Congress | కాంగ్రెస్‌ నిర్ణయమే కాషాయపార్టీకి సవాల్‌

ఎన్నికల్లో పోటీ చేసే వారికి ముఖ్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులకు ప్రజల నాడీ అర్థమౌతుంది. రెండు మూడు నెలలు వాళ్లు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నప్పుడు ప్రజల నుంచి వస్తున్న స్పందన, వాళ్లు ఏకరువు పెట్టే సమస్యలు, వారి ప్రాధాన్యాలు ఏమిటి అన్నది నేతలకు అవగతమౌతాయి

  • Publish Date - April 18, 2024 / 10:47 AM IST

వ్యూహం మార్చిన కాంగ్రెస్‌ పార్టీ
భావసారూప్య పార్టీలతో పొత్తు
భాగస్వామ్య పక్షాల బలానికి విలువ
326 స్థానాల్లోనే కాంగ్రెస్‌ అభ్యర్థులు
అక్కడ బీజేపీకి తానే ఏకైక ప్రత్యర్థి
217 సీట్లు ఇండియా కూటమి పక్షాలకు
వీటిలో విపక్షాల ఐక్యత బీజేపీకి సవాలే!
ఈశాన్యంలో బీజేపీ వ్యతిరేక పవనాలు
యూపీ, మహారాష్ట్ర, బీహార్‌,
తమిళనాడులో కూటమికి ప్రాంతీయ బలం
కర్ణాటక, తెలంగాణలో బలంగా కాంగ్రెస్‌
మెజార్టీ సాధనకే కాషాయ పార్టీ కష్టాలు!

గత ఎన్నికల్లో 417 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్.. ఈసారి 326 స్థానాలకే ఎందుకు పరిమితమైంది? ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలకు అధిక అవకాశాలు ఎందుకు ఇచ్చింది? కొన్ని చోట్ల పోటీకి దూరంగా ఉండటం వెనుక కాంగ్రెస్‌ వ్యూహం ఏమిటి? ఈ వ్యూహానికి బీజేపీ ఎందుకు కలవర పడుతున్నది? బీజేపీకి 370 సీట్లు వస్తాయని ధీమాగా చెబుతున్నా.. భాగస్వామ్య పక్షాలకు కలిపి 400 దాటి పోతాయని ఊదరగొడుతున్నా.. ఎందుకు ప్రతి చిన్న పార్టీని కలుపుకొనేందుకు బీజేపీ ఆరాటపడుతున్నది? కాంగ్రెస్‌ వ్యూహాలు ఫలిస్తాయా? ఆ పార్టీ ఎత్తుగడలు బీజేపీని చిత్తు చేస్తాయా?

(విధాత ప్రత్యేకం)

ఎన్నికల్లో పోటీ చేసేవారికి, ముఖ్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులకు ప్రజల నాడి చాలా స్పష్టంగానే అర్థమవుతుంది. రెండు మూడు నెలలు వాళ్లు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నప్పుడు ప్రజల నుంచి వస్తున్న స్పందన, వాళ్లు ఏకరువు పెట్టే సమస్యలు, వారి ప్రాధాన్యాలు ఏమిటి అన్నది నేతలకు అవగతమౌతాయి. అందుకే 2004లో భారత్‌ వెలిగిపోతుందని బీజేపీ చేసిన ప్రచారం పనిచేయలేదు.

2004 నుంచి 2014 వరకు దేశంలో సమాచారహక్కు చట్టంతో పాలనలో పారదర్శకత కోసం కృషి చేసినా, ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉపాధి కల్పించి అదనపు ఆదాయాన్ని సమకూర్చినా, ఆహారభద్రత చట్టం వంటి తీసుకొచ్చి అన్నార్తుల కడుపు నింపినా కుంభకోణాలు, భాగస్వామ్య పార్టీల్లో విభేదాల వంటివి యూపీఏ ప్రభుత్వం ఓడిపోయి.. బీజేపీ సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వచ్చేందుకు కారణమయ్యాయి.

ఇప్పుడు సరిగ్గా పదేళ్ల తర్వాత.. బీజేపీ పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. వాళ్లకు ఇచ్చిన హామీలు అమలు కాలేదు. ఫలితంగా నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ రేట్లు, రైతులు తాము పండించిన పంటలకు మద్దతు ధరల వంటివి ఎన్నికల్లో మళ్లీ ప్రధానం కాబోతున్నాయి. బీజేపీ 80వ దశకం నుంచి ప్రచారం చేస్తూ వస్తున్న హిందూత్వ భావోద్వేగాల ప్రచారం.. ఇప్పుడు పనిచేసే పరిస్థితి కనిపించడం లేదు. ఈ పూర్వరంగంలో ఇండియా కూటమి, ఎన్డీయే కూటమి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి.

కాంగ్రెస్‌ నిర్ణయంతో కషాయపార్టీలో కలవరం

ప్రజల ఆలోచన విధానాలకు అనుగుణంగా ఈసారి కాంగ్రెస్‌ పార్టీ తన వ్యూహాన్ని మార్చింది. ఎన్డీఏను ఎదుర్కోవాలంటే తన శక్తి ఒక్కటే సరిపోదని భావసారూప్యత కలిగిన పార్టీలతో పొత్తు పెట్టుకున్నది. కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ మద్దతు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. ఆ పార్టీకి ప్రాంతీయ పార్టీల మద్దతు ఎంత అవసరమో, ప్రాంతీయపార్టీలకు కాంగ్రెస్‌ పార్టీ మద్దతు అంతే అవసరం. బీజేపీని నిలువరించి కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్‌ పార్టీ తీసుకునే రాజకీయ నిర్ణయాలే కీలకమని కూటమిలోని భాగస్వామ్యపార్టీల నేతలంతా అన్నారు.

దానికి అనుగుణంగానే కాంగ్రెస్‌ పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా 326 స్థానాల్లోనే పోటీ చేస్తున్నది. 2004లో ఆ పార్టీ 417 స్థానాల్లో పోటీ చేసింది. ఇదే అత్యల్పం. ఇప్పుడు మరో 91 స్థానాలను తగ్గించుకుని 326 స్థానాలకే పరిమితమైంది. మొత్తం 543 స్థానాల్లో 217 సీట్లను ఇండియా కూటమిలోని పార్టీలకు మద్దతు పలికింది. కొన్నిచోట్ల స్థానిక పరిస్థితుల ఆధారంగా పోటీ దూరంగా ఉండటం వంటి వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకున్నది. కాంగ్రెస్‌ అనుసరిస్తున్న వ్యూహం సరైనదే అన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతున్నది. దీనివల్ల బీజేపీ 326 స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీని నేరుగా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

మిగిలిన చోట్ల ఇండియా కూటమి పార్టీలతో పోటీ పడాలి. కాంగ్రెస్‌ తీసుకున్న నిర్ణయం కాషాయ పార్టీలో కలవరానికి గురి చేస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే బీజేపీ అబ్‌కీ బార్‌ చార్‌ సౌ అని ప్రచారం చేస్తున్నా.. అది అంత ఈజీ కాదు కదా అధికారానికి అవసరమైన మెజారిటీ రావడం కష్టమే అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్‌ కిశోర్‌ వంటి ఎన్నికల వ్యూహకర్తలు ఎన్డీఏ ఈసారి 300 పైగా సీట్లు సాధిస్తుందని చెబుతున్నా.. గత ఎన్నికల్లోనే 303 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి చాలా చోట్ల చిన్నచిన్నపార్టీలతో పొత్తు ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుందనే ప్రశ్న తలెత్తుతున్నది.

ఆ 95 చోట్ల బీజేపీ ఆధిక్యం కష్టమే

బీజేపీ 370 సీట్లు గెలుచుకోవాలంటే ఈశాన్య రాష్ట్రాల్లోనూ అధిక సీట్లు గెలుచుకోవాలి. ఈశాన్య రాష్ట్రాల్లో మొత్తం 25 సీట్లలో అస్సాం, త్రిపుర వంటి నాలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పటికీ మణిపూర్‌ కుకి, మైతేయి వర్గాల మధ్య రిజర్వేషన్ల గొడవ, కేంద్రం పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అంశం ఈసారి బీజేపీ సీట్లకు గండి కొట్టనున్నాయని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో ఈశాన్య రాష్ట్రాల్లో శాంతిభద్రతల సమస్యలతో పాటు, సంక్షోభం నెలకొన్నది. దీనిపై కేంద్రం స్పందించలేదు. సమస్య పరిష్కారం కోసం చొరవ చూపలేదు. దీంతో అక్కడి ప్రాంతీయపార్టీలు బీజేపీ దూరంగా ఉన్నాయని అంటున్నారు.

ఈ నేపథ్యంలో రాహుల్‌గాంధీ సహా ఏఐసీసీ నేతలు ఆ ప్రాంతాల్లో పర్యటించి, అక్కడి ప్రజలకు భరోసా ఇచ్చారు. ఇవిగాక కాంగ్రెస్‌ పార్టీ పూర్తిస్థాయిలో పోటీ చేస్తున్న రాష్ట్రాల్లో తాను అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్‌లో పాటు పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరాఖండ్‌, గోవా ఉన్నాయి. వీటితో పాటు ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్‌ప్రదేశ్‌, మణిపూర్‌, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్‌, సిక్కిం, మరో 6 కేంద్ర పాలిత ప్రాంతాలున్నాయి. ఈ మొత్తం సీట్లన్నీ సుమారు 95 వరకు ఉంటాయి. ఈ స్థానాల్లో కాంగ్రెస్‌ను ఎదుర్కొని బీజేపీ ఆధిక్యం సాధించగలదా? అన్న ప్రశ్న తలెత్తుతున్నది.

మిత్రపక్షాలతో కలిసి పోటీ చేసే రాష్ట్రాల్లో పైచేయి

కాంగ్రెస్‌ పార్టీ మిత్రపక్షాలతో కలిసి పోటీ చేస్తున్న యూపీ, మహారాష్ట్ర, బీహార్‌, తమిళనాడులలో (80+48+40+39) మొత్తం 207 స్థానాలున్నాయి. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ 52 స్థానాల్లోనే పోటీ చేస్తున్నది. అదే సమయంలో ఈ రాష్ట్రాలో బీజేపీ యూపీ మినహా మిగిలిన రాష్ట్రాల్లో ఇతర ప్రాంతీయపార్టీలతోనే కలిసి పోటీ చేస్తున్నది. ఎందుకంటే అక్కడ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. ముఖ్యంగా యూపీలో ఈసారి బీజేపీకి ఎస్పీ, కాంగ్రెస్‌ కూటమి నుంచి గట్టి పోటీ ఎదురుకానున్నది. మహారాష్ట్రలో ఇండియా కూటమిలో (శివసేన (యూబీటీ), ఎన్సీపీ (శరద్‌పవార్‌), కాంగ్రెస్‌) సీట్ల సర్దుబాటు కాషాయ పార్టీకి మింగుడు పడని అంశం. అక్కడ ఏక్‌నాథ్‌ శిండే, అజిత్‌ పవార్‌లతో పాటు, రాజ్‌ఠాక్రే పార్టీతో పొత్తు కుదుర్చుకున్నది. అయినా అక్కడ మెజారిటీ సీట్లు దక్కించుకుంటామన్న విశ్వాసం కమలనాథుల్లో లేదు.

మోదీ వేవ్‌ లేదంటున్న బీజేపీ నేతలు

తాజాగా మోదీ వేవ్ లేదని మహారాష్ట్రలోని అమరావతిలో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న నవనీత్ రాణా వ్యాఖ్యానించినట్టు వీడియో ఒకటి వైరల్‌ మారింది. ‘పంచాయతీ ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లో పోరాడాలి. మధ్యాహ్నం 12 గంటల కల్లా ఓటర్లను బూత్‌కు తీసుకుని రావాలి. మోదీ వేవ్ ఉందనే భ్రమలో ఉండకండి. 2019లోనూ మోదీ వేవ్ ఉన్నది. కానీ నేను స్వతంత్ర అభ్యర్థిగా గెలిచాను’ అని తన నియోజకవర్గం ప్రచారంలో ఆమె వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. వీటిపై ప్రత్యర్థి పార్టీలు శివసేన (యూబీటీ), ఎన్సీపీ (శరద్ పవార్) సెటైర్లు వేస్తున్నాయి.

2019లో ఆమె ఎన్సీపీ మద్దతుతో విజయం సాధించిన విషయం విదితమే. నవనీత్ తాజా వ్యాఖ్యలపై స్పందించిన శివసేన (యూబీటీ) సీనియర్ నేత సంజయ్ రౌత్ ‘బీజేపీ నేతలు బహిరంగంగా నిజాలు చెబుతున్నారు’ అన్నారు. దీన్నిబట్టి మహారాష్ట్రలో ఫలితాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు. బీహార్‌లో జేడీయూ, ఎల్జేపీతో కలిసి పోటీ చేస్తున్నది. అక్కడ కూడా నితీశ్‌కుమార్‌ చీటికిమాటికి కూటములను మార్చడం బీజేపీకి మైనస్‌గా తయారైంది. అందుకే అక్కడ ఆయనను ముందుపెట్టడం లేదు. అలాగే తమిళనాడులో పీఎంకే వంటి పార్టీలతో పాటు పన్నీర్‌ సెల్వం లాంటి వారికి మద్దతు ఇస్తూ నాలుగు సీట్లైనా దక్కించుకోవాలని బీజేపీ యత్నిస్తున్నది.

మూడోసారి అధికారం కోసమే ఆరాటం

కాంగ్రెస్‌ పార్టీ పూర్తిస్థాయిలో పోటీ చేస్తున్న 95 స్థానాలతోపాటు ఇండియా కూటమిలోని కీలక భాగసామ్య పార్టీలతో కలిసి పోటీ చేస్తున్న పెద్ద రాష్ట్రాల్లోని 207 స్థానాలతో కలిపి 300పైగా సీట్లలో బీజేపీకి పెద్ద సవాల్‌ ఎదురుకానున్నది. వీటన్నింటికి తోడు సోషల్‌ మీడియాలో కాంగ్రెస్‌, బీజేపీ మ్యానిఫెస్టోలపై జాతీయ స్థాయిలో వివిధ మీడియా సంస్థలు ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటున్నాయి. యూత్‌ అంతా తమవైపే ఉంటారని భావిస్తున్న బీజేపీకి వాళ్లే ప్రశ్నలు సంధిస్తున్నారు. కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో 6 ఏళ్ల నుంచి మొదలు 90 వృద్ధుల వరకు భరోసా ఇచ్చే అంశాలున్నాయి.

కానీ బీజేపీ మ్యానిఫెస్టోలో కొత్త అంశాలు లేకపోగా పదేళ్లుగా ఇచ్చిన హామీలకే దిక్కులేదు. ఇక మోదీ గ్యారెంటీ అంటూ ఆ పార్టీ విడుదల చేసిన 2024 సంకల్ప పత్రంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. బీజేపీ పదేళ్ల కాలంలో పాలనపై దృష్టి సారించకుండా కాంగ్రెస్‌ పార్టీని పూర్తిగా బలహీనపరిచి, ప్రాంతీయపార్టీలను చీల్చి ఒకే పార్టీ.. ఒకే ఎన్నిక విధానాన్ని అమలు చేయడానికి చేసిన అన్ని ప్రయత్నాలు బెడిసికొట్టాయి. అవే ఇప్పుడు బీజేపీకి ప్రతిబంధకంగా మారనున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మళ్లీ మోదీ అధికారంలోకి వస్తే దేశంలో అనేక సంక్షోభాలు తలెత్తుతాయనే అభిప్రాయం ప్రజల్లో ఉన్నది. ఆ పార్టీ వాట్సప్‌ యూనివర్సిటీ ద్వారా ప్రచారం చేస్తున్నా.. అనుకూల పరిస్థితులు లేవు. బీజేపీకి గెలుస్తామన్న నమ్మకం లేకనే లక్షకు పైగా మెజారిటీతో గెలిచిన సిట్టింగ్‌ ఎంపీలను సైతం మార్చిందని, ఇదంతా మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి చేసిన ప్రయత్నమే తప్ప దానితో ప్రయోజనం ఉండకపోవచ్చు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మోదీ వేవ్‌ సమయంలోనే ఆ పార్టీ అనేక రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయింది.

ఈ పదేళ్ల కాలంలో ఆయన చరిష్మా మరింత తగ్గిపోయింది. అందుకే 400 సీట్లతో మరోసారి అధికారంలోకి వస్తామని ఆ పార్టీ నేతలు చెప్పటం మేకపోతు గాంభీర్యమేనని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ముందు 200 సీట్లు గెలిచి చూపించండి అని బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ బీజేపీకి సవాల్‌ చేసినట్టు అదే నిజమైనా ఆశ్చర్యపోనక్కర లేదంటున్నారు. మొత్తంగా దూరదృష్టితో కాంగ్రెస్‌ తీసుకున్న నిర్ణయం.. కాషాయ పార్టీకి పెను సవాలుగా పరిణమిస్తుందని చెబుతున్నారు.

Latest News