Site icon vidhaatha

రాజాసింగ్-కిష‌న్‌రెడ్డి మధ్య కోల్డ్ వార్!


హైద‌రాబాద్: లోక్‌స‌భ ఎన్నిక‌ల వేళ భార‌తీయ జ‌నతా పార్టీలో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. తెలంగాణ‌లో ఉన్న 17 ఎంపీ స్థానాల్లో ఎవ‌రు ఎక్క‌డ్నుంచి పోటీ చేస్తార‌నే విష‌యాల‌పై ఉత్కంఠ నెల‌కొంది. ఎంపీ సీట్ల కోసం ఎవ‌రికీ వారు అగ్ర నాయ‌క‌త్వం వ‌ద్ద పైర‌వీలు చేసుకుంటున్నారు. ప్ర‌ధానంగా హైద‌రాబాద్, సికింద్రాబాద్ ఎంపీ సీట్ల విష‌యంలో పార్టీ నాయ‌క‌త్వంలో తీవ్ర చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ రెండు స్థానాల్లో ఎవ‌ర్ని బ‌రిలో దించుతారోనని పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొన్నది. సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి కిష‌న్ రెడ్డి పార్ల‌మెంట్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే.


త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో కూడా మ‌ళ్లీ కిష‌న్ రెడ్డికే ఆ సీటు కేటాయిస్తార‌ని వార్త‌లు షికారు చేస్తున్నాయి. ఇక హైద‌రాబాద్ ఎంపీ స్థానంపై కూడా బీజేపీ గురిపెట్టింది. అక్క‌డ ఎంఐఎం నుంచి ఎంపీగా గెలిచిన అస‌దుద్దీన్ ఓవైసీని ఓడ‌గొట్ట‌డ‌మే ల‌క్ష్యంగా బీజేపీ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. అయితే రాజాసింగ్‌కు హైద‌రాబాద్ ఎంపీ టికెట్ కేటాయించాల‌ని పార్టీ హైక‌మాండ్ భావిస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో గోషామ‌హాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్య‌లు పార్టీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.


సికింద్రాబాద్‌పై రాజాసింగ్‌ పట్టు


త‌న‌కు హైద‌రాబాద్ ఎంపీ టికెట్ అవ‌స‌రం లేద‌ని, సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇస్తేనే పోటీ చేస్తాన‌ని రాజాసింగ్ పేర్కొన్నారు. హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీని ఢీకొట్టడానికి తనకంటే కిషన్ రెడ్డి బెటర్ అంటూ.. కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్య‌లు పార్టీలో చ‌ర్చ‌కు దారి తీశాయి. కిష‌న్ రెడ్డి, రాజాసింగ్ మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తోంద‌ని పార్టీవర్గాల్లో చర్చ నడుస్తున్నది. ఇలాంటి వ్యాఖ్య‌లు బ‌హిరంగంగా చేయొద్ద‌ని పార్టీ సీనియ‌ర్లు రాజానింగ్‌కు సూచించిన‌ట్లు స‌మాచారం.


కోల్డ్ వార్ ఎప్పటినుంచంటే..?


2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన సంగ‌తి తెలిసిందే. అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్ర‌మాణ‌స్వీకారం చేయించేందుకు ప్రొటెం స్పీక‌ర్‌గా అక్బ‌రుద్దీన్ ఓవైసీ నియమితులయ్యారు. ఓవైసీ స‌మ‌క్షంలో బీజేపీ ఎమ్మెల్యేలు ఎవ‌రూ ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌బోర‌ని రాజాసింగ్ బ‌హిరంగంగా ప్ర‌క‌టించారు. అయితే రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు కిష‌న్ రెడ్డి అనుమ‌తి లేకుండానే రాజాసింగ్ ప్ర‌క‌టించార‌ని, అప్పటి నుంచి ఇద్ద‌రి మ‌ధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయ‌ని తెలుస్తోంది.


పార్టీ నాయ‌క‌త్వాన్ని సంప్ర‌దించ‌కుండా ఎలాంటి ప్ర‌క‌ట‌న‌లు చేయొద్ద‌ని రాజాసింగ్‌ను కిష‌న్ రెడ్డి మంద‌లించార‌ని సమాచారం. కొత్త‌గా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు చార్మినార్ వ‌ద్ద ఉన్న భాగ్య‌ల‌క్ష్మి ఆల‌యంలో నిర్వ‌హించిన పూజా కార్య‌క్ర‌మాల‌కు కూడా రాజాసింగ్ దూరంగా ఉన్నారు.

దక్కని ఎల్పీ పదవి బీజేపీ శాసనసభాపక్ష నేతగా రాజాసింగ్‌కు అవ‌కాశం క‌ల్పిస్తార‌ని అంద‌రూ ఊహించారు. కానీ రాజాసింగ్‌కు ఆ ప‌ద‌వి ద‌క్క‌లేదు.


నిర్మ‌ల్ నుంచి బీజేపీ త‌ర‌ఫున ఎన్నికైన ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డికి ఆ ప‌ద‌వి ద‌క్కింది. ఈ ప‌రిణామం రాజాసింగ్‌ను మ‌రింత ఇబ్బందికి గురి చేసింద‌ని ఆయ‌న మ‌ద్ద‌తుదారులు పేర్కొన్నారు. అయితే లోక్‌స‌భ ఎన్నిక‌ల ముందు ఇలాంటి కామెంట్లు చేయ‌డం స‌రికాద‌ని రాజాసింగ్‌ను కొంద‌రు నాయ‌కులు ప‌రోక్షంగా హెచ్చ‌రించిన‌ట్లు తెలుస్తోంది. అంత‌ర్గ‌త విబేధాలు బ‌య‌ట‌ప‌డితే.. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి లాభం జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని సీనియ‌ర్లు వాపోయిన‌ట్లు స‌మాచారం.

Exit mobile version