Site icon vidhaatha

CM Revanth Reddy | పూలేకు సీఎం రేవంత్‌రెడ్డి నివాళులు

revanth reddy

విధాత: మహాత్మా జ్యోతిరావ్ పూలే 198వ జయంతి సందర్భంగా సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ఘన నివాళులర్పించారు. పూలే చేసిన త్యాగాలను, సమాజానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఒక సామాన్యుడిగా మొదలై ఒక సామాజిక ఉద్యమ కెరటంగా ఎదిగిన ఫూలే జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు.

సామాజిక కార్యకర్తగా, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త పూలే భావి తరాలకు సైతం మార్గదర్శకుడని సీఎం గుర్తు చేసుకున్నారు. సమాజంలో వివక్షకు తావు లేదని, సమానత్వం ఉండాలని జీవితాంతం పోరాడిన మహనీయుడని ఫూలేకు సీఎం రేవంత్‌రెడ్డి ఘన నివాళులు అర్పించారు.

వెనుకబడిన వర్గాలు, దళిత జనోద్ధరణకు ఆయన ఎంచుకున్న బాట, అనుసరించిన మార్గం సమాజ శ్రేయస్సును కాంక్షించే వారందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందని కొనియాడారు. మహాత్మా జ్యోతిబా ఫూలే స్ఫూర్తితోనే రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపడుతుందన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజునే ప్రగతి భవన్ కు మహాత్మా జ్యోతిభా పూలే పేరు పెట్టి ప్రజా భవన్ గా మార్చిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

మహిళల సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు అయిదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకాలను ఇప్పటికే అమలు చేసిందని పేర్కోన్నారు. పూలే జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు.

Exit mobile version