Site icon vidhaatha

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ‘ఉద్యోగ విప్లవం’

న్యూఢిల్లీ : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అధికారం అప్పగిస్తే దేశంలో ‘ఉద్యోగ విప్లవం’ తీసుకువస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గురువారం ప్రకటించారు. దేశంలోని యువతకు ఉద్యోగ హామీ ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరం నేత్వత్వంలోని కమిటీ రాబోయే సార్వత్రిక ఎన్నికలకు పార్టీ మ్యానిఫెస్టో ముసాయిదా ప్రతిని సమర్పించిన మరుసటి రోజు ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.

బుధవారం రాత్రి చిదంబరం, ఇతర ముసాయిదా కమిటీ సభ్యులు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆయన నివాసంలో కలిసి ముసాయిదా మ్యానిఫెస్టోను అందజేశారు. ‘న్యాయం’ ప్రాతిపదికగా మ్యానిఫెస్టోను రూపొందిస్తున్నారు. దీనిపై పార్టీ అత్యున్నత నిర్ణాయక వేదిక సీడబ్ల్యూసీ దీనిని ఖరారు చేయనున్నది.

‘2024 ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే యువతకు నియామకాలపై హామీ ఇవ్వడం ద్వారా కొత్త ఉద్యోగ విప్లవం మొదలవుతుంది’ అని ఖర్గే ఎక్స్‌లో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలను తాము అధికారంలోకి రాగానే భర్తీ చేస్తామని ఖర్గే హామీ ఇచ్చారు. ఇందుకోసం దరఖాస్తు నుంచి నియామకాల వరకూ కాలపరిమితిని కూడా ప్రకటిస్తామని తెలిపారు. ప్రభుత్వ లేదా ప్రైవేటు రంగంలో డిప్లమా లేదా డిగ్రీ కలిగి ఉన్న 25 ఏళ్లలోపు వారు శిక్షణ పొందేందుకు గాను అప్రెంటిస్‌ షిప్‌ హక్కు చట్టం తెస్తామని ప్రకటించారు.


కాగా.. వారికి శిక్షణ కాలంలో నెలకు 8,500 చొప్పున ఏడాదికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. పరీక్ష పత్రాల లీకేజీలను అరికట్టేందుకు కొత్త చట్టం తీసుకువస్తామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ప్రకటించారు. సంప్రదాయేర ఉద్యోగాలు చేస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్న కోట్ల మంది యువతకు మద్దతుగా ‘గిగ్‌ ఎకానమి’లో సామాజిక భద్రత, పని పరిస్థితుల మెరుగుదల కోసం కొత్త చట్టం తెస్తామని పేర్కొన్నారు.

యువ రోష్ని పథకం కింద 5000 కోట్ల రూపాయలతో ఒక నిధిని ఏర్పాటు చేస్తామని, దాని నుంచి దేశంలోని జిల్లాల్లో పంపిణీ చేస్తామని ఖర్గే చెప్పారు. 30 ఏళ్ల లోపు వయసున్నవారు ఆ నిధులతో సొంత వ్యాపారాలు, స్టార్టప్‌లు ప్రారంభించుకోవచ్చని తెలిపారు.

దేశ ప్రజల సర్వతోముఖాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని మ్యానిఫెస్టోను రూపొందించినట్టు మ్యానిఫెస్టో ముసాయిదా కమిటీ సభ్యుడు, ఎంపీ శశిథరూర్‌ అంతకు ముందు చెప్పారు. మ్యానిఫెస్టో తయారీకి అవసరమైన సలహాలు ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ 2024 జనవరి నెలలో ఒక వెబ్‌సైట్‌, ఈమెయిల్‌ ఐడీని ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Exit mobile version