Site icon vidhaatha

సచార్ కమిటీ స్ఫూర్తితో తెలంగాణ‌లో కులగణన



విధాత, హైదరాబాద్‌: గ‌తంలో కేంద్రంలోని యూపీఏ ప్ర‌భుత్వం ముస్లిం మైనార్టీల సంక్షేమానికి వేసిన సచార్ కమిటీ స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం కుల గణన చేప‌డుతుంద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో కుల‌గ‌ణ‌న‌కు ఉద్దేశించిన బిల్లును మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ శుక్ర‌వారం అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టారు. దీనిపై ముఖ్య‌మంత్రి చ‌ర్చ‌లో పాల్గొంటూ రాష్ట్రంలోని అన్ని వర్గాల వారి సమాచారాన్ని సేకరించి, వెనుకబడిన వర్గాల లెక్కలు.. వారి స్థితిగతుల వివరాలు సేకరించి, వారి ఆర్థిక‌, రాజకీయ, విద్య, ఉద్యోగప‌ర‌మైన అభివృద్ధికి త‌మ‌ ప్రభుత్వం సమగ్ర సర్వేకు సిద్ధమైంద‌ని చెప్పారు. ఇదొక చ‌రిత్రాత్మ‌క నిర్ణ‌య‌మ‌ని అన్నారు. త‌మ‌ నేత రాహుల్‌గాంధీ, త‌మ‌ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కుల గణన జరిపిస్తున్నామ‌ని చెప్పారు.


బీసీ కులగణన విషయంలో తమ ప్రభుత్వ‌ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదన్నారు. బలహీన వర్గాలను బలోపేతం చేయడమే ఉద్దేశమని స్ప‌ష్టం చేశారు. త‌మ‌ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బీసీ కులగణనపై మంత్రివర్గంలో తీర్మానం చేశామని, ప్ర‌తిప‌క్షాలు అడగకుండానే సభలో పెట్టామని చెప్పారు. స్వయంగా తామే ముందుకు వచ్చి కుల గణన చేస్తున్నామని తెలిపారు. పాలితులుగా ఉన్నవారిని పాలకులుగా తయారుచేయడమే త‌మ‌ ఉద్దేశమని రేవంత్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. జనాభాకు అనుగుణంగా నిధులు కేటాయించి, వాళ్ల ఆర్థిక ప్రయోజనాలను నిలబెట్టాలని భావిస్తున్నామని తెలిపారు.


స‌మ‌గ్ర కుటుంబ స‌ర్వేలా దాచి పెట్టం


గత ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసి, వివ‌రాల‌న్నింటినీ ఒక కుటుంబం వ‌ద్దే దాచుకున్నార‌ని రేవంత్ విమ‌ర్శించారు. ఎన్నికల సమయంలో వారికి అవసరమైన రీతిలో దానిని వాడుకున్నారని ఆరోపించారు. తాము అలా చేయదలుచుకోలేదని, కుల గణనతో పాటు సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే చేపట్టాలని నిర్ణయించామ‌ని తెలిపారు. ఈ తీర్మానాన్ని అర్థం చేసుకుని, మీకున్న అనుభవం మేరకు సూచ‌న‌లివ్వాల‌ని కోరారు. దీనిని అమలు చేసే క్రమంలో ఏదైనా న్యాయపరమైన, చట్ట ప్రకార చిక్కులొచ్చే అనుమానాలుంటే చెప్పాల‌ని కోరారు. సహేతుకమైన సూచనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని స్ప‌ష్టం చేశారు.


ఈ తీర్మానానికి చట్టబద్ధత లేదనడం సరికాదని రేవంత్‌రెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు సైతం బలహీనవర్గాలకు అండగా ఉండాలంటే ముందు వారి లెక్కలు తెలుసుకోవాలని చెప్పిందని ముఖ్య‌మంత్రి గుర్తు చేశారు. 1931 తర్వాత మ‌ళ్లీ కులగణను కేంద్రంలోని యూపీఏ 2 ప్రభుత్వం చేపట్టిందని చెప్పారు. ఆ నివేదికలను ఆ తర్వాత‌ వచ్చిన మోదీ ప్రభుత్వం తొక్కిపెట్టగా, రాష్ట్రంలో కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వేను ఇక్కడ దాచిపెట్టారని విమర్శించారు. ‘మేం కులగణన సర్వే రహస్యంగా ఏమీ చేయడం లేదు. ఈ తీర్మానంపై రాష్ట్ర జనాభాలో అరశాతం ఉన్నవాళ్లకు బాధ ఉండొచ్చు.


రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకున్నామని, లెక్కలు బయటకు వస్తే 50 శాతం జనాభా ఉన్నవాళ్లకు రాజ్యాధికారంలో ఎక్కడ భాగం ఇవ్వాల్సి వస్తుందోనన్న భావన ఉంటుందేమో’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. ఇప్పటికైనా ప్రధాన ప్రతిపక్ష నేత సభకు రావాలని విజ్ఞ‌ప్తి చేశారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి చిత్తశుద్ధిపై త‌మ‌కు ఎలాంటి అనుమానం లేద‌న్న రేవంత్‌రెడ్డి.. కానీ ఆయ‌న‌కు సహవాస దోషం అంటుకున్న‌ట్టు ఉన్న‌ద‌ని చుర‌క‌లు వేశారు. కొంతమంది ఆయ‌న‌ పక్కన కూర్చొని నకల్ చిట్టీలు అందిస్తున్నట్లుగా పదేపదే చిట్టీలు అందిస్తూ ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారని పరోక్షంగా హరీశ్‌రావు, కేటీఆర్‌లను విమర్శించారు.


బీసీల అభ్యున్న‌తే ల‌క్ష్యంగా కుల‌గ‌ణ‌న : మంత్రి పొన్నం


అంతకుముందు అసెంబ్లీలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కుల గణన తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ తమ ఎన్నికల ప్రణాళిక మేరకు బీసీ కులగణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. బీసీల అభ్యున్నతి లక్ష్యంగా కులగణన చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. ఈ తీర్మానానికి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆరెస్‌తోపాటు ఎంఐఎం, బీజేపీ, సీపీఐ సభ్యులు మద్దతు ప్రకటించారు. బీఆరెస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, గంగుల కమలాక‌ర్‌ మాట్లాడుతూ తీర్మానం స్పష్టంగా లేదని అన్నారు. బీసీ కులగణన మాత్రమే చేస్తారా లేక అన్ని కులాల లెక్కలు సేకరిస్తారా? జనగణన చేస్తారా? అన్నదానిపై స్పష్టత లేదని చెప్పారు. రాష్ట్రానికి జనాభా లెక్కల సేకరణ అధికారం లేనప్పుడు జన గణన ఎలా చేస్తారని ప్రశ్నించారు. దీనిపై డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క స్పందిస్తూ.. తీర్మానంలో సోషియో ఎక‌నామికల్‌, ఎడ్యుకేషన్‌, ఎంప్లాయిమెంట్‌, పోలిటకల్ అండ్ కాస్ట్ సర్వే (కులగణన) అని స్పష్టంగా ఉందని చ‌దివి వినిపించారు. ఇంకా ఇందులో స్ప‌ష్ట‌త క‌రువైంది ఏమిట‌ని నిల‌దీశారు. ఆయా వివరాల సేకరణ కోసం డోర్ టూ డోర్ సర్వే నిర్వహిస్తామ‌ని తెలిపారు.

చ‌ట్టం కాదు.. చిత్త‌శుద్ధి అవ‌స‌రం: పొన్నం

యూపీఏ 2ప్రభుత్వం 2011లో కులగణన చేపట్టిందని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గుర్తు చేశారు. ఆనాడు కేంద్రం చేసినా, ఇటీవల బీహార్, కర్ణాటక, ఏపీలు చేసినా ఎలాంటి చట్టం లేకుండానే కులగణన జరిగిందన్నారు. చట్టం కాదు…చిత్తశుద్ధి అవసరమని చెప్పారు. సమగ్ర కుటుంబ సర్వే వివ‌రాలు ఇప్పటికైనా బయటపెట్టాల్సివుందన్నారు. గత పదేళ్లలో అనేక కుల ఫెడరేషన్లు పెట్టారని, కానీ ఆత్మగౌరవ భవనాలకు, బీసీ బంధుకు నిధులివ్వలేద‌ని ఆరోపించారు. గ‌త ప్ర‌భుత్వం తొమ్మిదిన్నర సంవత్సరాలలో 23వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. ఎంబీసీలకు 1000కోట్లు ప్రకటిస్తే 1000 రూపాయలు కూడా ఖర్చు చేయలేద‌ని విమ‌ర్శించారు. 2011లో గ్రామీణాభివృద్ధి శాఖ కూడా కుల‌గ‌ణ‌న చేసింద‌ని అన్నారు. ఇప్పుడు త‌మ ప్ర‌భుత్వం ఇంటింటి సర్వే చేస్తుంద‌ని తెలిపారు. విధివిధానాల రూపకల్పనలో అందరి సలహాలు, సూచనలు స్వీకరించి సర్వే చేపడుతామన్నారు. బలహీన వర్గాల అభివృద్ధికి ఉద్ధేశించిన ఈ తీర్మానాన్ని రాజకీయాలకు అతీతంగా ఆమోదించాలని ప్రతిపక్షాలను కోరారు.


Exit mobile version