Site icon vidhaatha

తుక్కుగూడ నుంచే పార్లమెంటు ఎన్నికల జైత్రయాత్ర


విధాత, హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే రంగారెడ్డి జిల్లా నుంచే తుక్కుగూడ నుంచే దేశ రాజకీయాలకు, పార్లమెంటు ఎన్నికల జైత్రయాత్రకు శంఖారావం పూరించబోతున్నామని సీఎం, పీసీసీ చీఫ్ ఎ. రేవంత్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం జూబ్లీహిల్స్ కార్యాలయంలో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు.


తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో అసెంబ్లీ ఎన్నికలకు ఆరు గ్యారంటీలను ప్రకటించుకున్నామని, మళ్లీ అక్కడే ఏప్రిల్ 6 లేదా 7 న జాతీయస్థాయి గ్యారంటీలను ప్రకటించుకోబోతున్నామన్నారు. ఈ జనజాతర సభకు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే హాజరవుతారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాల్లో 14 పార్లమెంట్ స్థానాలు గెలవాలనే పట్టుదలతో ఉన్నామన్నారు.


తెలంగాణలో 14 పార్లమెంట్ స్థానాలు గెలిచి సోనియమ్మకు కృతజ్ఞత చెబుదామన్నారు. కార్యకర్తలకు అండగా నిలబడేందుకు, దేశాన్ని కాపాడుకునేందుకు రాహుల్ గాంధీ వేల కిలోమీటర్లు నడిచారని, పార్టీకి అండగా నిలబడి సోనియమ్మ నాయకత్వానికి బలపరచాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.


కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుందని, క్షేత్ర స్థాయిలో అందరి అభిప్రాయాలు, సర్వేల ఆధారంగానే పార్టీ అధిష్టానం అభ్యర్థులను ఎంపిక చేస్తోందని స్పష్టం చేశారు. చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజిగిరి నియోజకవర్గాలకు ఒకదానికొకటి సంబంధం ఉందని, అన్ని రకాలుగా ఆలోచించే చేవెళ్లలో రంజిత్ రెడ్డి, మల్కాజిగిరి సునీతా మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ దానం నాగేందర్ ని పార్టీ అభ్యర్థులుగా ప్రకటించిందని పేర్కోన్నారు.


పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు మన వంద రోజుల పరిపాలనకు రెఫరెండమని రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు. పదేళ్లు మోదీ ప్రధానిగా ఉన్న మోదీ తెలంగాణకు ఏం చేశారని ప్రశ్నించారు. ప్రాణహిత చేవెళ్ల పూర్తి చేయలేదని, వికారాబాద్ వరకు ఎంఎంటీఎస్ రైలు తీసుకురాలేదన్నారు. బుల్లెట్ ట్రైన్ గుజరాత్ కు తీసుకెళ్లిన మోదీ.. వికారాబాద్‌కు ఎంఎంటీఎస్ రైలు తీసుకురాలేదని విమర్శించారు.


గుజరాత్‌లో సబర్మతి రివర్ ఫ్రంట్ ను అభివృద్ధి చేసుకున్న మోదీ… మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి నిధులు ఇవ్వలేదన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు రాకుండా బీజేపీ ఎందుకు మోకాలడ్డుతోందని ప్రశ్నించారు. ఏం చూసి మూడోసారి మోదీకి ఓటు వేయాలని బీజేపీ నేతలు అడుగుతున్నారని, బీజేపీ నేతల వ్యవహారం పెళ్లి పెద్దను చూసి పిల్లనివ్వాలన్నట్లుందని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు.


తెలంగాణన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేందుకు పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు చక్కని అవకాశని, మన పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటేనే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, వికారాబాద్ డీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షులు నర్సింహారెడ్డి, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Exit mobile version