Site icon vidhaatha

నాయిని స్టీల్ బ్రిడ్జి నిర్మాణ వ్యయం పెంపుపై క్విడ్ ప్రోకో


విధాత, హైదరాబాద్‌: నాయిని నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జి అంచనా వ్యయం పెంపు పై అనేక అనుమానాలున్నాయని, అంచనాల పెంపులో క్విడ్ ప్రోకో జరిగిందని దీనిపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని సీఎం రేవంత్‌రెడ్డికి గ్రేటర్‌ హైదరాబాద్ సెంట్రల్ సిటీ సీపీఎం కమిటీ సెక్రటరీ ఎం. శ్రీనివాస్ లేఖ రాశారు. ఇందిరా పార్క్ నుంచి జీఎస్టీ మెయిన్ రోడ్ మీదుగా ఫోర్ లైన్, రాంనగర్ నుంచి బాగ్ లింగంపల్లి వరకు త్రీ లైన్ నిర్మించాల్సిన రాయిని నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జి అంచనా వ్యయం 426 కోట్ల నుండి 565 కోట్లకు పెంచుతూ గత ఏడాది ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, వాటిని ఆమోదిస్తూ జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ తీర్మానం చేసిందని పేర్కోన్నారు.


స్టీల్ బ్రిడ్జి అంచనా వ్యయం 139కోట్లు పెరగడం అనేక అనుమానాలు కలిగిస్తుందన్నారు. ఒప్పందం ప్రకారం బ్రిడ్జి నిర్మాణ పనులు 2020 అక్టోబర్‌లో ప్రారంభమై 2022 అక్టోబర్ నాటికి 24 నెలల్లో పూర్తి కావాల్సి ఉండగా 2023 ఆగస్టులో 34 నెలలకు పూర్తయిందని చెప్పారు. బ్రిడ్జి నిర్మాణ పనులు ఆలస్యం కావడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, స్థానిక వ్యాపారులు నష్టపోయారని లేఖలో తెలిపారు.

ఆలస్యం కావడానికి కాంట్రాక్టు ఏజెన్సీ ఎంవిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్టు సంస్థ కారణమని, రేట్లు పెరగడంతో అంచనా వ్యయం పెరిగిందని చెప్పడం, ప్రభుత్వం భారీగా అంచనా పెంచడం వెనుక క్విడ్ ప్రోకో జరిగిందని అనుమానాలు కలుగుతున్నాయని, అందుకే దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలని కోరుతున్నామన్నారు.


అలాగే రాంనగర్ నుండి బాగ్‌లింగంపల్లి వరకు నిర్మించతలపెట్టిన ఫ్లైఓవర్ అవసరం లేదని, స్థానికంగా 60కి పైగా ఇండ్లు, కొన్ని పరిశ్రమలు, ఆస్తులు కోల్పోవాల్సివస్తుందని బాధితులు ఆందోళన చేయడంతో ఈ రెండో ఫ్లైవోవర్‌ పనులను నిలిపివేస్తూ 2021లో ప్రభుత్వం జీవో 2018 జారీ చేసిందని, ఈ జీవో జారీ చేసిన నాలుగు రోజులకే గత నిర్ణయానికి భిన్నంగా ఫ్లైవోవర్ పనులు వెంటనే చేపట్టాలని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి మెమో జారీ చేశారని లేఖలో పేర్కోన్నారు. ఉపయోగం లేని ఫ్లైవోవర్ నిర్మాణంతో 100 కోట్ల ప్రజాధనం వృధా కావడంతో పాటు మధ్యతరగతి ప్రజలు నివాసాలు కోల్పోవాల్సి వస్తుందని వెంటనే ఈ ఫ్లైవోవర్ నిర్మాణ ప్రతిపాదన రద్దు చేయాలని సీఎంను సీపీఎం లేఖలో కోరింది.

Exit mobile version