దసరా రోజు భార్య.. దీపావళికి భర్త లోకాన్ని వీడారు

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమించి పెద్దలను ఒప్పించి ఒక్కటైన జంట 19 రోజుల వ్యవధిలోనే ఒకరి తర్వాత ఒకరు మరణించడం స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి

విధాత: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమించి పెద్దలను ఒప్పించి ఒక్కటైన జంట 19 రోజుల వ్యవధిలోనే ఒకరి తర్వాత ఒకరు మరణించడం స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి. గ్రామస్థుల కథనం ప్రకారం ఎర్దండికి చెందిన అల్లెపు సంతోష్ (25), తన ఇంటి వద్దే ఉండే గంగోత్రి నాలుగేళ్లుగా ప్రేమించుకుని సెప్టెంబర్ 26న పెళ్లి చేసుకున్నారు. దసరా పండగ రోజు భార్యతో కలిసి అత్తారింటికి వెళ్లిన సంతోష్ మాంసం కూరలో కారం ఎక్కువైందని భార్యను మందలించాడు.

దీంతో మనస్తాపానికి గురైన గంగోత్రి అదే రోజు రాత్రి అత్తింట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో మనోవేదనకు గురైన సంతోష్ వారం రోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉండే అక్క వద్దకు వెళ్లాడు. అక్కడే మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని తనువు చాలించాడు. పెళ్లి చేసుకుని నెల రోజులు కూడా గడవక ముందే యువ దంపతులు మరణించడంతో ఇరువురి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.