ఇసుకలో పేక మేడలు కట్టారా: సీఎం రేవంత్‌ రెడ్డి

ఇసుక కదిలితే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కూలిందని ఒకసారి, బాంబులు పెట్టారని సీఎం రేవంత్‌రెడ్డి బీఆరెస్‌పై అసెంబ్లీ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

  • Publish Date - February 13, 2024 / 08:45 AM IST

  • ఇసుక కదిలితే బ్యారేజీలు కూలుతాయా
  • రీడిజైన్‌ బ్రహ్మపదార్ధంతో అంచనాలు పెంచేశారు
  • ప్రాజెక్టుల శ్వేత పత్రం చర్చలో కాళేశ్వరం కథేమిటో తేల్చుదాం
  • బ్యారేజీ వద్ధ పోలీసు కాపలాతో అనుమానాలు రెట్టింపు
  • వాస్తవలను ప్రజల ముందుంచేందుకే మేడిగడ్డ సందర్శన
  • కేసీఆర్‌, హరీశ్‌రావులు వస్తామంటే హెలిక్యాప్టర్‌ పెడుతాం
  • అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి


విధాత, హైదరాబాద్‌ : ఇసుక కదిలితే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కూలిందని ఒకసారి, బాంబులు పెట్టారని మరోసారి గత బీఆరెెస్‌ ప్రభుత్వం చెప్పిందని, ఇసుకపై మీరేమైనా పేక మేడలు కట్టారా అని సీఎం రేవంత్‌రెడ్డి బీఆరెస్‌పై అసెంబ్లీ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మేడిగడ్డ కుంగుబాటుపై మొదట బాంబులు పెట్టారని పోలీసులకు ఫిర్యాదు చేశారని బాంబులతో పేల్చితే ఎక్కడైనా పైకి పేలుతుందే తప్ప కిందకు కుంగిపోదని ఆ మాత్రం సోయి లేకుండా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. మంగళవారం ఐదో అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టులపై జరిగిన స్వల్పకాలిక చర్చలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు అని పెద్దలు చెప్పారన్నారు.


తెలంగాణకు ప్రధానంగా తాగు, సాగునీటి వనరులుగా కృష్ణా, గోదావరి నదులున్నాయని, కృష్ణా జలాలపై ఇప్పటికే కొంత మేర శాసనసభలో చర్చించామన్నారు. వాస్తవాలను రాష్ట్ర ప్రజలకు వివరించగలిగామన్నారు. ఇక రెండోది గోదావరి జలాలకు సంబంధించి తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకే గతంలో వైఎస్సార్‌ హయాంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. రూ.38,500 కోట్ల అంచనాతో 2008లో టెండర్ల ప్రక్రియ చేపట్టారని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యే నాటికే వేల కోట్ల రూపాయల విలువైన పనులు జరిగాయన్నారు. బీఆరెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుల రీడిజైన్ అనే బ్రహ్మపదార్థాన్ని కనిపెట్టి రీడిజైన్లతో అంచనాలను అమాంతంగా పెంచేశారన్నారు.


తుమ్మిడిహట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాజెక్టులో మార్పులు చేర్పులు చేసి మేడిగడ్డ అన్నారని, సుందిళ్ల, అన్నారం అంటూ బ్యారేజీలు కట్టుకుంటూపోయారన్నారు. చివరకు రూ.38,500 కోట్ల అంచనాతో ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.1.47 లక్షల కోట్లకు పెంచారన్నారు. భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అంచనాలు ఎలా పెంచారు? రీడిజైనింగ్ ఎలా చేశారు! అందులో సాంకేతికపరమైన అంశాలు ఏమున్నాయి? రీడిజైనింగ్‌కు సంబంధించి నిపుణులు ఇచ్చిన డీపీఆర్ ఎక్కడ ఆ తర్వాత జరిగిన నిర్మాణం, నిర్వహణ.. ఇవన్నీ ఇప్పటికీ అనేక ప్రశ్నలు మిగిల్చాయన్నారు.


బ్యారేజీ వద్ద అంత కాపలా ఎందుకో


వేల కోట్లు ఖర్చు చేసి కట్టిన మేడిగడ్డ కుంగిపోతే బ్యారేజీ వద్దకు బీఆరెస్‌ పాలకులు ఎవరూ వెళ్లకుండా, ఎవరిని చూడనీయకుండా పోలీసు పహారా పెట్టారు. భారత్-పాక్ సరిహద్దు వాఘా వద్ద కూడా ఆ స్థాయిలో సెక్యూరిటీ ఉంటుందని నేను అనుకోవడం లేదన్నారు. బ్యారేజీపై ఫిర్యాదులు అందడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగిందని, ప్రాజెక్టు పరిస్థితి ఏంటనే వివరాలతో కూడిన నివేదికను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిందని, మరమ్మతులతో ప్రయోజనం లేదని చెప్పిందని, చివరకు ఆ నివేదికనూ గత ప్రభుత్వం తప్పుబట్టిందన్నారు.


కాంగ్రెస్, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేడిగడ్డ కుంగుబాటు పరిణామాల నేపథ్యంలో కొంతమంది అధికారులు కార్యాలయాల నుంచి పైళ్ళు మాయం చేశారని పెద్ద ఎత్తున టీవీలు, పత్రికల్లో వచ్చిందన్నారు. దీంతో తక్షణమే మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల వద్ద జరిగిన అవకతవకలపై విచారణకు ఆదేశించామని, విజిలెన్స్ కమిటీ ప్రాథమికంగా నివేదిక ఇచ్చిందన్నారు. బ్యారేజీ నిర్మాణంలో తీసుకున్న నిర్ణయాలు, నిర్వహణలో నిర్లక్ష్యం సహా అనేక విషయాలను అందులో ప్రస్తావించిందన్నారు. కాగ్‌ సైతం కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవకతవకలు జరిగినట్లుగా పేర్కోందన్నారు.


ఇప్పటికీ బ్యారేజీ వద్ద ఏం జరిగిందో ఎవరికీ తెలియదని, కొంతమంది బీఆరెస్‌ సీనియర్లు ఉన్నప్పటికీ వారికి పూర్తి అవగాహన ఉందో లేదో తెలియదని, అందుకే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరినీ బ్యారేజీ సందర్శనకు రావాలని కోరామన్నారు. క్షేత్ర స్థాయి సందర్శనతో అక్కడి వాస్తవ పరిస్థితులు ప్రతి ఒక్కరికీ తెలుస్తాయన్నారు. తనకు కూడా అన్ని విషయాలు తెలియవని నేర్చుకునేందుకు సిద్ధమని, అందుకే అందరం కలిసి మేడిగడ్డకు వెలుదామని కోరుతున్నానన్నారు. ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించేందుకే ప్రాజెక్టుల సందర్శన చేపట్టామన్నారు. హరీష్ రావు, కడియం శ్రీహరి వంటి అనుభవం ఉన్న వారు వచ్చి ప్రాజెక్టులను చూడాలన్నారు.


అద్భుతమేమిటో మాకు చెప్పేందుకైనా రండి


కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతో గొప్పది.. అద్భుతం.. అని ప్రచారం చేశారని, కాళేశ్వరం ప్రాజెక్టు బీఆరెస్‌ నేతలకు ఏటీఎంలా మారిందని.. వారి ఇళ్లల్లో కనకవర్షం కురిసిందని మేం అనడం లేదని, తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలియాలని, అదొక్కటే మా ఉద్దేశమన్నారు. ప్రాజెక్టుల వద్ద ఉన్న వాస్తవ పరిస్థితులను పరిశీలించి రెండు మూడు రోజుల్లో శ్వేత పత్రం విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే కేసీఆర్ కు నేను విజ్ఞప్తి చేస్తున్నానని, మీరు, మీ శాసన సభ్యులు మేడిగడ్డకు రండి. మీరు అవిష్కరించిన అద్భుతాలను దగ్గరుండి వివరించండన్నారు. మీ అనుభవాలను అక్కడ అందరికీ వివరించండని కోరారు.


దీంతో పాటుగా వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందా? లేదా? తప్పు జరిగిందా లేదా? జరిగితే కారణం. ఎవరు?.. శిక్ష ఏమిటి..? అని రేవంత్‌ ప్రశ్నించారు. కేసీఆర్‌ను అప్పటి గవర్నర్‌ కాళేశ్వర్‌రావు అన్నారని, ఆయన మేడిగడ్డకు రావాలని కోరారు. కేసీఆర్‌కు బస్సుల్లో రావడం ఇబ్బందైతే హెలిక్యాప్టర్‌ పెడుతామన్నారు. రేపో ఎల్లుండో సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేస్తారన్నారు. సభలో చర్చ పెట్టి కాళేశ్వరం కథేంటో సభలో తెలుద్దామన్నారు. అనంతరం స్పీకర్ సభను ఈ నెల 14(బుధవారం)కు వాయిదా వేశారు. అనంతరం సీఎం ఎమ్మెల్యేలతో కలిసి బస్సులలో కాన్వాయ్ తో మేడిగడ్డ పయనమయ్యారు.

Latest News