే ఆ ప్రభావం ప్రజల్లో ఏ విధంగా ఉంటుందోనన్న సందేహాలు కమ్యూనిస్టుల్లో వినిపిస్తున్నాయి.

మొత్తం మీద బీఆరెస్‌తో పొత్తుల కోసం వెంపర్లాడిన కమ్యూనిస్టులు టీఎస్‌పీఎస్సీ వంటి ఆందోళనలు, డబుల్ బెడ్‌రూమ్‌లు, ధాన్యం కొనుగోలు, పంట నష్టపరిహారం, ధరణి, నిరుద్యోగ భృతి, విద్యుత్తు, పోడు భూములు, రుణమాఫీ, ఆర్టీసీ, ప్రభుత్వ భూముల అమ్మకం వంటి సమస్యలపై కొంతకాలంగా పోరుబాటను వీడి, ప్రభుత్వంపై విమర్శలు పక్కన పెట్టి పార్టీ బలోపేతం దిశగా అందివచ్చిన అవకాశాలను సైతం వదిలేసుకున్నారు. ఇప్పుడు బీఆరెస్‌తో పొత్తు బంధం లేనందునా ఇకముందు ప్రభుత్వ వైఫల్యాలపై కమ్యూనిస్టులు మళ్లీ పోరుబాట పట్టక తప్పదని కేడర్ భావిస్తుంది.

Exit mobile version