- సీమ లిఫ్ట్‌కు బీజం మీ డైనింగ్ టేబుల్‌పైనే
- నల్లగొండలో కాదు.. ఢిల్లీలో దీక్ష చేయండి
- కలెక్షన్.. సెలక్షన్.. ఎలక్షన్..
- రాజీనామాలంటే మీకు ఇదే కదా!
- సీఎం సీటులో రైతుబిడ్డను ఓర్వలేనితనం
- ఉద్యమకారులు, కవులను మేం గౌరవించాం
- తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ప్రకటించాం
- చిహ్నం.. తెలంగాణ తల్లి విగ్రహం మార్చుతాం
- త్వరలో 15వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ
- గ్రూప్ 1 వయో పరిమితి 46 ఏళ్లకు పెంపు
- ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి
- మేడిగడ్డ చూసొచ్చేందుకూ రావాలి
- గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చకు సమాధానంలో సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | విధాత, హైదరాబాద్ : తెలంగాణకు న్యాయంగా రావాల్సిన కృష్ణా జలాలకు, నల్లగొండ రైతులకు మరణ శాసనం రాసిందే కేసీఆర్ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రాజెక్టులు తీసుకుంటుంటే నల్లగొండలో సభ పెడతారా? బీఆరెస్‌ను నిలదీశారు. ‘కృష్ణా ప్రాజెక్టులపై నల్లగొండలో కాదు.. దమ్ముంటే ఢిల్లీలో ధర్నాలు చేయాలి. ప్రాజెక్టులు గుంజుకుంటానన్న మోదీ దగ్గర చేయాలి. చేతనైతే జంతర్ మంతర్ వద్ద కేసీఆర్, హరీశ్, కేటీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేయండి’ అని రేవంత్ రెడ్డి హితవు పలికారు.
గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు శుక్రవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి సమాధానమిస్తూ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కృష్ణా జలాల హక్కులను ధారదత్తం చేసిందే కేసీఆర్ అని, విభజన చట్టం రాసిందే తానని ఆయన చెప్పుకొన్నారని పేర్కొన్నారు. అందులో లోపాలకు బాధ్యత కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించిందంటూ బాధ్యతారహిత్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
కాళేశ్వరం అవినీతి చర్చకు రావడంతో కేఆర్ఎంబీ సమస్యను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. రోజా ఇంటికి వెళ్లి చేపల పులుసు తిని.. కేసీఆర్ ఇచ్చిన అలుసుతోనే నాగార్జున సాగర్ డ్యాంపైకి ఏపీ పోలీసులు ఆక్రమణకు తెగబడ్డారని అన్నారు. రాయలసీమను రతనాల సీమ చేస్తానని ఆనాడు కేసీఆర్ హామీ ఇచ్చిండన్నారు. ‘ఏపీ సీఎం జగన్‌తో లంచ్ చేసి, మీ డైనింగ్ టేబుల్ మీద రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుకు బీజం వేసింది నిజం కాదా?’ అని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం ఏకే 47 తుపాకులతో పోలీసులను సాగర్ డ్యామ్ మీకు పంపించిందని, కేసీఆర్ సహకారం లేకుండానే ఏపీ పోలీసులు అక్కడికి వచ్చారా? అని నిలదీశారు. వారిని ఎందుకు అడ్డుకోలేదో హరీశ్‌రావు చెప్పాలన్నారు. సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి ఎన్నికల్లో ఓట్లను కొల్లగొట్టాలని చూశారని విమర్శించారు.
కేసీఆర్‌కు పదేళ్లు అధికారమచ్చినా నల్లగొండ ఎస్ఎల్బీసీ, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేయలేదని విమర్శించారు. 97వేల కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరంతో 97వేల ఎకరాలకు కూడా నీరివ్వలేదన్నారు. తెలంగాణ హక్కుల కోసం తాను కొట్లాడుతుంటే కాళ్ల కింద కట్టె పెడుతున్నారన్నారు. ‘ప్రతిపక్ష నేతగా బాధ్యతగా సభకు వచ్చి కేసీఆర్ మాట్లాడరు. ఇక్కడున్న బీఆరెస్ సభ్యులు నిజాలు మాట్లాడలేరు’ అని ఎద్దేవా చేశారు. బీఅరెస్లో ఓ జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నాడని, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేక ఆటోలు ఎక్కి డ్రామాలు అడుతున్నాడని వ్యాఖ్యానించారు. అయినా ప్రజలు ఆయనకు ఆర్టిస్ట్‌గా కూడా మార్కులు వేయడం లేదని పరోక్షంగా కేటీఆర్‌పై రేవంత్ సెటైర్లు వేశారు.
తెలంగాణ ఓ భావోద్వేగం
తెలంగాణ ఒక భౌగోళిక రాష్ట్రం మాత్రమే కాదని, మనందరి భావోద్వేగమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. విధ్వంసకర ధోరణిని తిరస్కరిస్తూ ప్రజలు గత ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చారని చెప్పారు. సభకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హజరు కాలేదన్న రేవంత్.. ‘80 వేల పుస్తకాలు చదివిన మేధావిని అని ఆయన పదే పదే చెప్పుకుంటారు. ఆ మేధస్సును 4 కోట్ల ప్రజల అభివృద్ధి కోసం ఉపయోగిస్తారనుకున్నాం. ప్రభుత్వ నిర్ణయాలపై సలహాలు, సూచనలు ఇస్తారని భావించాం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడి కుర్చీ ఖాళీగా ఉండటం సమాజానికి మంచిది కాదు. భవిష్యత్తులోనైనా ప్రతిపక్ష నాయకుడు సభకు హాజరు కావాలని కోరుకుంటున్నాం’ అని చెప్పారు.
రాష్ట్ర చిహ్నంలో రాచరిక ఆనవాళ్లు
తెలంగాణ అమరుల త్యాగాలు ప్రతిబింబించేలా టీఎస్‌ను టీజీగా మారిస్తే బీఆరెస్ నేతలు అభినందిస్తారని అనుకున్నామని రేవంత్ చెప్పారు. ‘రాష్ట్ర అధికారిక చిహ్నంలో రాచరికపు ఆనవాళ్లు ఉన్నాయి. ఇది రాచరికం కాదు.. ప్రజాస్వామ్యం. అందుకే ఆ చిహ్నాన్ని మార్చాలని నిర్ణయించాం. మా నిర్ణయాన్ని వాళ్లు స్వాగతిస్తారని అనుకున్నాం’ అని అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు విషయంలోనూ ప్రతిపక్షం కలిసి వస్తుందనుకున్నామని, కానీ తమకు నిరాశే మిగిలిందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం సగటు తెలంగాణ బిడ్డలా లేదని, నగలు, కీరీటాలతో అంలంకరించి ఉండటం సరికాదని అన్నారు.
చాకలి ఐలమ్మ పోరాటం చేసిన నేల తెలంగాణ అని, అలాంటి వీర మహిళల ఆస్తిత్వాన్ని కాపాడేందుకే తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని రూపొందిస్తామని స్పష్టం చేశారు. అందెశ్రీ రాసిన జయజయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చుతామని తెలిపారు. ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసిపడేలా చేసిన జయ జయహే తెలంగాణ గీతాన్ని గత పాలకులు వినపడకుండా చేశారన్నారు. జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటిస్తే ప్రతిపక్ష నేతలు అభినందిస్తారని ఆశించిన తెలంగాణ ప్రజలకు నిరాశే మిగిలిందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు మేం ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్నారు. మంచి పనిని అభినందించకపోగా.. బీఆరెస్ నేతలు వ్యతిరేకిస్తున్నారన్నారు. ఉద్యమకారులను..కవులను మేం గౌరవించామని, మీ ఆనవాళ్లు లేకుండా చేస్తామన్నారు.
నియామకాలంటే.. మీలా అమ్ముకోవడం కాదు..
2014 నుంచి 2018 వరకు బీఆరేస్ ఒక్క ఆడబిడ్డకు మంత్రి పదవి ఇవ్వకపోయినా ఎవరూ ప్రశ్నించలేదని రేవంత్‌రెడ్డి అన్నారు. ఉద్యోగ నియామకాలు అంటే మీలా సంతలో సరుకుల్లా అమ్ముకోవడం కాదన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో 6,954 నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలు అందించామని, సింగరేణిలో 4వందలకు పైగా నియామకాలు చేపట్టమాని తెలిపారు. ఇది తమ చిత్తశుద్ధి అన్నారు. విపక్ష నేతలు చొక్కాలు చించుకున్నా.. త్వరలోనే 15వేల పోలీస్ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని స్పష్టంచేశారు. మా ప్రభుత్వంలో మైనారిటీలకు సముచిత స్థానం కల్పించామని, మైనారిటీల హక్కులు, వాటాలను, కోటాలను కాపాడటంలో మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్నారు.
యూనివర్సిటీలలో ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని, గడీల పాలన ఆనవాళ్లను బద్దలు కొట్టాలనే డిసెంబర్ 9 బదులు డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేశామని, ప్రజలకు మంచి పరిపాలన అందించాలనే ముళ్ల కంచెలను తొలగించామన్నారు. ఆ భవనానికి బడుగుల ఆరాధ్య దైవం జ్యోతిరావు పూలే పేరు పెట్టామన్నారు. నియోజకవర్గ సమస్యలపై బీఆరెస్ ఎమ్మెల్యేలు నన్ను కలిసేందుకు వస్తే వారిని అనుమానించి అవమానిస్తున్నారని, ఒక్కరి కోసం ఎమ్మెల్యేలందరిని బలిపశువులు చేస్తున్నారన్నారు. ప్రెస్ మీట్లు పెట్టి వివరణ ఇచ్చుకోవాల్సిన దుస్థితి వాళ్లదన్నారు. మీరు వారిని అనుమానించకండి… మేం మీలా కాదని స్పష్టం చేశారు. ఇప్పటికే 80శాతం పెన్షన్లను అందించామని, మరో 15 రోజుల్లో మిగతా 20శాతం ఇచ్చి పెన్షనర్లను ఆదుకుంటామన్నారు.
తొమ్మిదిన్నరేళ్ల బీఆరెస్ పాలనలో కాళోజీ కళాక్షేత్రం ఎందుకు పూర్తి చేయలేదని, కాళోజీ కళా క్షేత్రాన్ని పూర్తి చేసి వారి గౌరవాన్ని కాపాడుతామన్నారు. తొమ్మిదినరేళ్లలో తన గ్రామాన్ని రెవెన్యూ విలేజ్ గా మార్చాలన్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ కోరిక కూడా తీర్చలేకపోయారని, డిసెంబర్ 7న అధికారం చేపట్టిన మరుక్షణం జీవో 405 తో ఆ గ్రామాన్ని రెవెన్యూ విలేజ్ గా మార్చామన్నారు. ఇంద్రవెల్లి పోరాట యోధులకు నివాళిగా స్మృతి వనం అభివృద్ధి చేస్తున్న ఘనత మాదేనన్నారు. అమరుల కుటుంబాలను వెతికి వెతికి వారికి ఆలంబనగా నిలిచిన ఘనత మాదన్నారు. తెలంగాణ ప్రజలను చైతన్యపరిచిన గూడ అంజన్నను పరామర్శించేందుకు కూడా ఆనాటి సీఎం రాజసౌధం నుంచి బయటకు రాలేదన్నారు.
గద్దర్ అన్న వినతిపత్రం ఇస్తానని వస్తే ప్రగతిభవన్ ముందు ఎర్రటి ఎండల మూడు గంటలకు కూర్చోబెట్టినారని, మేం చనిపోయాక సగౌరవంగా అంత్యక్రియలు జరిపించంతో పాటు మీరు చరిత్ర పుటల్లో లేకుండా చేయాలనుకున్న గద్దర్ పేరుతోనే కళాకారులకు అవార్డులు అందించాలని మా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రజల మేలు కోసం ప్రతిపక్షం పనిచేయాలని, ప్రజాభిప్రాయానికి భిన్నంగా వ్యవహరించి రాజకీయ కుయుక్తులు వేస్తామని మీరు అనుకుంటే అదీ చూద్దామన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో అందరి సహకారం ఉంటుందని భావిస్తున్నానన్నారు.
దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబం అది..
కుటుంబ పాలన అని కాంగ్రెస్‌ను నిందిస్తున్నారని, గాంధీ కుటుంబం దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబమని, ప్రధాని పదవిని సోనియాగాంధీ వదులుకున్నారని రేవంత్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబం త్యాగం చేసిందేమీ లేదన్నారు. తెలంగాణ కోసమే రాజీనామాలంటూ అదే వారి త్యాగాలని చెప్పుకున్నారని, ఎలక్షన్, సెలక్షన్, కలెక్షన్ కోసమే వారి రాజీనామాలని, అదే బీఆరెస్ విధానమని, రాజీనామాలు చేసిన మూడు నెలలకే మళ్లీ పదవులు తీసుకున్నారన్నారు. తమ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేసి తెలంగాణ వచ్చినాకే మంత్రి పదవి తీసుకున్నారని చెప్పారు. తామెవరం తండ్రి పేరు, తాత పేరు చెప్పుకొని మేనేజ్మెంట్ కోటాలో రాలేదని, నల్లమల అడవుల నుంచి రైతుబిడ్డగా పైకి వచ్చామని అన్నారు. ఓ రైతుబిడ్డ సీఎం కుర్చీలో కూర్చోవడం కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు.
కాగా.. తాను పీసీసీ అధ్యక్షుడిగా సచివాలయానికి వినతి పత్రం ఇచ్చేందుకు వస్తే వందలాది పోలీసులు చుట్టుముట్టి బంధించి తీసుకెళ్లి ఇంటికాడ పడేశారన్నారు. ఆదివాసీ బిడ్డ సీతక్క వస్తే ఆమెను కూడా లోనికి రానియ్యలేదన్నారు. ఎవరి కోసం సచివాలయం? ప్రజల కోసం కాదా? ఎవరి ఆస్తి అది? ఎవరి పరిపాలన అక్కడినుంచి జరగాలి? ప్రజల్ని రానివ్వని సచివాలయాలు ఎందుకు? అని రేవంత్ ప్రశ్నించారు. అందుకే తాము అధికారంలోకి రాగానే ప్రగతిభవన్ గోడలు బద్దలు కొట్టి, సచివాలయం గేట్లు బార్ల తెరిచి ప్రజాభవన్‌గా మార్చి ప్రజలంతా స్వేచ్ఛగా సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పించామన్నారు.
గ్రూప్1 పరీక్షలకు అభ్యర్ధుల వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచి త్వరలోనే గ్రూప్1 నిర్వహిస్తామని శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. “కొన్ని నిబంధనల వల్ల టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ఆలస్యమైందని,. నలుగురి ఉద్యోగాలు పోయిన బాధతో విపక్ష నేతలు 2లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారన్నారు. జిరాక్స్ సెంటర్లలో ప్రశ్నపత్రాలు ‘ విక్రయించి ఉద్యోగాలు భర్తీ చేసే వాళ్లం కాదని,. ప్రభుత్వ శాఖల్లో బంధువులను పెట్టుకొని ఉద్యోగాలు అమ్ముకునే వాళ్లం కాదన్నారు. త్వరలోనే పోలీసు శాఖలో 15 వేల ఉద్యోగ నియామకాలు చేపడతామని, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలంటే నిర్దిష్ట విధానం ఉంటుందన్నారు.
ఏ పాపం చూసినా హరీశ్‌రావే
ఏ పాపం చూసినా హరీష్ రావే కనబడుతున్నాడని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పాపాల భైరవుడుగా హరీష్ రావు మారారని విమర్శించారు. ఆర్థిక శాఖ చూసినా, ఇరిగేషన్ శాఖ చూసినా ఆయన చేసిన పాపాలు అన్నీ బయటపడుతున్నాయని చెప్పారు. ‘13న కాళేశ్వరం పోదాం. మేడిపండు లాగా ఉన్న మేడిగడ్డ చూపిద్దాం.. 13న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బస్సు పెడుతాం. కేసీఆర్ కూడా 12న చర్చలో పాల్గొనాలి. 13న ఆయన కాళేశ్వరానికి రావాలి’ అని రేవంత్‌రెడ్డి కోరారు.