- రాజీనామాలకు మంత్రి సహా ఐదుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు సిద్ధం?
- ఒక కుటుంబానికి బానిసల్లా ఉండలేం
బెంగళూరు : కర్ణాటక కాంగ్రెస్‌లో టికెట్ల పంచాయితీ రాజుకున్నది. పార్టీకి రాజీనామా చేస్తామని ఐదుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు బుధవారం (27.03.2024) హెచ్చరించారు. కోలార్ లోక్‌సభ నియోజకవర్గం టికెట్‌ను ఆహారం, పౌర సరఫరాల శాఖ మంత్రి కేహెచ్ మునియప్ప కుటంబీకుడికి ఇవ్వడం పార్టీలో అసంతృప్తిని రాజేసింది. రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఎంసీ సుధాకర్ ఒక వార్త చానల్‌తో మాట్లాడుతూ.. కొందరు ఎమ్మెల్యేలు బానిసల్లా ఉండలేమని అన్నారు. కుటుంబాల్లో పార్టీ టికెట్లు పంచుకుంటున్నారని ఆరోపించారు. పార్టీలో ఇతరులకు కూడా అవకాశం రావాలని తాము కోరుకుంటున్నామని సుధాకర్ ఒక వార్త సంస్థతో చెప్పారు. ఈ విషయంలో తాము ముఖ్యమంత్రితో మాట్లాడుతామని తెలిపారు.
మునియప్ప పనితీరుతో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. షెడ్యూల్డ్ క్యాస్ట్ కమ్యూనిటీకి తగిన ప్రాతినిధ్యం దక్కడం లేదనే అభిప్రాయం సర్వత్రా ఉన్నదని అన్నారు. ‘ఈ కుటుంబం నుంచి కాకుండా మరొకరు అభ్యర్థిగా ఉండాలని మేం కోరుకుంటున్నాం’ అని సుధాకర్ స్పష్టంచేశారు. లేనిపక్షంలో తాము స్పీకర్‌ను కలిసి రాజీనామా పత్రాలు సమర్పిస్తామని చెప్పారు. పార్టీ అధినాయకత్వం తమ అభిప్రాయాలను వింటున్నదే కానీ.. తమ డిమాండ్లు పరిష్కరించడం లేదని ఆయన ఆరోపించారు. ఇదిలా ఉంటే.. పార్టీ నిర్ణయానికి తాను కట్టబడి ఉంటానని మునియప్ప చెప్పారు. ‘నేను పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకోనీయండి ముందు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
మార్చి 21వ తేదీన కాంగ్రెస్ కర్ణాటక నుంచి 17 మంది అభ్యర్థులతో లోక్‌సభ ఎన్నికలకు రెండో జాబితా విడుదల చేసింది. వీరిలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అల్లుడు, ఐదుగురు మంత్రుల కుమారులు ఉన్నారు. తొలి జాబితా మార్చి 8న విడుదలైంది. కోలార్ టికెట్‌ను తన కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఇవ్వాలని తాను కోరుకుంటున్నట్టు అంతకు ముందు కేహెచ్ మునియప్ప చెప్పారు. అయితే కొందరు నాయకులు మాత్రం రాజ్యసభ మాజీ సభ్యుడు ఎల్ హనుమంతయ్య పట్ల మొగ్గు చూపారు. లోక్‌సభ ఎన్నికలు కర్ణాటకలో ఏప్రిల్ 26, మే 7న రెండు విడుతల్లో జరుగనున్నాయి.