Site icon vidhaatha

పట్టా భూములకు, అసైన్డ్ భూములకు భూసేకరణలో ఒకే ధర

కొడంగల్‌: పరిశ్రమలు, ప్రాజెక్టుల కోసం చేసే భూసేకరణలో పట్టా భూములకు,అసైన్డ్ భూములకు ఒకే ధర చెల్లించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. గురువారం మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో సీఎం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం తన నివాసంలో కాంగ్రెస్ కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. తన ప్రతి కష్టంలో కొడంగల్ ప్రజలు అండగా ఉన్నారని, ఇంత చేసిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. త్వరలో ఈ ప్రాంతానికి సిమెంటు పరిశ్రమలు రాబోతున్నాయని చెప్పారు. ఈ ప్రాంతంలో అపారమైన సున్నపు గనులు ఉన్నప్పటికీ, గత పాలకుల నిర్లక్ష్యంతో పరిశ్రమలు రాలేదని విమర్శించారు. పరిశ్రమలు ఏర్పాటు జరిగితే ఈ ప్రాంతంలో భూముల విలువలు పెరుగుతాయని, మన ప్రాంతానికి ఫార్మా కంపెనీలు వస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. భూసేకరణకు సహకరిస్తేనే పరిశ్రమల ఏర్పాటు సులభతరం అవుతుందని స్పష్టం చేశారు. అభివృద్ధికి సహకరించకపోతే ఈ ప్రాంతం నష్టపోతుందన్నారు.

తాను ఎక్కడున్నా ఓ కన్ను కొడంగల్‌పై ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుకుంటానని, మీకు మేలు జరగాలని..ఈ ప్రాంతంలో అభివృద్ధి పరుగులు తీయాలన్నదే నా ఆకాంక్ష అని తెలిపారు. నేను ఎంత పెద్ద నాయకుడినైనా కొడంగల్ కుటుంబ సభ్యుడినేనని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి 50 వేల మెజార్టీ అందించాలని పిలుపునిచ్చారు. మండల, బూత్, నియోజకవర్గ స్థాయిలో ఐదుగురు సభ్యుల చొప్పున సమన్వయ కమిటీ నియమించుకుని పని చేయాలని సూచించారు. మళ్లీ తాను ఏప్రిల్ 8న ఇక్కడకు వస్తానని, మండలాలవారీగా సమన్వయ కమిటీలతో సమావేశమవుతానని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పారు. ఈ నెల 6న సాయంత్రం 5గంటలకు తుక్కుగూడలో జరిగే సభకు నియోజకవర్గం నుంచి భారీగా ప్రజలు హాజరుకావాలని కోరారు.

Exit mobile version