విధాత: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ పార్థివదేహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. ఫిల్మ్ నగర్‌లోని కైకాల నివాసానికి సీఎం కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం చేరుకున్నారు. ఈ సందర్భంగా కైకాల పార్థివదేహానికి కేసీఆర్ నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి, సంతాపం తెలిపారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. సినీ నటులు కైకాల సత్యనారాయణ చాలా విలక్షణమైన నటుడు అని కొనియాడారు. హీరోకున్న గ్లామర్ సత్యనారాయణకు ఉంది. ఏ పాత్ర ఇచ్చిన కూడా సజీవంగా జీవిస్తూ నటించి అద్భుతమైన పేరు తెచ్చుకున్నారు. కైకాల ఎంపీగా పని చేసిన కాలంతో ఆయనతో కొన్ని అనుభావాలు కూడా పంచుకున్నాం.
కొంతకాలం మేమంతా కలిసి కూడా పని చేశాం. తెలుగు చలనచిత్ర పరిశ్రమ సీనియర్ నటుడిని కోల్పోవడం చాలా బాధాకరం. సత్యనారాయణ లోటును ఎవరూ కూడా పూడ్చలేరు. ఆయనకు సమానమైన నటులు కూడా ఇప్పుడు లేరు. ఆయన పోషించిన పాత్రలు అద్భుతం అంటూ కేసీఆర్ పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ వెంట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దానం నాగేందర్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు ఉన్నారు.