Site icon vidhaatha

MLC Kavitha ధర్నా: సోనియాను పొగిడినా.. పట్టించుకోని కాంగ్రెస్‌

విధాత: మహిళా రిజర్వేషన్ల (Women reservation Bill)కోసం బీఆర్‌ఎస్‌ (BRS)నాయకురాలు, భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌వద్ద నిర్వహించిన ధర్నా(Kavitha Dharna)కు కాంగ్రెస్‌ పార్టీ దూరంగా ఉంది. మద్యం కుంభకోణంలో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ల బిల్లు అంశంపై ధర్నా చేపట్టంలో రాజకీయ లబ్ధి పొందే అంశం కూడా ఉన్నదని భావించిన కాంగ్రెస్‌.. ఈ ధర్నాకు దూరం పాటించినట్లు అర్థం అవుతున్నది.

సోనియాను పొగిడినా..

దీక్షకు ఒక్క రోజు ముందుగా కవిత ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ సంకీర్ణ ప్రభుత్వంలోనూ 2010లో రాజ్యసభలో మహిళా బిల్లు పెట్టడంలో సోనియాగాంధీ (Sonia Gandhi) కీలక పాత్ర పోషించారని, ఆమె ధైర్యానికి దేశ మహిళల తరపున సెల్యూట్‌ చేస్తున్నానని చెప్పారు. రాజ్యసభలో (Rajyasabha) బిల్లు ఆమోదం పొందినా, దురదృష్టవశాత్తు లోక్‌సభ (Loksabha)లో ఆమోదం పొందలేదన్నారు. మహిళా బిల్లును 2010లోనే తీసుకువచ్చిన సోనియా గాంధీకి సెల్యూట్‌ చేశారు.

అయితే.. ధర్నా నేపథ్యంలో ఆమె సోనియాగాంధీని కలువలేదు. అందుకు వివరణ ఇచ్చిన కవిత.. ఆమె చాలా పెద్ద నాయకురాలని, తాను చాలా చిన్న నాయకురాలినని వ్యాఖ్యానించారు. పార్టీ తరపున ప్రతినిధిని పంపించాలని ఏఐసీసీ (AICC) అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (Mallikarjun Kharge), ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ (KC Venugopal)కు విజ్ఞప్తి చేసినట్లు కవిత తెలిపారు. అయితే రాజకీయ పరిస్థితులను బేరీజు వేసుకున్న కాంగ్రెస్‌.. కావాలనే కవిత ధర్నాకు దూరం పాటించినట్లు తెలుస్తోంది.

కేసీఆర్‌ వ్యవహరించిన తీరుపైనే..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్‌ వ్యవహరించిన తీరుపైకాంగ్రెస్‌ పార్టీ గుర్రుగా ఉన్నది. 2014లో తెలంగాణ రాష్ర్ట బిల్లు (Andhra Pradesh Reorganisation Bill) ఆమోదం పొందే వరకు కాంగ్రెస్‌ పార్టీతో దోస్తానా చేసిన కేసీఆర్‌ (KCR) ఒక దశలో కాంగ్రెస్‌లో విలీనంపై సంకేతాలు కూడా పంపారు. కానీ.. తదనంతర పరిణామాల్లో స్వతంత్ర రాజకీయ పార్టీగానే అప్పటి టీఆర్‌ఎస్‌ను ఉంచాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో బలంగా ఉన్న తమ పార్టీని దెబ్బతీసే ప్రయత్నాలు చేశారని కాంగ్రెస్‌ తీవ్ర ఆగ్రహంతో ఉన్నది.

పైగా 2018 ఎన్నికల తరువాత కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలకు గులాబీ తీర్థం ఇవ్వడంత ఆ ఆగ్రహం మరింత పెరిగింది. అప్పటి నుంచి రెండు పార్టీల మధ్య రాజకీయ దూరం పెరిగిపోయింది. మరోవైపు కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రత్యామ్యాయం తానేనంటూ బీఆర్‌ఎస్‌ (BRS)ను జాతీయ స్థాయిలో తీసుకొచ్చారు. కూటమి ఏర్పాటు కోసం వివిధ రాష్ట్రాల్లో పర్యటించి, ముఖ్యమంత్రులు, ముఖ్య నేతలను కలిశారు. కాంగ్రెస్‌ రహిత కూటమి అనేది కాంగ్రెస్‌ వర్గాల్లో ఆగ్రహాన్ని రాజేసింది.

కాంగ్రెస్‌, బీజేపీపైనే బీఆర్‌ఎస్‌ పోరు

దేశాన్ని పాలించడంలో కాంగ్రెస్‌, బీజేపీ విఫలమయ్యాయని, అందుకే జాతీయ స్థాయిలో బీఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేశానని కేసీఆర్‌ (KCR)చెబుతున్నా.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఓటు బ్యాంకును చీల్చి పరోక్షంగా బీజేపీ (BJP) తిరిగి అధికారంలోకి వచ్చేందుకే బీఆర్‌ఎస్‌ ప్రయత్నాలు ఉంటాయని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు కూడా.

రాష్ట్రంలో ప్రత్యర్థి పాత్రలో కాంగ్రెస్‌

తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్‌ పోరాటం చేస్తున్నది. రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితి ఉన్నది. రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో కాంగ్రెస్‌ పని చేస్తున్నది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదని కాంగ్రెస్‌ పార్టీ స్పష్టం చేసింది.

పైగా ధరణి (Dharani) లాంటి సమస్యతో ప్రజలను తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నదని ఆరోపించిన కాంగ్రెస్‌.. తాము అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తామని ప్రకటింది. ఇలా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ పోరాడుతున్నది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలోనే కవిత ధర్నాకు కాంగ్రెస్‌ దూరంగా ఉన్నదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Exit mobile version