Site icon vidhaatha

CM KCR | వరదలను, సహాయ చర్యలను నిరంతరం పర్యవేక్షించండి: సీఎం కేసీఆర్

CM KCR

విధాత: తెలంగాణలో కొన్ని రోజులుగా కురస్తున్న వర్షాలు, వరదల పరిస్థితులను, సహాయ చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో వరదల పరిస్థితులపై ఆయా శాఖల అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.

సమీక్షలో ఆయన గోదావరి పరివాహక ప్రాంతాల్లో వర్షాలు, వరదలపై అధికారులతో చర్చించారు. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్ జిల్లాల్లో గోదావరి వరదలు, ముంపు పరిస్థితుల వివరాలను, శ్రీరాంసాగర్‌, నిజాంసాగర్‌, కడెం, కాళేశ్వరం సహా వివిధ ప్రాజెక్టుల నీటి మట్టాలను,వరద రాక వివరాలను తెలుసుకున్నారు. ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ తో ఫోన్‌లో మాట్లాడి భద్రచలం వద్ద వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

జంటనగరాలలోని జలాశయాలతో పాటు మూసీ వరదల వివరాలను సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేయాలని, వరద బాధితులకు తక్షణ సహాయ చర్యలను చేపట్టాలని, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, అత్యవసర చర్యల విషయంలో వెనుకాడవద్దన్నారు.

ఈ సమీక్షా సమావశంలో మంత్రులు టీ.హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌, జి.జగదీష్ రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సహా ఇరిగేషన్‌, వ్యవసాయ, ఆర్‌ఆండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Exit mobile version