Site icon vidhaatha

కేటీఆర్ ఓ స్పైడర్‌.. జోకర్‌..డ్రామా ఆర్టిస్టు


విధాత : సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన విమర్శలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు. హైదరాబాద్‌లో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, తుంగతుర్తి ఎమ్మెల్యే ముందుల సామేల్‌, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డిలు మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు.


కేటీఆర్ ఒక స్పైడర్‌, జోకర్‌, డ్రామా ఆర్టిస్టు అని వేముల వీరేశం విమర్శించారు. స్పైడర్ మ్యాన్ లాగా కేటీఆర్‌ చేసే విన్యాసాలు, జిమ్మిక్కులు జనం నమ్మరని తెలిపారు. ఆకుపచ్చని వజ్రం లాంటి మా రేవంత్ రెడ్డి ముందు నీ వేషాలు పనిచేయవన్నారు. కేటీఆర్‌కు ఫారానాయిడ్ స్కీజోఫ్రీనియా అనే వ్యాధి ఉందని.. అందుకే భ్రమల్లో బతుకున్నారని ఎద్దేవా చేశారు. మీడియా ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని కేటీఆర్‌ చీకటి గదుల్లో వీడియోలుచేసి పెడుతున్నాడని విమర్శించారు.


రేవంత్ రెడ్డి మొగోడు కాబట్టి నిన్ను ఓడించి ఇంట్లో కూర్బోబెట్టాడని, సీఎం కుర్చీ పోయిందన్న అక్కసుతోనే సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్‌ విమర్శలు చేస్తున్నాడన్నారు. సీఎం అంటూ నేమ్‌ బోర్డులు తయారు చేయించుకొని పెట్టుకొని సంతృప్తి పడాలని కేటీఆర్‌కు సూచించారు. రేవంత్ రెడ్డి ప్రభత్వాన్ని టచ్ చేస్తే తెలంగాణ ప్రజల స్పందన ఏమిటో తెలుస్తుందన్నారు. నీకు దమ్ముంటే సిరిసిల్ల ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మా మహేందర్ రెడ్డిపై గెలువాలని సవాల్ చేశారు.


కేటీఆర్ ఇంచార్జీగా ఉన్నప్పుడే మల్కాజ్ గిరిలో రేవంత్ రెడ్డి ఎంపీగా పోటీ చేసి గెలిచిన విషయాన్ని మరిచిపోయావా అంటూ గుర్తు చేశారు. నువ్వు మగాడివైతే నీ సిట్టింగ్ ఎంపీ సీట్లు నిలబెట్టుకోని చూపించాలన్నారు. బీఆరెస్ నేతల మేడిగడ్డ సందర్శన నేరస్తులే పరామర్శకు వెళ్లిన్నట్లుగా ఉందన్నారు. నువ్వు కాళేశ్వరం పోతున్నావని, నువ్వు ఏమైన ఇరిగేషన్ మంత్రివా లేక సీఎం నా..లేక ఇంజనీర్‌వా అంటూ ఎద్దేవా చేశారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆరెస్ దుకాణం మూతపడుతుందన్నారు. రేవంత్ రెడ్డిపై ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోబోమని కేటీఆర్‌ను హెచ్చరించారు.


తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ వేగుచుక్క వంటివాడన్నారు. రేవంత్ రెడ్డి కేటీఆర్‌కు సరైన మొగోడు అన్నారు. ప్రజల గుండెల నుంచి మా రేవంత్ రెడ్డి వచ్చాడని, నువ్వు అమెరికా నుంచి వచ్చావని సామేల్ విమర్శించారు. దేశంలోనే బలమైన నాయకుల జాబితాలో మా రేవంత్ రెడ్డికి 39 స్థానం వచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రాని పాలించే శక్తి ఒక్క రేవంత్ రెడ్డికి మాత్రమే ఉందన్నారు. మా ప్రభుత్వాన్ని ముడితే తిప్పతీగలా చుట్టుముడతామని హెచ్చరించారు.


మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్ నోరు అదుపులోకి పెట్టుకోవాలని, ఎంపీ ఎన్నికల తర్వాత నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెలుతావన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేసి చూపిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జీరో కరెంటు బిల్లులు ప్రారంభమయ్యాయన్న సంగతి మీకు కనిపించడ లేదా అని ప్రశ్నించారు.


భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రీడిజైన్ పేరుతో కాళేశ్వరాన్ని ఇష్టానుసారంగా నిర్మించి మీ కుటుంబ ధన దాహనికి ప్రాజెక్టును బలి చేశారన్నారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మేడిగడ్డకు వెలుతున్నారంటు నిలదీశారు. రాహుల్‌, ప్రియాంక గాంధీలను విమర్శించే స్థాయి కేటీఆర్‌కు లేదని, వాళ్లది త్యాగాల కుటుంబమైతే మీది దోపిడీ కుటుంబమని విమర్శించారు.


తెలంగాణలో ప్రజాపాలన నడుస్తోందన్నారు. ప్రజలు స్వేచ్చావాయువులు పీల్చుకుంటున్నరని గుర్తు చేశారు. కేటీఆర్ పిచ్చి ప్రేలాపనలు ఆపాలన్నారు. ప్రశ్నించే గొంతులుగా రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, ఉత్తమ్ లు గెలిచిన విషయాన్ని నీవు మరిచిపోయావా కేటీఆర్ అని ప్రశ్నించారు.

Exit mobile version