Site icon vidhaatha

ఫోన్ ట్యాపింగ్‌పై కాంగ్రెస్‌, బీజేపీల సీరియస్‌


విధాత, హైదరాబాద్ : బీఆరెస్ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా చట్ట వ్యతిరేకంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కాంగ్రెస్‌, బీజేపీలు సీరియస్‌గా స్పందించాయి. ప్రతిపక్షాలను దెబ్బతీసేందుకు..ప్రైవేటు వ్యక్తుల, వ్యాపారులను బ్లాక్ మెయిల్ చేసేందుకు గత ప్రభుత్వం చేసిన ఫోన్ ట్యాపింగ్ దుర్మార్గమని ఇందుకు అప్పటి సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు లేక న్యాయ విచారణ జరిపి పూర్తి స్థాయిలో వాస్తవలు బయటకు రప్పించి బాధ్యులపై చట్టపర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ పార్టీ అధికారిక ఖాతా నుంచి మా కార్యాలయ సిబ్బంది బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసుకుని వస్తుంటే దారిలో అడ్డగించి బంధించారని, దీని వెనుక ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ హస్తం ఉందన్నారు. మా పార్టీ ఆఫీస్ సిబ్బంది, నాయకుల ఫోన్లను ట్యాప్ చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలని, అలా కాకుండా ఇష్టమొచ్చినట్లు ట్యాపింగ్ జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ఎలాంటి చట్టపరమైన అనుమతులు లేకుండా ప్రైవేటుగా విదేశాల నుంచి పరికరాలను కొనుగోలు చేసి మరి ఫోన్ ట్యాపింగ్ నిర్వహించడం వెనుక అసలు లక్ష్యాలను మొత్తం బయటపెట్టాల్సిన అవసరం ఉందన్నారు.


సీబీఐ విచారణ జరిపించాలి : రఘునందన్ రావు


ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే, మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాంపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ కేసులో నేను బాధితుడినేనన్నారు. ట్యాపింగ్ కేసులో మొదటి ముద్దాయిగా కేసీఆర్‌ను, రెండో ముద్దాయిగా హరీష్ రావును, మూడో ముద్దాయిగా సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. అసలు నిందితులను ముద్దాయిలుగా చేర్చకపోతే కేసు సంపూర్ణం కాదన్నారు. ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలన్నారు. కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాపింగ్ చేసే అధికారం ఎవరికీ లేదని చెప్పారు.


గతంలో రేవంత్ రెడ్డిని ఫోన్ ట్యాపింగ్ ద్వారానే అరెస్ట్ చేశారని గుర్తుచేశారు. 2014 నుంచే ఈ ట్యాపింగ్‌లు నడుస్తున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కారణంగానే మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటమి పాలయ్యారని కీలక వ్యాఖ్యలు చేశారు. డీజీపీ పీఏ అధికారిక ఖర్చులతో అమెరికా ఎలా వెళ్లారో విచారించాలన్నారు. పోన్ ట్యాపింగ్ పరికరాలు ఎవరు, ఎప్పుడు, ఎలా కొన్నారో నిగ్గు తేల్చాలని, ఇద్దరు ఏఎస్పీలకు అరెస్టు చేసి చేతులు దులుపుకోవాలనుకోవడం సరికాదన్నారు. చట్ట వ్యతిరేకంగా కేంద్ర టెలికామ్ నిబంధనలకు విరుద్ధంగా సాగిన ట్యాపింగ్‌పై సమగ్ర విచారణ జరిపించాలన్నారు.


డీజీపీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం


చట్టపరమైన అనుమతులు లేకుండా బీఆరెస్ ప్రభుత్వం సాగించిన ఫోన్ ట్యాపింగ్‌కు నేను కూడా బాధితుడినేనని, మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి ట్యాపింగ్ పై కొన్ని ఆధారాలు నా వద్ధ ఉన్నాయని, వాటిపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా యెన్నం మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వందలాది మంది ప్రతిపక్ష నాయకుల, అధికారుల, వ్యాపారుల, జర్నలిస్టుల ఫోన్లను ట్యాపింగ్ చేశారని, బాధితుడిగా తాను డీజీపీకి మొదటి ఫిర్యాదు చేశానని తెలిపారు.


భారత ప్రభుత్వం అనుమతి లేకుండా ఇజ్రాయిల్, రష్యాల నుంచి పరికరాలను అక్రమంగా దిగుమతి చేసి ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. భారత టెలి కమ్యూనికేషన్ బిల్లుకు వ్యతిరేకంగా, ఎలాంటి చట్టపరఅనుమతులు లేకుండా తమకు ఇష్టమొచ్చిన వ్యక్తుల ఫోన్ నంబర్లను ట్యాపింగ్ చేశారని తెలిపారు. గత ముఖ్యమంత్రి నుంచి అప్పటి మంత్రులు, అధికారులు, నియోజకవర్గాల ఎమ్మెల్యేల వరకు ట్యాపింగ్‌లో బాధ్యులుగా ఉన్నారని ఆరోపించారు. సమగ్ర విచారణ జరిపి ఫోన్ ట్యాపింగ్‌లో నిజాలను నిగ్గు తేల్చి ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపైన, ప్రభుత్వంపైన ఉందన్నారు.

Exit mobile version