బీజేపీది ట్యాక్స్‌ టెర్రరిజం : తాజా ఐటీ నోటీసులపై కాంగ్రెస్‌ ఆగ్రహం

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతున్నదని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాంరమేశ్‌ ఆరోపించారు

  • Publish Date - March 29, 2024 / 11:53 AM IST

న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతున్నదని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాంరమేశ్‌ ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీని ఆర్థికంగా బలహీనం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. గడిచిన సంవత్సరాల్లో ట్యాక్స్‌ రిటర్న్స్‌కు సంబంధించి వ్యతాసాలపై 1,823.08 కోట్లు చెల్లించాలంటూ ఆదాయం పన్ను శాఖ తాజాగా జారీ చేసిన నోటీసుపై ఆయన పై విధంగా స్పందించారు. శుక్రవారం (29.03.2024) న్యూఢిల్లీలో పార్టీ సీనియర్‌ నేత అజయ్‌మాకెన్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. పన్ను చట్టాలను బీజేపీ తీవ్రస్థాయిలో ఉల్లంఘించిందని అజయ్‌మాకెన్‌ ఆరోపించారు. కానీ.. ఈ ఉల్లంఘనలపై ఎన్నికల కమిషన్‌, ఆదాయం పన్నుశాఖ కళ్లు మూసుకున్నదని మండిపడ్డారు. బీజేపీ పన్ను ఎగవేత రూ.4,617.58 కోట్లుగా ఉన్నదని, ఈ మేరకు బీజేపీకి ఐటీ శాఖ నోటీసు జారీ చేయాలని డిమాండ్‌ చేశారు.

ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఉన్న బీజపీకి వచ్చిన విరాళాలపై తాము విశ్లేషణ జరుపగా.. 2017-18 ఆర్థిక సంవత్సరంలో కాషాయ పార్టీ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి 4.5 లక్షల రూపాయలకు సంబంధించి 92 విరాళాలు, చిరునామా లేని వ్యక్తుల నుంచి 1297 విరాళాల కింద రూ.42 కోట్లు స్వీకరించిందని తేలిందని మాకెన్‌ పేర్కొన్నారు.

దేశంలోని రాజకీయ పార్టీలకు ఇన్‌కం ట్యాక్స్‌ చట్టం 13వ సెక్షన్‌ కింద ఆదాయం పన్ను నుంచి మినహాయింపు ఉన్నా కాంగ్రెస్‌, ఇతర భావసారూప్యత కలిగిన ప్రతిపక్ష పార్టీలను మాత్రం బీజేపీ పెరటి సంస్థ ఆదాయం పన్నుశాఖ టర్గెట్‌ చేసుకున్నదని కాంగ్రెస్‌ పార్టీ ఒక ప్రకటనలో పేర్కొన్నది. వాస్తవానికి ప్రతియేటా పన్ను ఉల్లంఘనలకు పాల్పడుతున్నది బీజేపీ పార్టీయేనని స్పష్టం చేసింది.

గడిచిన రెండు సంవత్సరాల్లో బీజేపీకి 253 విరాళాల ద్వారా వచ్చిన 2.5 కోట్ల రూపాయలకు ఎలాంటి పేర్లు లేవని తమ విశ్లేషణలో తేలిందని అజయ్‌మాకెన్‌ చెప్పారు. ఈ రెండు సంవత్సరాల్లో చిరునామా పేర్కొనని 126 మంది దాతల ద్వారా 1.05 కోట్లు వచ్చాయని తెలిపారు. బీజేపీలో తప్పులపై కళ్లు మూసుకున్న ఐటీ, ఎన్నికల కమిషన్‌.. కాంగ్రెస్‌ను మాత్రమే టార్గట్‌ చేసుకున్నదని ఆయన ఆరోపించారు. తమ ఉల్లంఘనలను ఏ పద్ధతిలో వారు విశ్లేషించారో తాము సైతం అదే పద్ధతిలో బీజేపీ ఉల్లంఘనలను విశ్లేషించామని తెలిపారు. ఈ లెక్కన గడిచిన ఏడేళ్లలో ఆ పార్టీకి 4617.58 కోట్ల మేరకు జరిమానా విధించాలని అన్నారు. ఇదేం ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. పన్ను మినహాయింపు ఉన్న రాజకీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ నుంచి లోక్‌సభ ఎన్నికలకు ముందు బలవంతంగా ఎందుకు పన్ను వసూలు చేస్తున్నారు? అదే బీజేపీ నుంచి, దాని భాగస్వామ్య పార్టీలనుంచి ఎందుకు పన్ను వసూలు చేయడం లేదు? అని ఆయన నిలదీశారు. ఆదాయం పన్ను శాఖ డిమాండ్లపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు అజయ్‌ మాకెన్‌ చెప్పారు.

గడిచిన సంవత్సరాలకు సంబంధించి ట్యాక్స్‌ రిటర్న్స్‌లలో వ్యత్యాసాలకు 1700 కోట్ల రూపాయలకు ఐటీ శాఖ తాజాగా కాంగ్రెస్‌కు నోటీసు జారీ చేసింది. 2017-18 నుంచి 2020-21 మధ్య సంవత్సరాల్లో వ్యత్యాసాలకు గాను జరిమానా, వడ్డీ కలుపుకొని ఈ నోటీసును జారీ చేసింది. 2014-2021 మధ్య కాలంలో 523.87 కోట్ల రూపాయల మేర లెక్కలు చూపని లావాదేవీలు ఉన్నాయని పేర్కొంటూ ఐటీ శాఖ నోటీసు ఇచ్చిన కొద్ది రోజులకే తాజా తాఖీదు అందటం గమనార్హం. ఇటీవలే గత బకాయిల పేరుతో ఐటీ శాఖ కాంగ్రెస్‌ ఖాతాల నుంచి 135 కోట్ల రూపాయలను విత్‌డ్రా చేసుకున్న నేపథ్యంలో తాజా నోటీసులు ఆ పార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. లెక్కలు చూపని లావాదేవీల కింద పేర్కొన్న 523.87 కోట్ల రూపాయలను 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు నిర్వహించిన ఐటీ తనిఖీల్లో గుర్తించినట్టు ఆదాయం పన్ను శాఖ చెబుతోంది.

తన ఖాతాల నుంచి 135 కోట్ల రూపాయలను ఐటీ శాఖ విత్‌డ్రా చేసుకోవడాన్ని సవాలు చేస్తూ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (ఐటీఏటీ)లో కాంగ్రెస్‌ పార్టీ అప్పీల్‌ దాఖలు చేసినా, ఓడిపోయింది. ఐటీ శాఖ సోదాలను సవాలు చేస్తూ మార్చి 22న ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఇవన్నీ కాలదోషం పట్టినవని, చర్యలు తీసుకోవడంలో జాప్యం జరిగినవని కాంగ్రెస్‌ ఆరోపిస్తున్నది.

Latest News