Parade Ground |
- సోనియాగాంధీ సభకు కాంగ్రెస్
- తెలంగాణ విమోచన దిన వేడుకలకు బీజేపీ
- రక్షణ శాఖ నిర్ణయంపై ఉత్కంఠ
విధాత, హైద్రాబాద్ : బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ కోసం పోటాపోటీ పంచాయితీ నెలకొంది. ఈనెల 17న సోనియాగాంధీ బహిరంగ సభ నిర్వహణకు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రక్షణ శాఖకు అనుమతి కోరారు. ఇదే మైదానంలో గత ఏడాది తెలంగాణ విమోచన అధికారిక ఉత్సవాలు నిర్వహించిన బీజేపీ సైతం మరోసారి సెప్టెంబర్ 17న విమోచన వేడుకల నిర్వాహణ సభకు అనుమతి కోరింది.
దీంతో ఈ రెండు జాతీయ పార్టీల మధ్య పరేడ్ గ్రౌండ్ కోసం రచ్చ సాగుతుంది. మూడు రోజుల క్రితమే సోనియాగాంధీ సభ నిర్వాహణకు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రక్షణ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణ్‌కరావు థాక్రేతో కలిసి ఆయన మైదానాన్ని సందర్శించి సభా ఏర్పాట్లపై చర్చించారు.
కాంగ్రెస్ ఒకవైపు పరేడ్ గ్రౌండ్‌లో సభా నిర్వాహణ ఏర్పాట్లలో ఉండగానే, ఇంకోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తాము సెప్టెంబర్ 17న పరేడ్ మైదానంలో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తామని ప్రకటించారు. దీంతో పరేడ్ గ్రౌండ్ లో ఏ పార్టీ సభకు అనుమతి దక్కనుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
అయితే రక్షణ శాఖ కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది కావడం…పరేడ్ గ్రౌండ్‌లో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తుండటంతో రక్షణ శాఖ సహజంగానే బీజేపీకి వేడుకల నిర్వాహణకు అనుమతినిస్తుందని భావిస్తున్నారు. అప్పుడు దీనిపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.