విధాత : ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దాడితో పశ్చిమాసియా దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ద పరిస్థితులు ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లు, చమురు, గ్యాస్ ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. యుద్దంతో ప్రపంచ దేశాలలో చమురు, గ్యాస్, బంగారం వంటి వాటి ధరలు పెరిగిపోతుండగా..అందుకు భిన్నంగా కోడిగుడ్ల రేట్లు మాత్రం సగానికి పైగా కిందకు దిగి వచ్చాయి.
ఎగుమతుల అంతరాయంతో దిగొచ్చిన కోడిగుడ్డు ధరలు
ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం నేపథ్యంలో భారత్ నుంచి కోడి గుడ్ల ఎగుమతికి తీవ్ర అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో దేశీయంగా గుడ్ల నిల్వలు పెరిగిపోతున్నాయి. దీంతో కోడిగుడ్ల రేటు సగానికి పైగా తగ్గిస్తున్నట్లు ఎన్ఈసీసీ(NECC) ప్రకటించింది. హోల్ సేల్ మార్కెట్ లో గుడ్డు రేటు కేవలం 3 రూపాయల 50 పైసలుగా నిర్ణయించినట్లు NECC ఒక ప్రకటనలో తెలిపింది. యుద్దానికి ముందు స్థానిక మార్కెట్లలో కోడిగుడ్డు ఒకటి రూ.5 నుంచి రూ.5.50కి, కిరాణా దుకాణాల్లో రూ.6 వరకు అమ్మారు. ఇప్పుడు సగానికి ధర పడిపోవడం గమనార్హం.
రైతాంగానికి భారీ దెబ్బ
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఏపీలో అరటి రైతులు, దానిమ్మ రైతులు, చీని రైతులు, పౌల్ట్రీ రైతులు ఆందోళనలో ఉన్నారు. యుద్ద ప్రభావంతో ఎయిర్ పోర్టులు మూసివేయడంతో గల్ఫ్ దేశాలకు ఎగుమతులు ఆగిపోయి..దేశీయంగా నిల్వలు పెరిగి అరటి ధరలు, కోడిగుడ్ల ధరలు దారుణంగా పడిపోతున్నాయి. చెన్నై పోర్ట్ నుంచి గల్ఫ్ దేశాలకు గుడ్ల ఎగుమతి చేస్తారు. రోజుకు ఏకంగా 70 లక్షలు ఎగుమతి అవుతాయి. రాయలసీమ జిల్లాల నుంచి అరటి, చీని కూడా గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతాయి. ఏపీ నుంచి గల్ఫ్ దేశాలకు అరటి ఎక్కువగా వెళుతుంది. యుద్దంతో ఎగుమతులలో నెలకొన్న ఆటకంతో కోడిగుడ్డు ధర రూ.3.50 చొప్పున కొనేందుకు కూడా ముందుకు రావడం లేదు. కిలో అరటి రూ.25 నుంచి రూ.10కి పడిపోయింది
పెరిగిన వంట గ్యాస్ ధరలు
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ద పరిస్థితుల నేపథ్యంలో నెలకొన్న చమురు, గ్యాస్ సరఫరా సమస్య కారణంగా దేశంలో వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. గృహవినియోగ ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.60, కమర్షియల్ సిలిండర్‌పై రూ.115 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో హైదరాబాద్‌లో సిలిండర్ ధర రూ.965కి చేరింది. అయితే ఉజ్వల్ పథకం ద్వారా అందించే సిలిండర్ ధరల్లో మార్పు లేదని చమురు సంస్థలు వెల్లడించాయి.
ఇవి కూడా చదవండి :
Woman kills Puppies In Tamil Nadu | అమానుషం..కుక్క పిల్లలను గోడకు కోట్టి చంపిన మహిళ
Colored Cotton Crops | కలర్ కాటన్ క్రాప్స్ !..ఇక రంగుల పత్తి రంగప్రవేశం!!
